పెద్దిలో జాన్వి కపూర్ పాత్ర వివాదంపై స్పందించిన జయా బచ్చన్, కరీన్, నిత్యామీనన్..
‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ పాత్రను దర్శకుడు బుచ్చిబాబు రాసిన తీరుపై సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరుగుతుంది. చిన్నగా మొదలైన ఈ వివాదం.. చిలికి చిలికి గాలివానలా మారుతుంది. టాలీవుడ్ నుంచి మొదలై.. ముంబై హీరోయిన్స్ స్పందించే వరకు వచ్చింది. తాజాగా జాన్వీ వివాదంపై జయా బచ్చన్ సైతం స్పందించారు.

‘పెద్ది’ సినిమా వివాదం రోజురోజుకీ మరింత ముదురుతుంది. ఈ విషయంపై హీరోయిన్స్ అంతా ఏకం అవుతున్నారు. హీరోయిన్లను కేవలం గ్లామర్ కోసమే సినిమాల్లో వాడుకుంటున్నారంటూ ఇప్పటికే అషికా రంగనాథ్ ఓపెన్ అయ్యారు. అది మా తప్పు కాదు.. హీరోయిన్లకు మంచి పాత్రలు ఎందుకు రాయట్లేదో రైటర్స్‌ను అడగాలంటూ ఆమె ఫైర్ అయ్యారు. తాజాగా సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు జయా బచ్చన్ సైతం ఈ వివాదంపై స్పందించారు. సినిమాలో హీరోయిన్లను కేవలం గ్లామర్‌కే పరిమితం చేయడాన్ని జయా ఖండించారు. అది సెట్‌లోనే అడ్డుకోవాలని.. అంతా అయిపోయి సినిమా బయటికి వచ్చాక చేసేదేం ఉండదని ఆమె తెలిపారు. కెరీర్ మొదట్లో ‘షోర్’ సినిమా చేస్తున్నపుడు గాగ్రా ఛోళీలో ఓ సీన్ అసభ్యకరంగా చూపించాలని దర్శకుడు ప్రయత్నించినపుడు.. తాను సెట్‌లోనే గొడవ పెట్టుకున్నానని గుర్తు చేసుకున్నారు జయా బచ్చన్. ఆ తర్వాత అలాంటి సీన్స్ ఎవరూ తనకు చెప్పే ధైర్యం చేయలేదని.. హీరోయిన్లు ధైర్యంగా సెట్‌లోనే మాట్లాడాలని ఆమె తెలిపారు.
కరీనా కపూర్ సైతం ఈ విషయంపై స్పందించారు. రొమాన్స్ పేరుతో హీరోయిన్లతో కరుచ దుస్తులు వేయించాల్సిన అవసరం లేదని.. శ్రీదేవి, షర్మిలా ఠాకూర్ లాంటి ఎందరో నటీమణులు నిండుగా దుస్తులు ధరించి కూడా ప్రేక్షకులను మెప్పించారని గుర్తు చేసారు. సౌత్ హీరోయిన్ నిత్యా మీనన్ సైతం జాన్వీ వివాదంపై రియాక్ట్ అయ్యారు. తాను సినిమా చూడకపోయినా.. అమ్మాయిలను ఆటబొమ్మలుగా చూపించే విధానానికి తాను వ్యతిరేకం అన్నారు. నటీమణుల వర్షన్ ఇలా ఉంటే.. దర్శకుడు బుచ్చిబాబు మాత్రం జాన్వీ పాత్రను ఎందుకలా తీయాల్సి వచ్చిందో వివరణ ఇచ్చారు. హీరో పాత్ర ముందు మొరటుగా ఉండి.. హీరోయిన్ ప్రేమ వల్ల మారిపోతున్నట్లు చూపించాలనుకున్నామని.. కానీ స్క్రీన్ ప్లే వల్ల అపార్థాలు వచ్చాయని బుచ్చిబాబు తెలిపారు. ఇప్పటికే సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు తొలగించామని ఆయన తెలిపారు. మొత్తానికి ఈ వివాదం ఎక్కడ ముగుస్తుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
