మాజీ ఉపరాష్ట్రపతిపై ” రా ‘ సీరియస్ ! విచారణకు డిమాండ్ !

మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీపై రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ (‘ రా ‘) సీరియస్ అయింది. ఈ సంస్థకు చెందిన మాజీ అధికారులు కొందరు ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో అన్సారీ ఇరాన్ రాజధాని టెహరాన్ లో భారత రాయబారిగా ఉండగా.. తమ సంస్థ కార్యకలాపాలను దెబ్బ తీసేలా వ్యవహరించారని, భారత దేశ ప్రయోజనాలను కాపాడడంలో విఫలమయ్యారని వారన్నారు. 1990-92 మధ్యకాలంలో ఆయన ఇరాన్ లో ఈ పదవిలో ఉండగా.. ఆ దేశ ప్రభుత్వంతోనూ, ఆ దేశ ఇంటెలిజెన్స్ ఏజన్సీ.. ‘ సవక్ ‘ తోనూ కుమ్మక్కయ్యారని, ‘ రా ‘ కార్యకలాపాలను అడ్డుకునేందుకు యత్నించారని వీరు ప్రధాని మోదీకి రాసిన లేఖలో ఫిర్యాదు చేశారు. అన్సారీ సాగించిన మొత్తం వ్యవహారంలో వాస్తవాలు తెలుసుకునేందుకు విచారణ జరిపించాలని వీరు డిమాండ్ చేశారు. ఎన్.కె. సూద్ అనే మాజీ అధికారి 2017 ఆగస్టులో మొదట ప్రధాన మంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. తాజాగా ఇదే విషయాన్నిఆయన … ఓ డైలీతో..నాడు తాను ఎదుర్కొన్న అనుభవాలను వివరించారు. ఇరాన్ ప్రభుత్వ ఆదేశాలపై ‘ సవక్ ‘ ఏజన్సీ భారతీయ అధికారులను, దౌత్యవేత్తలను కిడ్నాప్ చేసినప్పటికీ అన్సారీ భారత ప్రయోజనాలను కాపాడకుండా నిర్లక్ష్యం వహించారని ఆయన చెప్పారు.పైగా ఇరాన్ సహా గల్ఫ్ లోని ‘ రా ‘ కార్యాలను మూసివేయాలని ఆ దేశ ప్రభుత్వానికి అన్సారీ సిఫారసు చేశారని పేర్కొన్నారు.
1991 ఆగస్టులో ఇరాన్ లోని ఓ మత సంస్థకు వెళ్లి ఆయుధ శిక్షణ పొందేందుకు ప్రయత్నించిన కొంతమంది కాశ్మీరీ యువకులపై ‘ రా ‘ నిఘా పెట్టగా.. ఆ ఆ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న ఓ అధికారి పేరును అన్సారీ ‘ సవక్ ‘ సంస్థకు తెలియజేశారని, దాంతో ఆ సంస్థ మాథుర్ అనే ఆ అధికారిని కిడ్నాప్ చేసిందని సూద్ గుర్తు చేశారు.
1992 లో ముంబైలో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనకు ముందు గల్ఫ్ లో ‘ రా ‘ యూనిట్లను నాశనం చేసేందుకు ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి రతన్ సెహగల్ తో కలిసి అన్సారీ చేతులు కలిపారని సూద్ తన ట్విట్టర్లో కూడా తెలిపారు. ఆ సంస్థలో నాడు అదనపు సెక్రటరీ హోదాలో ఉన్న సెహగల్ సీఐ ఏ తో కుమ్మక్కయ్యారని, ఢిల్లీలో ఈ సంస్థ ఏజెంట్ అయిన ఓ మహిళకు రహస్య డాక్యుమెంట్లను అందజేస్తూ పట్టుబడ్డారని ఆయన అన్నారు. అలాంటి వ్యక్తిని అరెస్టు చేసి జైలుకు పంపకుండా కేవలం ఆయన రాజీనామా కోరారని, ప్రస్తుతం ఆయన యుఎస్ లో సెటిల్ అయ్యారని సూద్ పేర్కొన్నారు. సెహగల్ ని స్వేఛ్చగా వదిలేయడంతో అన్సారీ ప్రమేయం ఉండవచ్ఛునన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇంకా మాజీ ఉపరాష్ట్రపతి ప్రమేయం కారణంగానే నాడు ‘ రా ‘ అధికారులైన పలువురిని ‘ సవక్ ‘ కిడ్నాప్ చేసినప్పటికీ ఆయన (అన్సారీ) కిమ్మనలేదన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ గానీ, దర్యాప్తు గానీ వెంటనే జరిపించాలని సూద్ డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *