రెండు నెలల ‘కాపురం’.. వర్షాలే వర్షాలు.. కప్పలజంటకు ‘విడాకులు’

Frogs divorced after 2 months of marriage in Madhya Pradesh, రెండు నెలల ‘కాపురం’.. వర్షాలే వర్షాలు.. కప్పలజంటకు ‘విడాకులు’

విడాకుల చరిత్రలోనే ఇదో అరుదైన ఘటన. రెండు కప్పలకు విడాకులను ఇచ్చేశారు ఓ పట్టణవాసులు. అంతేకాదు వేదమంత్రాల సాక్షిగా, వైభవంగా ఈ వేడుకను నిర్వహించారు. ఇక ఈ సంఘటన ఎక్కడో జరిగింది కాదు.. మన దేశంలో జరిగిందే. కాస్త విడ్డూరంగా ఉన్నా.. మీరు చదువుతున్నది మాత్రం నిజంగా నిజమండి.

వివరాల్లోకి వెళ్తే.. భారీ వర్షాలతో మధ్యప్రదేశ్ తడిసి ముద్దవుతోంది. కానీ వర్షాకాలం ప్రారంభంలో అక్కడ పరిస్థితి ఇలా లేదు. ముఖ్యంగా రాజధాని భోపాల్ వాసులు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొన్నారు. తాగడానికి కూడా అక్కడ నీరు దొరకలేదు. దీంతో భోపాల్ పట్టణవాసులు వరుణుడి అనుగ్రహం కోసం రెండు కప్పలకు పెళ్లి చేశారు. ఆ తరువాత దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. ఇక మధ్యప్రదేశ్‌లో సాధారణం కంటే 26శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఈ కుండపోత వర్షాలతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

గడిచిన 24 గంటల్లో భోపాల్‌లో 48 మి.మీల వర్షపాతం నమోదైంది. దాంతో డ్యామ్‌ల గేట్లు అన్ని తెరిచి నీటిని కిందకు వదులుతున్నారు. ఈ క్రమంలో వర్షాలను ఆపేందుకు అక్కడి ప్రజలు ఓ వినూత్న చర్యకు పూనుకున్నారు. అప్పుడు వర్షాల కోసం కప్పలకు పెళ్లి చేస్తే.. ఇప్పుడు ఆ కప్పల జంటకు విడాకులు ఇప్పించారు. ఇంద్రపూరి ప్రాంతానికి చెందిన శివ్ సేవా శక్తి మండల్ సభ్యులు రెండు నెలల క్రితం తాము పెళ్లి చేసిన కప్పలను విడదీశారు. కానీ అక్కడ ఇంకా వర్షాలు ఆగకపోవడం విశేషం. కాగా భోపాల్ ఒక్కటే కాదు వర్షాలు రాకపోతే భారతదేశంలోని పలు ప్రాంతాల్లో కప్పలకు పెళ్లిళ్లు చేయడం సర్వసాధారణంగా మనం చూస్తూనే ఉంటాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *