Kantara: ఆదిమ తెగల ఆర్తనాదం.. అంతకుమించిన ఆక్రోషం

'మాకు అడవి ముఖ్యం.. అడవిలో వన్యమృగాల రక్షణే ముఖ్యం-' అంటారు ఫారెస్టు అధికారులు. నాకు అర్థంగాక అడుగుతాను..ఆదివాసీలే లేకపోతే, ఈ పాటికి అడవి మిగిలివుండేదా?? మిగలనిచ్చేవారా?'

Kantara: ఆదిమ తెగల ఆర్తనాదం.. అంతకుమించిన ఆక్రోషం
Kantara Varaha Roopam
Follow us

|

Updated on: Nov 30, 2022 | 6:48 PM

కాంతారా..ఆదిమ ఆర్తనాదం

కాంతారా సినిమాలో కోలం కట్టిన మనుషులు అదృశ్యం కావడం ఎంత నిజమో కానీ..మట్టి కోసం పోరాడేవాళ్లు మాత్రం మట్టిలో కలిసిపోవడం వాస్తవం!

భూతకోలా ఆడే పంజూరీ చేసినవి అరుపులు కాదు..తరతరాల ఆదిమాతెగల ఆర్తనాదం..! అంతకుమించిన ఆక్రోశం!!

ఫారెస్టువాళ్లు రాకముందే అడవిలో బతుకుతున్నారు ఆదిమ తెగలు! చట్టాలు చేసి అడవిని ఎలా శాసించలేరో..అడవి బిడ్డలను కూడా అంతే! అడవిలో అణువణువూ కచ్చితంగా వారిదే!

కంబాల పోటీలో గెలిచిన తర్వాత కూడా పోరాడి మెడల్‌ సాధిస్తాడు శివ. పోరాడితే తప్ప గిరిజన ఆదివాసీలకు ఏదీ దక్కలేదని ఫస్ట్‌ సీన్‌తోనే చెప్పేశాడు దర్శకుడు రిషబ్‌శెట్టి.

మీరు అరకు వెళ్లండి..పాడేరు వెళ్లండి..ఆదిలాబాద్ అడవుల్లోకి వెళ్లండి..! గిరిజనుల భూముల్లో..వారి పేర్లతో..తిష్టవేసిన పెట్టుబడిదారుల దోపిడీని చూస్తున్నాం! కొత్త చట్టం వచ్చిన ప్రతిసారీ అడవి నుంచి ఆదివాసీ దూరం అవుతున్న నిజాన్ని కాదనలేం!!

మనం సిటీ విడిచి అడవిలోకి వెళ్లి ఎలా ఉండలేమో..అడవి విడిచి వాళ్లు ఇక్కడ ఇమడలేరు. అది వారి ఆవాసం, అస్తిత్వం..!

చాలాసార్లు చూశాను..గుక్కెడు నీళ్ల కోసం అడవి బిడ్డలు ఎంత దూరం నడిచివెళ్తారో..! దూప తీర్చుకోవడానికి ఓ బోరు వేసుకుంటే..రాత్రికిరాత్రి ఫారెస్టువాళ్లు బండలువేసి పోవడం నేను చూశాను. ‘ఓ జంతువుకి ఇచ్చిన విలువ మాకు లేదా? మేం మీ తోటి మనుషులం కాదా?’ అని గిరిజనులు ప్రశ్నిస్తుంటే..మన దగ్గర సమాధానం ఉండదు.

‘మాకు అడవి ముఖ్యం.. అడవిలో వన్యమృగాల రక్షణే ముఖ్యం-‘ అంటారు ఫారెస్టు అధికారులు. నాకు అర్థంగాక అడుగుతాను..ఆదివాసీలే లేకపోతే, ఈ పాటికి అడవి మిగిలివుండేదా?? మిగలనిచ్చేవారా? అసలు ఈ దేశంలో అడవి ఇంకా మిగిలివుందంటే..అది గిరిజన తెగల పుణ్యమే కదా!

అడవి నుంచి ఆదివాసీని తన్ని తరిమేయాలి..ఎంతసేపూ ఇదే ఆలోచన! అసలు అడవిని, అడవి బిడ్డలను కాంప్లిమెంట్‌ చేస్తూ.. ఎందుకు కొత్త చట్టాలు రావు? అడవికి వెళ్తే..ఫారెస్టోళ్ల పనీ, టూరిజం పనీ చేసేది గిరిజనులే కదా! వచ్చిన టూరిస్టుకి తొవ్వ చూపి..బువ్వ పెట్టే బాధ్యత గిరిజనులకు అప్పగిస్తే..ఇద్దరికీ ప్రయోజనం కదా! అమెజాన్‌లోనైనా, ఆస్ట్రేలియా అడవుల్లోనైనా జరుగుతున్నది ఇదే కదా! ఎందుకు అర్థం కాదు మనవాళ్లకి?

అసలు ఏ ఆనకట్ట కట్టినా..ఏ ప్రాజెక్టు చేపట్టినా భూములు కోల్పోయేది గిరిజన బిడ్డలే కదా! ఎందుకివ్వాలి వాళ్లు భూములు? మన అభివృద్ధి కోసం వాళ్లెందుకు నాశనం కావాలి? వాళ్ల ఊర్లు ఎందుకు జలసమాధి కావాలి? పోనీ మనం తిరిగి వాళ్లకేం ఇచ్చాం? హక్కుగా పొందాల్సిన నష్టపరిహారం కోసం, పునరావాసం కోసం.. దశాబ్దాలపాటు వాళ్లెందుకు అడుక్కోవాలి?

మనకు ఎలాగూ ప్రకృతితో కలిసి నడవడం చేతకాదు. కలిసి నడిచేవాళ్లను ఎందుకు ఉండనివ్వం? వద్దు మొర్రో అంటే వాళ్లను నగరానికి తెచ్చి ఎందుకు చంపడం?

పాడేరు, పోలవరం, వంశధార..ఆదిలాబాద్‌లో చాకిరేవు, మహారాష్ట్ర సరిహద్దుల్లోని పరందోలి, నాగర్‌కర్నూల్ జిల్లా కండ్లకుంట.. ఇలా కాంతారా చూస్తున్నంతసేపూ ఎంతోమంది బాధితులు కళ్లలో మెదిలారు!

పంజూరీ..మా కోసం కొంచెం గట్టిగా అరుస్తావా? తూర్పు కనుమల అరణ్యరోదన వినిపిస్తావా??

—-భాను కిరణ్, టీవీ9 తెలుగు డెస్క్