జట్టు నుంచి తప్పుకోవడమే ధోనికి మంచిది – గంభీర్

Gautam Gambhir, జట్టు నుంచి తప్పుకోవడమే ధోనికి మంచిది – గంభీర్

ముంబై: భారత మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్‌పై గత కొద్దిరోజులుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. వరల్డ్‌కప్ 2019 ముగిసిన అనంతరం ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అందరూ ఊహించగా.. అటు బీసీసీఐ నుంచి కానీ, ధోని నుంచి కానీ ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు కోహ్లీసేన ప్రపంచకప్ గెలిచి ధోనికి ఘనంగా వీడ్కోలు పలకాలని భావించింది. అయితే సెమీఫైనల్‌లో న్యూజిలాండ్ చేతిలో 18 పరుగుల తేడాతో ఓటమిపాలై.. టోర్నీ నుంచి నిష్క్రమించింది.

టీమిండియా కొద్దిరోజుల్లో విండీస్ పర్యటనకు సన్నద్ధం అవుతోంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రపంచకప్ ముగిసిన తర్వాత గురువారమే స్వదేశానికి చేరుకున్నాడు. దీంతో సెలక్షన్ కమిటీ ఇవాళ జరగాల్సిన సమావేశాన్ని చివరి నిమిషంలో వాయిదా వేశారు. ఇకపోతే విండీస్ పర్యటనకు వెళ్లే జట్టులో ధోనికి చోటు దక్కుతుందా..? లేదా అనే సందిగ్దత ఇంకా కొనసాగుతోంది. ఒకవేళ అతనికి జట్టులో చోటు లభించకపోతే.. రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే ఊహాగానాలు కూడా ఊపందుకున్నాయి.

ఇది ఇలా ఉండగా ధోని రిటైర్మెంట్‌పై టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ధోని జట్టు కోసం ఎంతో చేశాడు. ఇప్పటికైనా యువ క్రికెటర్లను దృష్టిలో పెట్టుకుని తన భవిష్యత్తు నిర్ణయాన్ని తీసుకోవాలని గంభీర్ తెలిపాడు. ధోని కెప్టెన్‌గా ఉన్నప్పుడు కూడా భవిష్యత్తు గురించే ఆలోచించేవాడు.. ఇప్పుడు కూడా భవిష్యత్తును ఆలోచించడం మంచిదని చెప్పుకొచ్చాడు. భావోద్వేగం కంటే జరుగుతుందనే నమ్మకం ఉన్న నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని గంభీర్ అన్నాడు.

‌”నాకు ఇప్పటికీ గుర్తు… ఆస్టేలియాలో గ్రౌండ్‌లు పెద్దగా ఉంటాయి కాబట్టి సచిన్, సెహ్వాగ్ ఆడలేరని అన్నాడు. వచ్చే ప్రపంచకప్‌లో యువ ఆటగాళ్లు కావాలని ధోని ఆలోచించేవాడని.. ఆనాటి జ్ఞాపకాలను గంభీర్ గుర్తు చేసుకున్నాడు. రిషబ్ పంత్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ లాంటి యువ ఆటగాళ్లు వికెట్ కీపర్‌గా ఎదగాలంటే కొద్ది సమయం పడుతుందని.. వారికీ అవకాశం కల్పించాలని కోరాడు. కాగా వచ్చే వరల్డ్‌కప్‌కు వికెట్ కీపర్ ఎవరనే దానిపై బీసీసీఐ స్పష్టతకు రావాలని గంభీర్ అన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *