అలనాటి అందాల తార, తెలుగింటి సత్యభామ జమున మరణంతో సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తన అందం, అభినయంతో ఎన్నో వైవిధ్యమైన పాత్రలకు ప్రాణం పోసిన జమున ఇక లేరనే విషయాన్ని సినిమా తారలు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. హైదరాబాద్లోని తన స్వగృహంలో కన్నుమూసిన ఆమెకు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఈనేపథ్యంలో జమున పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మరణం సినీ పరిశ్రమకు తీరని లోటన్నారు. తొలితరం నటిగా వందలాది చిత్రాల్లో నటించి, తెలుగువారి అభిమాన తారగా వెలుగొందిన జమున జ్జాపకాలను సిఎం కేసీఆర్ స్మరించుకున్నారు. తెలుగు, తమిళం, కన్నడం లోనే కాకుండా హిందీ సినిమాలలోనూ నటించి ప్రేక్షకుల అభిమానాన్నిపొందిన జమున, నటిగా కళాసేవనే కాకుండా పార్లమెంటు సభ్యురాలిగా ప్రజాసేవ చేయడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా జమున కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
తెలుగు చలన చిత్ర పరిశ్రమ మొదటితరం నటీమణులలో అగ్రకథానాయకిగా వెలుగొంది తెలుగు వారి హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్న జమున గారు మృతి చెందడం బాధాకరం. ఆవిడ మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. జమున గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. pic.twitter.com/nDePyrPGri
— YS Jagan Mohan Reddy (@ysjagan) January 27, 2023
భారతీయ సంస్కృతికి నిలువెత్తు రూపం..
ఇక ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జమున మృతికి నివాళులు అర్పించారు. ‘తెలుగు చలన చిత్ర పరిశ్రమ మొదటి తరం నటీమణుల్లో అగ్ర కథానాయకిగా వెలుగొంది తెలుగు వారి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న జమున గారు మృతి చెందడం బాధాకరం. ఆమె మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు. జమున గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’ అని ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపారు సీఎం జగన్. వీరితో పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ ఫొటోగ్రఫీ శాఖమంత్రి తలసాని యాదవ్ జమున మృతికి సంతాపం తెలియజేశారు. ‘అలనాటి సినీనటి, మాజీ ఎంపీ, బీజేపీ నేత శ్రీమతి జమున గారు పరమపదించారని తెలిసి విచారం వ్యక్తం చేస్తున్నాను. విలక్షణమైన పాత్రల్లో ఒదిగిపోతూ అద్భుతమైన అభినయంతో ఆకట్టుకున్న జమున గారు పౌరాణిక పాత్రల్లో, మరీ ముఖ్యంగా ‘సత్యభామ’ పాత్రలో అద్భుతమైన అభినయంతో అభిమానుల గుండెల్లో చెరగని ముద్రవేసుకున్నారు. దక్షిణాది భాషలతోపాటు హిందీలోనూ నటించి బహుభాషానటిగా వెండితెరపై తనకంటూ ప్రత్యేకత గుర్తింపును సంపాదించుకున్నారు. విలక్షణమైన నటనతోపాటుగా సామాజిక అంశాలపైనా వారికి ఆసక్తి ఎక్కువగా ఉండేది. బీజేపీలో వారితో కలిసి పనిచేసిన సందర్భంలో నాకు వారితో వ్యక్తిగత అనుబంధం ఉంది. కలిసిన ప్రతిసారీ ఎంతో ఆత్మీయంగా పలకరించేవారు. చాలా అంశాలను పంచుకునేవారు. భారతీయత సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు రూపంగా నిలిచిన జమునగారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. వారి కుటుంబసభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని ప్రకటన విడుదల చేశారు కిషన్ రెడ్డి.
అలనాటి సినీనటి, మాజీ ఎంపీ, బీజేపీ నేత శ్రీమతి జమున గారు పరమపదించారని తెలిసి విచారం వ్యక్తం చేస్తున్నాను. దక్షిణాది భాషలతోపాటు హిందీలోనూ వివిధ పాత్రల్లో నటించి మెప్పించిన జమున గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబసభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలియజేస్తున్నాను. pic.twitter.com/7kqJlKYKXw
— G Kishan Reddy (@kishanreddybjp) January 27, 2023
తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జమున మృతికి సంతాపం వ్యక్తం చేశారు. సీనియర్ నటీమణి జమున మృతిచెందడం చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని తనను తీవ్రంగా కలిచి వేసిందన్నారు. తెలుగు మాత్రమే కాకుండా తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో నటించి తెలుగు వారి స్థాయిని పెంచేందుకు కృషి చేశారని ఆయన అన్నారు. జమున గారి ఆత్మకు శాంతి చేకూరాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ఆయన పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నానని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
తెలుగు సినిమా సీనియర్ నటి జమున గారి అకస్మిక మరణం దిగ్ర్భాంతికరం.
జమున గారి మరణం, తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటు.
వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. pic.twitter.com/Ey3a5WPqK4
— Talasani Srinivas Yadav (@YadavTalasani) January 27, 2023
మరిన్ని సినిమా వార్తల కోసంక్లిక్ చేయండి..