ఆమిర్‌ ఖాన్‌పై నెటిజన్ల విమర్శలు.. ఎందుకంటే

బాలీవుడ్ మిస్టర్‌ పర్ఫెక్షనిస్ట్‌ ఆమిర్ ఖాన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. తన తదుపరి చిత్రం లాల్‌ సింగ్ చద్దా షూటింగ్‌ కోసం ఆమిర్‌ ఇటీవల టర్కీకి వెళ్లిన విషయం తెలిసిందే.

  • Tv9 Telugu
  • Publish Date - 11:38 am, Mon, 17 August 20
ఆమిర్‌ ఖాన్‌పై నెటిజన్ల విమర్శలు.. ఎందుకంటే

Aamir Khan in Turkey: బాలీవుడ్ మిస్టర్‌ పర్ఫెక్షనిస్ట్‌ ఆమిర్ ఖాన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. తన తదుపరి చిత్రం లాల్‌ సింగ్ చద్దా షూటింగ్‌ కోసం ఆమిర్‌ ఇటీవల టర్కీకి వెళ్లిన విషయం తెలిసిందే. కరోనాను సమయంలోనూ ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు అక్కడి వారు ఎగబడ్డారు. దానికి సంబంధించిన ఫొటోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే తన పర్యటనలో భాగంగా తాజాగా ఇస్తాంబుల్‌లో టర్కీ ప్రథమ మహిళ ఎమినే ఎర్డోగన్‌ని కలిశారు ఆమిర్‌.

ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించిన ఎమినే.. ”ప్రముఖ భారతీయ నటుడు ఆమిర్ ఖాన్‌ని కలవడం చాలా ఆనందంగా ఉంది. టర్కీలోని పలు ప్రాంతాల్లో లాల్‌ సింగ్ చద్దా షూటింగ్‌ను చేసినట్లు ఆమిర్ తెలిపారు. సినిమాను చూసేందుకు నేను ఎదురుచూస్తున్నా” అని కామెంట్ పెట్టారు. ఈ సందర్భంగా ఆమిర్‌తో తీసుకున్న ఫొటోలను కూడా ఆమె షేర్ చేశారు. అయితే దీనిపై నెటిజన్లు విమర్శలు కురిపిస్తున్నారు. టర్కీ దేశం ఎప్పుడూ భారత్‌కి వ్యతిరేకంగా ఉంటుందని, అలాంటి ఆ దేశ ప్రథమ మహిళతో ఆమిర్ సమావేశం అవ్వడం ఏంటని ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా కశ్మీర్ విషయంలో టర్కీ అధ్యక్షుడు పాక్‌కి మద్దతు ఇచ్చిన విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. భారతదేశంలో స్టార్‌ నటుడిగా పేరొందుతూ ఆమిర్ ఇలా చేసి ఉండకూడదంటూ వారు కామెంట్లు పెడుతున్నారు.