ఫరూక్ పై కఠిన చట్ట ప్రయోగం.. కేంద్రానికి ‘సుప్రీం’ నోటీసు

Former Jammu and Kashmir chief minister Farooq Abdullah, ఫరూక్ పై కఠిన చట్ట ప్రయోగం.. కేంద్రానికి ‘సుప్రీం’ నోటీసు

జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై కేంద్రం అత్యంత కఠినమైన ‘ ప్రజా భద్రత చట్టాన్ని ‘ (పబ్లిక్ సేఫ్టీ యాక్ట్) ప్రయోగించింది. ఈ చట్టం కింద నిర్బంధిస్తే .. రెండేళ్ల వరకూ కేసు విచారణకు కూడా వీలు ఉండదు. ఫరూక్ ను అక్రమంగా హౌస్ అరెస్టు చేశారని, ఆయనను విడుదల చేయాలని కోరుతూ ఎండీఎంకె నేత వైగో దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు చేపట్టిన రోజే ఈ చట్టం కింద పోలీసులు ఫరూక్ ను అరెస్టు చేశారు. జమ్మూకాశ్మీర్లో శాంతి భద్రతలకు ఆయన విఘాతం కలిగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ‘ పబ్లిక్ ఆర్డర్ ‘ కింద మూడు నెలల స్వల్ప కాలంపాటు నిర్బంధంలోకి తీసుకోవచ్చు. ఇప్పటివరకు ఫరూక్ అబ్దుల్లా శీనగర్లోని తన నివాసంలో అనధికారిక గృహ నిర్బంధంలో ఉన్నారు. దీన్ని ఇక ‘ జైలు శిక్ష ‘ గా మార్చనున్నారు. ఒక సీనియర్ రాజకీయ నేత. ముఖ్యంగా ఎంపీ, మూడుసార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన 83 ఏళ్ళ వ్యక్తిపై పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ను ప్రయోగించడం ఇదే మొట్టమొదటిసారి. సాధారణంగా ఉగ్రవాదులను, లేదా వేర్పాటువాదులను, సంఘ వ్యతిరేక శక్తులను ఈ చట్టం కింద అరెస్టు చేస్తుంటారు.
కాశ్మీర్ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాన్ని విమర్శిస్తూ ఫరూక్ మీడియా ముందుకు వెళ్లిన పక్షంలో.. అది త్వరలో జరగనున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెబ్లీ సమావేశాల్లో ప్రభుత్వానికి ఇరకాట పరిస్థితిని సృష్టించవచ్చునని, బహుశా అందుకే ముందు జాగ్రత్త చర్యగా ఫరూక్ పట్ల ఈ చట్టాన్ని ప్రయోగించి ఉండవచ్ఛునని భావిస్తున్నారు.
కాగా-తన చిరకాల మిత్రుడైన ఫరూక్ ను విడుదల చేసేలా చూడాలని, తద్వారా ఆయన చెన్నైలో జరిగే ఓ కార్యక్రమానికి హాజరు కాగల్గుతారని వైగో దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ చర్యలు పూర్తి నిరంకుశంగా ఉన్నాయని వైగో తన పిటిషన్ లో ఆరోపించారు. అయితే కేంద్రం దీన్ని ఖండిస్తూ.. వైగో.. ఫరూక్ బంధువు కారని, ఫరూక్ ను రిలీజ్ చేయాలన్న ఆయన అభ్యర్థన చట్టాన్ని కాలరాయడమేనని పేర్కొంది. ఈ పిటిషన్ ను విచారించిన చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తో కూడిన త్రిసభ్య ధర్మాసనం కేంద్రంతో బాటు జమ్మూ కాశ్మీర్ కు కూడా నోటీసు పంపుతూ.. ఈ నెల 30 న ఈ పిటిషన్ పై తిరిగి విచారణ చేపట్టాలని తీర్మానించింది.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *