‘సైరా’ క్లైమాక్స్: సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తుందా..!

'సైరా' క్లైమాక్స్: సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తుందా..!

అభిమానులు ఎప్పుడెప్పుడా అని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన ‘సైరా’ ట్రైలర్ వచ్చేసింది. ఆ ట్రైలర్‌ను చూసిన అందరూ మెగాస్టార్ చిరంజీవిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మీకు మీరే సాటి అంటూ కామెంట్లు పెడుతున్నారు. 64ఏళ్ల వయస్సులో ఆయన చేసిన యాక్షన్ సీన్లు అభిమానుల చేత విజిల్స్ వేయిస్తున్నాయి. మరోవైపు సెలబ్రిటీలు సైతం మెగాస్టార్ జిందాబాద్ అంటూ తమ సోషల్ మీడియాలో సైరా ట్రైలర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. కాగా తొలి స్వాతంత్ర్య […]

TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Sep 19, 2019 | 2:13 PM

అభిమానులు ఎప్పుడెప్పుడా అని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన ‘సైరా’ ట్రైలర్ వచ్చేసింది. ఆ ట్రైలర్‌ను చూసిన అందరూ మెగాస్టార్ చిరంజీవిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మీకు మీరే సాటి అంటూ కామెంట్లు పెడుతున్నారు. 64ఏళ్ల వయస్సులో ఆయన చేసిన యాక్షన్ సీన్లు అభిమానుల చేత విజిల్స్ వేయిస్తున్నాయి. మరోవైపు సెలబ్రిటీలు సైతం మెగాస్టార్ జిందాబాద్ అంటూ తమ సోషల్ మీడియాలో సైరా ట్రైలర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

కాగా తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ‘సైరా’ తెరకెక్కింది. ఆయనకు సంబంధించిన వాస్తవ కథను తెలుసుకొని మరీ ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ఎంత నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కినప్పటికీ సినిమా కాబట్టి అక్కడక్కడా కొంత నాటకీయత అన్నది సహజంగానే ఉంటుంది. కానీ జనన, మరణ విషయాలను అలా తీస్తే ప్రేక్షకులు అస్సలు ఒప్పుకోరు. ఇక ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ప్రకారం.. ఆయనను బహిరంగంగా ఉరి తీసింది అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం. అంతేకాదు దాదాపు 30సంవత్సరాల పాటు ఆయన తలను కోవెలకుంట్ల కోటలో ఉరికొయ్యకు వేలాడదీసే ఉంచారు. ఇప్పుడు ఈ సీన్‌ను సినిమాలో ఎలా పెట్టారన్న ఆసక్తి అందరిలో పెరుగుతోంది.

అయితే ట్రైలర్‌లో దానికి సంబంధించిన కొన్ని ఫ్రేమ్‌లు ఉన్నాయి. చిరంజీవిని ఉరి కొయ్య వరకు తీసుకెళ్లడం, అక్కడ ఆయనను నిలబెట్టడం, నీ చివరి కోరిక ఏంటి అని బ్రిటీష్ అధికారులు అడగడం వంటి సన్నివేశాలు ఉన్నాయి. దీంతో ఈ సినిమాలో చిరుకు చివరకు ఉరి వేస్తారని ఓ చిన్న క్లారిటీని ఇచ్చేశాడు దర్శకుడు. కానీ అభిమానులను నొప్పించకుండా సురేందర్ రెడ్డి ఈ సన్నివేశాన్ని ఎలా తెరకెక్కించాడన్నది కొందరిలో మెదులుతోన్న ప్రశ్న. మామూలుగా కొన్ని సినిమాల్లో క్లైమాక్స్‌లో హీరో గానీ హీరోయిన్‌ గానీ చనిపోయినా.. దాన్ని మరీ పెద్దగా హైలెట్ చేయకుండా.. వారికి సంబంధించిన ఫొటోలను, డైలాగ్‌లను పెట్టి మూవీని ముగించేస్తుంటారు. మహానటి, యాత్ర వంటి బయోపిక్‌ల విషయంలోనూ ఇలానే చేశారు. మరి సైరా మూవీలో కూడా అలానే చూపిస్తారా..? లేక వాస్తవ కథ అనుగుణంగా చూపిస్తారా..? అన్నది చూడాలి.

ఇదిలా ఉంటే సినిమాల్లో విషాదకరమైన ముగింపును మన టాలీవుడ్ ప్రేక్షకులు అస్సలు ఒప్పుకోరు. ఇక అలాంటి సన్నివేశాల్లో చిరంజీవి లాంటి టాప్ హీరోలు నటిస్తే.. ఆయన అభిమానులు తట్టుకోలేరు. క్లైమాక్స్‌లో హీరో, హీరోయిన్లలు చనిపోయే సన్నివేశాలు ఉన్న మూవీలు విజయం సాధించిన సందర్భాలు చాలా తక్కువ. సినిమా మొత్తం బావున్నా చివర్లో హీరోలు చనిపోయిన చాలా చిత్రాలు అట్టర్‌ ఫ్లాప్‌గా నిలిచాయి. దానికి ఎన్నో ఉదాహరణలు కూడా ఉన్నాయి. కాగా గతంలోనూ చిరంజీవి నటించిన ఓ సినిమా విషయంలో ఇలాంటి తర్జన భర్జనలే పడ్డాడు దర్శకుడు వినాయక్. చిరు హీరోగా ఆయన తెరకెక్కించిన ‘ఠాగూర్‌’ తమిళంలో హిట్ సాధించిన ‘రమణ’ రీమేక్ అన్న విషయం తెలిసిందే. అందులో నటించిన విజయ్ కాంత్‌కు చివర్లో ఉరి వేస్తారు. కానీ తెలుగులో అలా తీస్తే ప్రేక్షకుల నుంచి నెగిటివిటీ వస్తుందన్న అభిప్రాయంతో ఇక్కడి క్లైమాక్స్‌ను మార్చేశారు. ఇప్పుడు మరి సైరా క్లైమాక్స్‌ను సురేందర్ రెడ్డి ఎలా తీశారు..? విషాదకరమైన ముగింపును ప్రేక్షకులు ఒప్పుకుంటారా..? సైరా సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తుందా..? అని తెలుసుకోవాలంటే మాత్రం అక్టోబర్ 2 వరకు ఆగాల్సిందే.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu