కొడుకు చేసిన అప్పులకు తండ్రి బలి.. బ్యాంకర్లు, ఫైనాన్సియర్ల ఒత్తిడే కారణమంటూ సూసైడ్ నోట్

అప్పుల వాళ్ల వేధింపులు భరించలేక మరో నిండు ప్రాణం పోయింది. కుమారుడు చేసిన అప్పులు చెల్లించాలని బ్యాంకర్లు, ఫైనాన్స్‌ నిర్వాహకులు ఒత్తిడితో ఓ వ్యాపారి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

కొడుకు చేసిన అప్పులకు తండ్రి బలి.. బ్యాంకర్లు, ఫైనాన్సియర్ల ఒత్తిడే కారణమంటూ సూసైడ్ నోట్
suicide attempt
Follow us

|

Updated on: Dec 25, 2020 | 6:57 PM

అప్పుల వాళ్ల వేధింపులు భరించలేక మరో నిండు ప్రాణం పోయింది. కుమారుడు చేసిన అప్పులు చెల్లించాలని బ్యాంకర్లు, ఫైనాన్స్‌ నిర్వాహకులు ఒత్తిడితో ఓ వ్యాపారి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం కోనూర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక లయన్స్‌క్లబ్‌ మండల అధ్యక్షుడు తీర్థాల భాస్కర్‌(52) కోనూర్‌లో ఎరువుల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఆయన పెద్ద కుమారుడు వెంకటేష్‌ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ కంపెనీ స్థాపించి నష్టాలపాలయ్యారు. దీంతో రెండేళ్ల కిందట స్వగ్రామానికి వచ్చి సొంత వ్యాపారాన్ని చూసుకుంటున్నాడు. ఇందులో భాగంగా ఫైనాన్స్‌లో లారీ తీసుకుని ట్రాన్స్‌పోర్టు వ్యాపారంలో రాణిస్తున్నాడు. కాస్త లాభాలు వస్తుండడంతో పలు ప్రైవేట్‌ బ్యాంకర్లతో పాటు ఫైనాన్సియర్లను నుంచి ఒక్కొక్కటిగా ఏడు లారీలను కోనుగోలు చేశారు. తీసుకున్న రుణాలకు నెలకు రూ.5 లక్షల చొప్పున వాయిదాలు చెల్లిస్తున్నాడు.

ఇదిలావుంటే, కరోనా లాక్‌డౌన్‌ కారణంగా రవాణా వ్యవస్థ స్తంభించడంతో వ్యాపారం సాగక చెల్లించాల్సిన నెలవారీ కిస్తీలు పేరుకుపోయాయి. దీంతో వాయిదాలు చెల్లించలేక వ్యాపారం నడవకపోవడంతో వెంకటేష్ తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్నాడు. అయితే, అతను చేసిన అప్పులు చెల్లించాలంటూ బ్యాంకర్లు, ఫైనాన్సియర్లు తరచూ స్థానికంగా ఉండే భాస్కర్‌ను వేధించడంతో మనస్థాపానికి గురయ్యారు. ఇదే క్రమంలోనే గురువారం తెల్లవారుజామున గ్రామ శివారులో ఉన్న తన వ్యవసాయ క్షేత్రంలో పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన చావుకు బ్యాంకర్లు, ఫైనాన్సు ఇచ్చిన వాళ్లే కారణమంటూ సూసైడ్‌ నోట్‌‌లో పేర్కొన్నారు. అలాగే, తన చొక్కాపైనా వారి పేర్లు, సెల్‌ఫోన్‌ నంబర్లు రాసుకున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.