ప్రమాదంలో శ్రీశైలం డ్యామ్.. మరమ్మత్తు చేయకపోతే భారీ ముప్పు

తెలుగు రాష్ట్రాలకు సాగు, తాగు నీటి తో పాటు భారీ స్థాయిలో విద్యుత్తు వెలుగులు అందిస్తూ, చెన్నై మహానగరానికి తాగునీటిని అందిస్తున్న బహుళ ప్రయోజనకారి శ్రీశైలం డ్యాం ఇంకా ప్రమాదం లోనే ఉందా?

ప్రమాదంలో శ్రీశైలం డ్యామ్.. మరమ్మత్తు చేయకపోతే భారీ ముప్పు
Follow us

|

Updated on: Oct 30, 2020 | 10:16 AM

తెలుగు రాష్ట్రాలకు సాగు, తాగు నీటి తో పాటు భారీ స్థాయిలో విద్యుత్తు వెలుగులు అందిస్తూ, చెన్నై మహానగరానికి తాగునీటిని అందిస్తున్న బహుళ ప్రయోజనకారి శ్రీశైలం డ్యాం ఇంకా ప్రమాదం లోనే ఉందా? ఆ ప్రమాదం ఇంకా పెద్దదవుతుందా? నిపుణులు హెచ్చరిస్తున్నా … మరమ్మతులు ఆలస్యం చేసే కొద్దీ మహా ప్రమాదం ముప్పు దగ్గర్లోనే పొంచిఉందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇప్పటికైనా జాగ్రత్తపడకుంటే భారీ ప్రమాదం సంభవించవచ్చని హెచ్చరిస్తున్నారు.

మల్లన్న చెంతనున్న శ్రీశైలం ప్రాజెక్ట్ ప్రమాదంలో ఉందని.. మరమ్మతు చేయకపోతే ప్రమాదం తప్పదని నీటిపారుదల శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. శ్రీశైలం డ్యాంకు ప్రత్యేకించి గేట్ల నుంచి విడుదల చేసే నీరు కిందకు పడే ప్రాంతంలో (ప్లంజ్‌పూల్‌)నూ, దిగువన కుడి, ఎడమ గట్ల వైపు భారీగా మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉందని నిపుణుల కమిటీ సూచించింది. డ్యాం గేట్ల నుంచి నీటిని విడుదల చేసినపుడు కిందపడి మళ్లీ ఎగిరి పడే చోట భారీ స్థాయిలో గుంతలు ఏర్పడ్డాయని, అవి క్రమేపీ డ్యాం వైపు విస్తరించే అవకాశం ఉన్నట్లు నిపుణుల కమిటీ పేర్కొంది.

డ్యాం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు. గరిష్ఠ స్థాయి నీటిమట్టం 892 అడుగులు. స్పిల్‌వేకు 12 గేట్లు ఉండగా 13.5 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం వెళ్లేలా డిజైన్‌ చేశారు. ఇంతకంటే ఎక్కువ వచ్చినా 14.5 లక్షల క్యూసెక్కుల వరద వెళ్లడానికి అవకాశం ఉంది. వెయ్యేళ్లలో ఒకసారి గరిష్ఠంగా ఎంత వరద వచ్చే అవకాశం ఉందన్నదానిపై 2006లో అధ్యయనం చేయగా 26.5 లక్షల క్యూసెక్కుల వరకు రావచ్చని అంచనా వేశారు. 2009 అక్టోబరులో 25 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చినట్టు రికార్డయింది. డ్యాం గేట్లు పైన ప్రీబోర్డు వరకు నీరు రాగా నీటిపారుదల శాఖ లెక్కల ప్రకారం అది 896.5 అడుగుల నీటిమట్టంగా ఉంది. ఆ సమయంలోనే డ్యాం భద్రతపై చర్చ జరిగింది. అప్పటి నుంచి పలు ప్రత్యామ్నాయాలపై నిపుణుల కమిటీలు అధ్యయనం చేశాయి.

శ్రీశైలం డ్యామ్‌కు ప్రమాదం పొంచి ఉందని.. మరమ్మత్తులు చేయపోతే భారీ నష్టం తప్పదని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ సైతం హెచ్చరించారు. గంగాజల్ సాక్షరతయాత్రలో భాగంగా దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న సమయంలో ఆయన.. శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీశైలం ప్రాజెక్ట్ ప్రమాదంలో ఉందని.. మరమ్మతు చేయకపోతే ప్రమాదం తప్పదని హెచ్చరించారు.

2009లో శ్రీశైలానికి అనూహ్యంగా భారీ వరద వచ్చినపుడు దిగువన రెండు వైపులా దెబ్బతింది. అప్పటి నుంచి పలు కమిటీలు డ్యాంను పరిశీలించి అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తూ వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కేంద్ర జల సంఘం మాజీ ఛైర్మన్‌ ఎ.బి.పాండ్యా ఛైర్మన్‌గా, రాజగోపాలన్‌, వై.కె.కందా, పి.ఆర్‌.రావు, రౌతు సత్యనారాయణ, సుబ్బారావులు సభ్యులుగా ఏర్పాటు చేసిన కమిటీ ఈ ఏడాది మార్చి ఐదు నుంచి ఏడు వరకు పరిశీలించి డ్యాం భద్రతకు సంబంధించిన పలు అంశాలను గుర్తించింది. ప్లంజ్‌పూల్‌ 2009కి ముందు ఎలా ఉంది, తర్వాత ఎలా తయారైంది అన్నదానిపైన కమిటీ సూచన మేరకు బాత్‌ మెట్రిక్‌ స్టడీ చేయించారు. 2002-2019 మధ్య ఏమేరకు నష్టం వాటిల్లిందో తెలుసుకోవడానికి ఇది దోహదపడిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే, చేపట్టాల్సిన మరమ్మతులకు సంబంధించి పుణెలోని సెంటర్‌ ఫర్‌ వాటర్‌ అండ్‌ పవర్‌ రీసెర్చి సంస్థతో మోడల్‌ స్టడీస్‌ చేయించామని, డిజైన్ల తయారీ దశలో ఉందని, డిజైన్ల వచ్చిన తర్వాత కేంద్ర జల సంఘానికి పంపుతామని సంబంధిత వర్గాలు తెలిపాయి.

డ్యాం భద్రతకు ఎలాంటి నష్టం లేకుండా ప్లంజ్‌పూల్‌లో గుంతలు పూడ్చటంతో సహా పూర్తి స్థాయిలో అన్ని పనులూ చేయడానికి సుమారు రూ.900 కోట్లు అవసరమని సంబంధిత ఇంజినీర్లు అంచనా వేశారు. దీంతో శ్రీశైలం డ్యాం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల అవసరాలకు సంబంధించినది కాబట్టి మరమ్మతులకు అయ్యే ఖర్చును రెండూ భరించాలని, కేంద్రం కూడా సాయం చేయాలని ఇటీవల కేంద్ర జల్‌శక్తి మంత్రికి రాసిన లేఖలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ కోరారు.

శ్రీశైలం డ్యామ్ తక్షణ మరమ్మతులకు నిపుణులు సూచించిన ముఖ్యమైన అంశాలుః

  • ప్లంజ్‌పూల్‌లో ప్రత్యేకించి 6, 8 గేట్ల ఎదురుగా పెద్ద గుంతలు పడ్డాయి.
  • 100 మీటర్లకు పైగా లోతు ఉన్నట్లు గుర్తించాం.
  • 2002లో వేసిన కాంక్రీటు కూడా లేచిపోయింది. దీనిని తీవ్రంగా పరిగణించి తక్షణం పట్టించుకోవాలి.
  • దిగువన రెండువైపులా ఆప్రాన్‌లు దెబ్బతిన్నాయి.
  • రివర్‌ స్లూయిస్‌లలో లీకేజి ఉంది. పరీక్షించి బాగు చేయాలి.
  • ప్రధాన స్పిల్‌వే గేట్ల సీపేజి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.
  • వచ్చే భారీ వరదను మళ్లించడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టాలి.