రైతుల ఆందోళన, రెండు రోజులు ముందుగానే చర్చలు, దిగి వచ్చిన కేంద్రం, నేడు రైతు సంఘాలతో భేటీ

కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు నిరసనగా పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల నుంచి వేలాదిగా ఢిల్లీ చేరిన అన్నదాతల 'ఢిల్లీ ఛలో' మార్చ్ సఫలం కానుందా ? వీరి భారీ ప్రదర్శనకు కేంద్రం తలొగ్గిందా ?

  • Umakanth Rao
  • Publish Date - 10:34 am, Tue, 1 December 20
రైతుల ఆందోళన, రెండు రోజులు ముందుగానే చర్చలు, దిగి వచ్చిన కేంద్రం, నేడు రైతు సంఘాలతో భేటీ

కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు నిరసనగా పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల నుంచి వేలాదిగా ఢిల్లీ చేరిన అన్నదాతల ‘ఢిల్లీ ఛలో’ మార్చ్ సఫలం కానుందా ? వీరి భారీ ప్రదర్శనకు కేంద్రం తలొగ్గిందా ? పోలీసుల లాఠీచార్జికి, వాటర్ క్యానన్లకు, బాష్పవాయు ప్రయోగానికి, గజగజ వణికించే చలిని సైతం లెక్క చేయకుండా సుదూర ప్రాంతాలనుంచి ట్రాక్టర్లలో, ట్రాలీలలో, కాలినడకన కదిలి వచ్చిన అన్నదాతలు తమ పంతం నెగ్గించుకోనున్నారా ? ఇన్ని ప్రశ్నలకు ఒకటే సమాధానం ! వీరితో చర్చలకు కేంద్రం రెండు రోజులు ముందుగానే-అంటే మంగళవారమే చర్చలకు ఆహ్వానించింది. నిజానికి ఈ నెల 3న (గురువారం) సంప్రదింపులకు పిలిచినప్పటికీ..తక్షణమే ఇవి జరగాలని రైతు సంఘాలన్నీ పట్టుబట్టాయి. ఎలాంటి ముందు షరతులు విధించరాదని కోరాయి. అలాగే కేంద్రం నిర్దేశించిన నిరంకారీ మైదానంలో కాకుండా రామ్ లీలా మైదానంలో ప్రదర్శనకు అనుమతించాలని కూడా కోరాయి.మొత్తం 32 రైతు సంఘాలతో కేంద్రం నేడు చర్చలు జరపనుంది. హోం మంత్రి అమిత్ షా నేడు బోర్డర్ రైజింగ్ డే ఫంక్షన్ ని కూడా రద్దు చేసుకున్నారు. చర్చలకు తాము సిధ్ధమని, చలి, కరోనా వైరస్ నేపథ్యంలో మూడో తేదీ బదులు ఈరోజే చర్చలకు తాము ఆహ్వానిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రకటించారు. మధ్యాహ్నం 3 గంటలకు విజ్ఞాన్ భవన్ లో చర్చలు జరుగుతాయని, ఇకనైనా మీ నిరసనను విరమించాలని ఆయన కోరారు. నిన్న, గత నెల 29 న అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, నరేంద్ర తోమర్ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో సుదీర్ఘ చర్చలు జరిపినప్పటికీ వాటి ఫలితం పెద్దగా లేకపోయింది. అటు-ఆందోళన చేస్తున్న రైతుల్లో ఒకరు గుండెపోటుతో గతరాత్రి మరణించాడు. పంజాబ్ లోని లూధియానాకు చెందిన గజన్ సింగ్ అనే ఈ రైతు టిక్రి బోర్డర్ వద్ద మృతి చెందాడు. అంతకు ముందు రెండు రోజుల క్రితం తను ప్రయాణిస్తున్న కారులోనే ఓ రైతు వాహనం దగ్దమై సజీవదహనం చెందాడు. గత 71 ఏళ్లలో నిన్న మొదటిసారి  అత్యంత శీతలవాతావరణం ఏర్పడింది.ఉత్తరాఖండ్ నుంచి వందలాది రైతులు నిరసన చేస్తున్న అన్నదాతలతో జత కలిశారు. టిక్రి, సింఘు బోర్డర్ వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను ధ్వంసం చేసి వీరు ముందుకు కదిలారు. పలు చోట్ల పోలీసులకు, వీరికి మధ్య ఘర్షణలు జరిగాయి. లాఠీచార్జికి సైతం వెరవకుండా వృధ్ద రైతులు కూడా ఈ ఆందోళనలో పాల్గొనడం విశేషం. ఇక ఇప్పటికే ఎన్డీయే నుంచి దీని మిత్ర పక్షమైన అకాలీదళ్ వైదొలగగా తాజాగా రాజస్థాన్ ఎంపీ హనుమాన్ బేణీవాల్ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ కూడా ఇదే సూచన చేసింది. రైతు సంఘాలతో వెంటనే చర్చలు జరగాలని, లేని పక్షంలో ఎన్డీయే నుంచి వైదొలగేందుకు రెడీగా ఉన్నామని హనుమాన్ బేనీవాల్ నిన్న కేంద్రానికి సవాల్ విసిరారు. తాను కూడా తమ రాష్ట్రానికి చెందిన లక్షలాది రైతులతో ఢిల్లీలో నిరసన ప్రదర్శనలో పాల్గొంటానని ఆయన హెచ్చరించారు. పరిస్థితి రోజురోజుకీ జటిలంగా మారడంతో కేంద్రం దిగిరాక తప్పలేదు.ఇక రైతుల ఆందోళన నేపథ్యంలో పంజాబ్, హర్యానా ముఖ్యమంత్రుల మధ్య ట్విటర్ వార్ రేగింది. రైతులను హర్యానా సీఎం మనోహర్  లాల్ ఖట్టర్ ఖలిస్తానీయులుగా ముద్ర వేయడం చిచ్చు రేపింది. నిన్నటికి నిన్న బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాలవీయ రైతులను ఖలిస్తానీయులుగా, టెర్రరిస్టులుగా పేర్కొని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై ధ్వజమెత్తారు. అటు మహారాష్ట్రలోని శివసేన కూడా రైతులకు మద్దతుగా తన సామ్నా పత్రికలో సుదీర్ఘ వ్యాసం రాసింది.