రెవెన్యూ ఉద్యోగుల ఆరాచకాలు.. రైతు వినూత్న నిరసన

తెలంగాణలో రెవెన్యూ అధికారుల అరాచక పర్వం కొనసాగుతూనే ఉంది. రైతులకు పట్టాపాస్ పుస్తకాలు ఇచ్చేందుకు తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ వారిని తిప్పించుకుంటున్నారు. చెప్పులరిగేలా తిరిగినా పాస్ పుస్తకాలు మాత్రం ఇవ్వడం లేదు. రికార్డులు తప్పులు సరిచేయరు. రాష్ట్రంలో నిత్యం రెవెన్యూ ఉద్యోగుల అరాచకాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో రెవెన్యూ ఉద్యోగుల తీరుపై రైతులు మండిపడుతున్నారు.

మహబూబాబాద్ జిల్లా గూడురు మండలం క్రిష్టాపురం గ్రామానికి చెందిన జగన్ అనే రైతుకి వారసత్వంగా 32 కుంటల భూమి వచ్చింది. కాని అధికారుల తప్పిదం వల్ల రెవెన్యూ రికార్డుల్లో భూమి వివరాలు లేకపోవడంతో తహశీల్దార్ కార్యాలయం చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నాడు. ఎన్నిసార్లు తిరిగినా రెవెన్యూ రికార్డుల్లో తన భూమి వివరాలు పొందుపరచకపోవడంతో విసుగుచెంది చొక్కా విప్పి అర్థనగ్న ప్రదర్శనతో తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసనకు దిగాడు. క్రిష్టాపురం గ్రామ వీఆర్వో నిర్లక్ష్యం వల్లే తనకు అన్యాయం జరుగుతోందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో గూడూరు తహశీల్దార్ కార్యాలయంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. తక్షణమే 32 కుంటల భూమిని పట్టాదారు పాస్ పుస్తకంలో నమోదు చేయాలని తహశీల్దార్‌ను వేడుకున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *