బెంగాల్ ఎన్నికలు 2021: టీఎంసీ నేత ఇంట్లో ఈవీఎం, వీవీప్యాట్.. సెక్టార్ ఆఫీసర్‌తో సహా పోలీసులపై వేటు

హౌరాలోని టీఎంసీ నేత ఇంట్లో ఈవీఎం దొరకడం కలకలం రేపుతోంది. దీనిపై బీజేపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఈసీ అధికారులు చర్యలు చేపట్టారు.

బెంగాల్ ఎన్నికలు 2021: టీఎంసీ నేత ఇంట్లో ఈవీఎం, వీవీప్యాట్..  సెక్టార్ ఆఫీసర్‌తో సహా పోలీసులపై వేటు
Ec Suspends Officer After Evms Found At Tmc Leaders Residence
Follow us

|

Updated on: Apr 06, 2021 | 10:21 AM

EC suspends officer after evms found: ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీకి మూడో ద‌శ ఎన్నిక‌లు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా 31 నియోజ‌క‌వ‌ర్గాలకు పోలింగ్ జరుగుతోంది. కాగా, ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సెక్టార్ ఆఫీసర్ తపన్ సర్కార్‌ను ఈసీ సస్పెండ్ చేసింది. హౌరా జిల్లాలోని ఉలుబేరియా ఉత్తర్ నియోజ‌క‌వ‌ర్గంలోని సెక్టార్ 17కు త‌ప‌న్ స‌ర్కార్‌ను సెక్టార్ ఆఫీస‌ర్‌గా ఎన్నిక‌ల అధికారులు నియ‌మించారు.

ఈ నేపధ్యంలో హౌరాలోని టీఎంసీ నేత ఇంట్లో ఈవీఎం దొరకడం కలకలం రేపుతోంది. దీనిపై బీజేపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఈసీ అధికారులు చర్యలు చేపట్టారు. పోలింగ్ కేంద్రానికి ఎన్నిక‌ల సామాగ్రితో నిన్న సాయంత్రమే త‌ప‌న్ స‌ర్కార్ త‌న సిబ్బందితో చేరుకున్నారు. అయితే సెక్టార్ ఆఫీస‌ర్ పోలింగ్ బూత్‌లో నిద్రించ‌కుండా, ఈవీఎం, వీవీప్యాట్ తీసుకుని త‌న బంధువైన టీఎంసీ నాయ‌కుడు గౌతం ఘోష్‌ ఇంటికి వెళ్లి నిద్రించాడు. ఈ విష‌యం బీజేపీ కార్యక‌ర్తల‌కు తెలియ‌డంతో.. వారు ఎన్నిక‌ల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

ఈ ఘ‌ట‌న‌పై కేంద్ర ఎన్నిక‌ల సంఘం స్పందించింది. త‌క్షణ‌మే త‌ప‌న్ స‌ర్కార్‌తో పాటు పోలింగ్ కేంద్రం వ‌ద్ద విధుల్లో ఉన్న పోలీసుల‌ను కూడా స‌స్పెండ్ చేయాల‌ని ఆదేశాలు జారీ చేసింది. త‌ప‌న్ స‌ర్కార్ ఈసీ నిబంధ‌న‌లు ఉల్లంఘించాడ‌ని, అత‌నిపై చ‌ట్టప‌ర‌మైన చ‌ర్యలు తీసుకుంటామ‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం వెల్లడించింది. అయితే, ఆ ఈవీఎం, వీవీప్యాట్‌ను పోలింగ్‌లో వినియోగించవద్దని, వాటి స్థానంలో ఇతర ఈవీఎం, వీవీప్యాట్‌ను వాడాల‌ని సూచించింది. దీంతో వెంటనే అధికారులు కొత్త ఈవీఎం, వీవీప్యాట్‌ను తెప్పించి పోలింగ్ నిర్వహిస్తున్నారు.