బాబు బుజ్జగించినా వినలేదు.. రేపు బీజేపీలోకి మాజీ మంత్రి

Former Minister Adinarayana Reddy to join BJP?, బాబు బుజ్జగించినా వినలేదు.. రేపు బీజేపీలోకి మాజీ మంత్రి

ఏపీలో టీడీపీకి షాక్‌ల మీద షాక్‌లు పడుతున్నాయి. ఇప్పటికే పార్టీలోని కీలక వ్యక్తులందరూ టీడీపీని వీడగా.. తాజాగా మరో మాజీ మంత్రి కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బీజేపీలోకి చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. రేపు ఆయన కాషాయ కండువా కప్పుకునే అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది.

కాగా కడప జిల్లాకు చెందిన ఆదినారాయణ రెడ్డి 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచి.. ఆ తరువాత టీడీపీలోకి వెళ్లారు. ఈ క్రమంలో చంద్రబాబు ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చాడు. అయితే ఈ సారి ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం, టీడీపీ కూడా అధికారంలో లేకపోవడంతో గత కొన్ని రోజులుగా ఆది నారాయణ సైలెంట్‌ అయ్యారు. మరోవైపు ఆయన బీజేపీలో చేరుతారని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. కడప జిల్లాలో బలమైన నేత కోసం అన్వేషిస్తున్న బీజేపీ.. ఆదినారాయణ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడం కోసం కొంతకాలంగా చర్చలు జరుపుతోందని ప్రచారం కూడా జరిగింది. ఇక ఇదే జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, ఎంపీ సీఎం రమేష్ కూడా బీజేపీ కండువా కప్పుకోవడంతో ఆయన ద్వారా ఆదినారాయణరెడ్డిని పార్టీలోకి తీసుకువచ్చేలా చర్చలు జరుగుతున్నాయని ఊహాగానాలు వినిపించాయి.
Former Minister Adinarayana Reddy to join BJP?, బాబు బుజ్జగించినా వినలేదు.. రేపు బీజేపీలోకి మాజీ మంత్రి

కాగా మరోవైపు ఇటీవలే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఆదినారాయణ రెడ్డి సుమారు గంటసేపు భేటీ అయ్యారు. ఈ భేటీలో జమ్మలమడుగులో తన అనుచరులపై వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారని, అందుకు బీజేపీలో చేరడమే ప్రత్యామ్నాయం అని ఆయన బాబుతో చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయంలో ఆదినారాయణ రెడ్డిని చంద్రబాబు బుజ్జగించినా.. ఆయన వినలేదని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *