Tollywood: సమ్మర్ సీజన్ అంటే ఎలా ఉండాలి..? 2023 సమ్మర్‌కు ఏమైందసలు..?
సమ్మర్ సీజన్ అంటే ఎలా ఉండాలి..? అసలు మనకు తెలిసిన సమ్మర్ సీజన్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి..? వరసగా సినిమాలు వస్తుంటే.. అసలు వచ్చిన వాటికి థియేటర్స్ సరిపోతాయా లేదా అనే అనుమానాలు ఉండేవి.. ఏ సినిమా పక్కనబెట్టి దేనికి స్క్రీన్స్ ఇవ్వాలా అనే డైలమా నడిచేది. కానీ ఇప్పుడెలా ఉంది..? అసలు సినిమాలే లేక థియేటర్స్ కళ తప్పాయి. 2023 సమ్మర్‌కు ఏమైందసలు..?
సాధారణంగా సమ్మర్ సీజన్ ఎప్పుడూ కళకళలాడుతుంది.. ఈ సారి కూడా అదే ఊహించారంతా. పైగా మార్చ్ 30న వచ్చిన దసరా హిట్టవ్వడంతో సమ్మర్‌కు తిరుగులేదని మురిసిపోయారు. కానీ ఆ తర్వాత రావణాసుర, శాకుంతలం బోల్తా కొట్టి ఈ సమ్మర్ మునపట్లా ఉండదని హింటిచ్చేసాయి. మళ్లీ విరూపాక్ష విజయంతో ఆశలు రేగినా.. ఇప్పటికీ థియేటర్స్‌లో దాన్నే నడుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
విరూపాక్ష తర్వాత వచ్చిన ఏజెంట్ ఎపిక్ డిజాస్టర్. కనీసం 7 కోట్లు కూడా వసూలు చేయలేదు ఈ చిత్రం. ఆ తర్వాత వారం వచ్చిన రామబాణం, ఉగ్రం పరిస్థితి ఇంతే. వీటి కలెక్షన్స్ 5 కోట్లు మించలేదు. మరోవైపు మొన్నొచ్చిన కస్టడీ కూడా దారుణమే. టాక్ ఎలా ఉన్నా ఫస్ట్ వీకెండ్ కనీసం 5 కోట్ల షేర్ రాలేదు. దాంతో థియేటర్స్ అన్నీ వెలవెలబోతున్నాయి.
జూన్ 16న ఆదిపురుష్ వచ్చేవరకు పరిస్థితి ఇంతేనేమో..? ఇప్పటికీ చాలా థియేటర్స్‌లో ఆప్షన్ లేక విరూపాక్షనే రన్ చేస్తున్నారు. మరో నెల రోజులు ఈ గడ్డు పరిస్థితి ఎలా ఎదుర్కోవాలో తెలియక తల పట్టుకుంటున్నారు ఎగ్జిబిటర్లు. రానున్న 30 రోజుల్లో అన్నీ మంచి శకునములే, బిచ్చగాడు 2, సామజవరగమనా, మేం ఫేమస్, మళ్లీ పెళ్లి లాంటి సినిమాలు రానున్నాయి. వాటితో థియేటర్స్ ఫుల్ అవుతాయా అనేది ఆసక్తికరమే.
మరిన్ని సినిమా వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..