Cricket: స్పిరిట్ ఆఫ్ క్రికెట్ ఫర్ ది డికేడ్ అవార్డు ధోనికి ఎందుకు దక్కిందో తెలుసా..?

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి ఐసీసీ దశాబ్దపు స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు దక్కింది. అయితే ధోనికి ఈ అవార్డు ఎలా దక్కిందో.. ఎందుకు దక్కిందో మీకు తెలుసా... అయితే ఈ ఆర్టికల్ చదివేయండి...

Cricket: స్పిరిట్ ఆఫ్ క్రికెట్ ఫర్ ది డికేడ్ అవార్డు ధోనికి ఎందుకు దక్కిందో తెలుసా..?
Follow us

| Edited By:

Updated on: Dec 29, 2020 | 5:37 AM

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి ఐసీసీ దశాబ్దపు స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు దక్కింది. అయితే ధోనికి ఈ అవార్డు ఎలా దక్కిందో.. ఎందుకు దక్కిందో మీకు తెలుసా… అయితే ఈ ఆర్టికల్ చదివేయండి…

రనౌట్ అప్పీలు వెనక్కి తీసుకోవడంతో…

2011లో ఇంగ్లాండ్ టూర్‌కి వెళ్లిన భారత్ జట్టు.. రెండో టెస్టు మ్యాచ్‌లో శతకం బాదిన ఇయాన్ బెల్‌ని రనౌట్ చేసింది. కానీ.. టీమిండియా క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ఆ రనౌట్ చేసిందని ఆరోపించిన ఆ దేశ అభిమానులు.. స్టేడియంలో పెద్ద ఎత్తున ధోనీ ఛీటర్.. ఛీటర్ అంటూ నినాదాలు చేశారు. కానీ.. నిమిషాల వ్యవధిలోనే ధోనీ హీరో అంటూ ఆ అభిమానులు ప్రశంసించారు. దానికి కారణం.. ఇయాన్ బెల్ రనౌట్‌ అప్పీల్‌ని కెప్టెన్‌ ధోనీ వెనక్కి తీసుకోవడమే. ఆ నిర్ణయమే ధోనీకి ఇప్పుడు అవార్డుని వరించేలా చేసింది.

జరిగింది ఇదే…

రెండో టెస్టు మ్యాచ్‌లో టీ విరామానికి ముందు ఇషాంత్ శర్మ విసిరిన చివరి బంతిని ఇయాన్ బెల్ (137) పాయింట్ దిశగా హిట్ చేశాడు. ఆ బంతిని వెంటాడుతూ వెళ్లిన ఫీల్డర్ ప్రవీణ్ కుమార్.. బౌండరీ లైన్ వద్ద దాన్ని నిలువరించాడు. కానీ.. బంతిని ఆపే క్రమంలో నియంత్రణ కోల్పోయి బౌండరీ లైన్ వెలుపలికి ప్రవీణ్ వెళ్లిపోగా.. బంతి కూడా బౌండరీ లైన్‌కి తాకినట్లు కనిపించింది. దాంతో.. అప్పటికే మూడు పరుగులు పూర్తి చేసిన ఇయాన్ బెల్- ఇయాన్ మోర్గాన్ జోడీ.. నాలుగో పరుగు కోసం ట్రై చేసి బంతి బౌండరీ లైన్‌ని తాకినట్లు కనిపించడంతో పిచ్ మధ్యలోనే ఆగిపోయారు. అయితే.. నింపాదిగా బంతిని అందుకున్న ప్రవీణ్ కుమార్ బంతిని నేరుగా వికెట్ కీపర్ ధోనీ చేతికి ఇవ్వగా.. అతను వికెట్లకి సమీపంలోని ఫీల్డర్‌ అభినవ్ ముకుంద్‌కి విసిరి రనౌట్ చేయమన్నాడు. బంతితో వికెట్లని గీరాటేసిన ముకుంద్.. రనౌట్ కోసం అప్పీల్ చేశాడు.

సచిన్ సూచనతో…

టీమిండియా రనౌట్ అప్పీల్‌తో చర్చలు జరిపిన ఫీల్డ్ అంపైర్లు.. తొలుత బంతి డెడ్ కాలేదని నిర్ధారించుకుని.. ఆ తర్వాత బౌండరీకి వెళ్లిందా..? అని పరిశీలించగా.. లేదని తేలింది. దాంతో.. రనౌట్ అప్పీల్‌ని థర్డ్ అంపైర్‌‌కి నివేదించగా.. రిప్లైని పరిశీలించిన థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. కానీ.. భారత్ క్రీడాస్ఫూర్తి తప్పిదంటూ ఆ దేశ అభిమానులు స్టేడియంలో పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ నిరసనల మధ్యే టీ విరామానికి వెళ్లిన భారత్ జట్టు.. డ్రెస్సింగ్ రూములో ఉన్న సమయంలో.. ఇంగ్లాండ్ అప్పటి కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్ స్వయంగా అక్కడికి వెళ్లి.. ఆ రనౌట్ అప్పీల్‌ని వెనక్కి తీసుకోవాలని కెప్టెన్ ధోనీని కోరాడు. దాంతో.. టీమ్‌‌తో చర్చించిన ధోనీ.. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సూచన మేరకు.. ఆ అప్పీల్‌ని వెనక్కి తీసుకున్నాడు. ఆ మ్యాచ్‌లో ఆఖరికి ఇయాన్ బెల్ (159: 206 బంతుల్లో 24×4) టాప్ స్కోరర్‌గా నిలవగా.. భారత్ జట్టు 319 పరుగుల భారీ తేడాతో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది. కానీ.. ఆ రనౌట్ అప్పీల్‌ని వెనక్కి తీసుకున్న ధోనీ‌ని ఆ దేశ మీడియా ఆకాశానికెత్తేసింది.