లోక్ సభ ఓకె ..! రాజ్యసభతోనే చిక్కు .. !

ఢిల్లీలో ఆదివారం జరిగిన అఖిలపక్ష సమావేశం ఫలవంతంగా ముగిసిందని ప్రధాని మోదీ తెలిపారు. ఎన్నికల ఫలితాల అనంతరం మొదటిది, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు జరిగిన ఈ భేటీకి హాజరైన నేతలంతా విలువైన సూచనలు, సలహాలు ఇచ్చారని మోదీ ట్వీట్ చేశారు. ప్రజల ఆశలు తీర్చేలా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రశాంతంగా, సజావుగా జరిగేలా చూసేందుకు వీరంతా అంగీకరించారని ఆయన పేర్కొన్నారు. రాజ్యసభలో ముఖ్యమైన బిల్లులు ఆమోదం పొందాలంటే ప్రభుత్వానికి అన్ని పార్టీలు… ముఖ్యంగా విపక్షాల మద్దతు అవసరం. ఈ సభలో ప్రభుత్వం ఇంకా మైనారిటీలోనే ఉంది. 545 సీట్లున్న లోక్ సభలో ఎన్డీయేకి 353 మంది సభ్యులతో కూడిన సాధారణ మెజారిటీ ఉంది. కానీ 245 మంది సభ్యులున్న రాజ్యసభలో ఈ కూటమికి 102 మంది ఎంపీలే ఉన్నారు.

త్రిపుల్ తలాక్ వంటి అత్యంత ముఖ్యమైన బిల్లుల ఆమోదానికి ఇది అవరోధంగా మారింది. గత ఎగువ సభలో ఈ బిల్లును ప్రతిపక్షంతో బాటు బీజేపీ మిత్ర పక్షమైన జేడీ-యు కూడా వ్యతిరేకించింది. ఈ బిల్లులో పలు సవరణలు చేయాలని కోరింది. దీన్ని పార్లమెంట్ సెలక్ట్ కమిటీకి పంపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా-ఆదివారం జరిగిన అఖిల పక్ష భేటీకి ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషీ, అర్జున్ రామ్ మేఘవల్, రాజ్ నాథ్ సింగ్, సీనియర్ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్, తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు డెరెక్ ఓ బ్రెన్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా తదితరులు హాజరయ్యారు. ఇదిలా ఉండగా.. జులై 5 న కేంద్ర బడ్జెట్ ను ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *