Dil Raju:ఐటీ కార్యాలయానికి నిర్మాత దిల్ రాజు.. ఏం జరగనుందంటే?
సంక్రాంతి పండుగ సందర్భంగా దిల్ రాజు నిర్మించిన రెండు సినిమాలు ‘గేమ్ ఛేంజర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ విడులయ్యాయి. ఈ సినిమాలు భారీ వసూళ్లు రాబట్టాయి. అయితే ఆయా సినిమాల నిర్మాణం, మూవీ రిలీజ్ ల తర్వాత లాభాల వ్యవహారానికి సంబంధించి దిల్ రాజు ఇంటిపై ఐటీ దాడులు జరిగాయి.

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిలిం డెలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు మంగళవారం (ఫిబ్రవరి 04) హైదరాబాద్‌లోని ఆదాయపు పన్ను (ఐటీ) ఆఫీస్‌కు వెళ్లారు. గతనెలలో దిల్‌రాజు, ఆయన కుటుంబసభ్యుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేశారు. పలు డాక్యుమెంట్లు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఐటీ అధికారుల నోటీసులు అందుకున్నారు దిల్‌రాజు. ఈ క్రమంలోనే మంగళవారం ఐటీ అధికారులు అడిగిన డాక్యుమెంట్లు, బ్యాంక్ స్టేట్‌మెంట్లతో ఎంక్వైరీకి వెళ్లారు. సంక్రాంతికి రిలీజైన భారీ బడ్జెట్ సినిమాలకు సంబంధించిన లెక్కలతోపాటు.. కొన్నేళ్లుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌కి సంబంధించిన లావాదేవీలపై IT టీమ్ ఫోకస్ పెట్టింది. తమ అకౌంట్లన్నీ పారదర్శకంగానే ఉన్నాయని చెప్తున్న దిల్ రాజు.. నాడు నోటీసుల సందర్భంగా ఆదాయాపన్ను శాఖ అధికారులు అడిగిన వివరాలతో ఇవాళ ఆయకార్ భవన్‌కి వెళ్లారు.
కాగా ఈ సంక్రాంతికి దిల్ రాజు నిర్మించిన గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. వందలాది కోట్ల కలెక్షన్లు రాబట్టాయి. ముఖ్యంగా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఏకంగా రూ. 300 కోట్ల కు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ నేపథ్యంలోనే ఆదాయ పన్ను శాఖ అధికారులు దిల్ రాజు ఇంట్లో దాడులు నిర్వహించారు. సుమారు నాలుగు రోజుల పాటు దిల్ రాజు ఆఫీస్, కుటుంబ సభ్యుల ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించారు. ఇక ఐటీ దాడులపై స్పందించిన దిల్ రాజు వ్యాపారాలు చేస్తున్నప్పుడు ఐటీ సోదాలు చాలా సర్వసాధారణమన్నారు. తమ లావాదేవీలన్నీ క్లీన్‌గా, చాలా క్లియర్‌గా ఉన్నాయని ఆయన చెప్పారు. ఐటీ అధికారుల తనిఖీల సమయంలో తమ వద్ద కేవలం రూ.20 లక్షల లోపు మాత్రమే నగదు ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించారని తెలిపారు. 24 క్రాఫ్ట్స్ ప్రొడక్షన్ హౌస్ నుంచి సంబంధించిన అన్ని లావాదేవీలను ఐటీ అధికారులు పరిశీలించారన్నారు. సంస్థ నుంచి లభ్యమైన డాక్యుమెంట్లు పరిశీలించిన తరువాత, అన్ని లావాదేవీలు పారదర్శకంగా ఉన్నాయని అధికారులు తమకు తెలిపారన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.