జగనే స్ఫూర్తి.. వైసీపీలో వి.వి.వినాయక్.?

Famous Director VV Vinayak May Join YSRCP Shortly, Latest Comments On Jagan Goes Viral

ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ సినిమాలను వదిలేసి రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారా.? ఆయన త్వరలోనే వైసీపీ కండువా కప్పుకోనున్నారా.? తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే వినాయక్ పొలిటికల్ ఎంట్రీ ఖాయమేనని స్పష్టమవుతున్నాయి. గతంలో వైఎస్ ఫ్యామిలీతో తమకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న అయన.. అవకాశం వచ్చినా నాడు రాజకీయాల్లోకి రాలేదు. అయితే ఇటీవల వినాయక్ కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా తూర్పు గోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయన వైసీపీ పార్టీ, జగన్‌పై చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలు.. వినాయక్ పాలిటిక్స్‌పై దృష్టి సారిస్తున్నారని అర్ధమవుతున్నట్లు విశ్లేషకులు అంటున్నారు.

విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన వినాయక్ తనదైన శైలి ప్రసంగంతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తనకు ఎలా మార్గదర్శకుడయ్యాడన్న విషయాన్ని చాలా ఆసక్తికరంగా వివరించాడు ఈ దర్శకుడు. సీఎంగా పదవీ ప్రమాణం చేసే సమయంలో జగన్ చేసిన ప్రసంగాన్ని ప్రస్తావించిన వినాయక్.. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం 4 కోట్ల మందిలో సీఎం అయ్యే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడు అని జగన్ అన్నారని – ఆ మాటలు తనకు బాగా నచ్చాయని చెప్పుకొచ్చారు.

ఆ మాటల వల్లే దర్శకుడిగా ఉన్న తాను నటుడిగా మారేందుకు జిమ్‌కు వెళ్తున్నానని వినాయక్ అన్నారు. ఇలా జగన్‌పై తనకు ఉన్న అభిమానాన్ని మాటల్లో వర్ణించారు. మొత్తంగా జగన్ చేసిన సదరు వ్యాఖ్యలు తన గమనాన్నే మార్చేసిందని ఆయన అన్నారు. దీని బట్టి చూస్తుంటే త్వరలోనే వినాయక్ వైసీపీ తీర్ధం పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఆయన ఎప్పుడూ రాజకీయాల గురించి ఓపెన్‌గా ప్రస్తావించలేదు. కొంతమంది నేతలు వైసీపీలోకి చేరతారని చెబుతుంటే.. మరికొందరు సినిమాల్లోనే కొనసాగుతారని అంటున్నారు. చూడాలి మరి ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారో.. లేదా జగన్‌కు సపోర్టర్‌గానే ఉంటారో.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *