PRIYANKA COMMENT: కలకలం రేపిన ప్రియాంక కామెంట్.. అబ్బే సీఎం అభ్యర్థిని కానంటూ మాట మార్చిన కాంగ్రెస్ యువరాణి

PRIYANKA COMMENT: కలకలం రేపిన ప్రియాంక కామెంట్.. అబ్బే సీఎం అభ్యర్థిని కానంటూ మాట మార్చిన కాంగ్రెస్ యువరాణి
Priyanka Gandhi Vadra rolls back her 'CM face' comment

యుపీలో సీఎం క్యాండిడేట్ ఎవరంటూ ఓ విలేకరి పదే పదే ప్రశ్నించగా.. ‘‘వేరే ఎవరో ఎందుకు నేనున్నాను కదా’’ అని ప్రియాంక సమాధానమివ్వడంతో ఆమే స్వయంగా తాను యుపీ సీఎం రేసులో వున్నానంటూ పరోక్షంగా బదులిచ్చారంటూ మీడియా పెద్ద ఎత్తున కథనాలు ప్రచురించాయి.

Rajesh Sharma

| Edited By: Ram Naramaneni

Jan 22, 2022 | 5:53 PM

PRIYANKA COMMENT CREATED POLITICAL UPROAR IN UTTARPRADESH: అలూ లేదు.. చూలు లేదు.. కానీ కొడుకు పేరు మాత్రం సోమలింగం అంట.. సరిగ్గా అలాగే వుంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. అసలే నామమాత్రపు పోటీ ఇచ్చే హీన స్థితికి కునారిల్లిన కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి అభ్యర్థి అంశం ఓ కుదుపు కుదిపింది. ప్రస్తుతం జరుగుతున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది ఒక్క ఉత్తర్ ప్రదేశ్ మాత్రమే. అక్కడ యోగీ ఆదిత్యనాథ్ సారథ్యంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నించడంతోపాటు పలు అంశాలు యుపీ ఎన్నికలపై ఆసక్తిని పెంచాయి. గతంలో ఓ దఫా ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన అఖిలేశ్ యాదవ్ సారథ్యంలో సమాజ్ వాదీ పార్టీ బీజేపీని ఓడించి.. అధికార పగ్గాలు చేపట్టేందుకు వ్యూహాలు రచిస్తోంది. మరోవైపు యుపీని రెండు మార్లు ఏలిన మాయావతి అనూహ్యంగా బరి నుంచి తప్పుకోవడం సమాజ్ వాదీ పార్టీకి లాభించే సంకేతాలు కనిపిస్తున్నాయి. బీఎస్పీ నామమాత్రపు పోటీతో యుపీ అసెంబ్లీ బరిలో ఎస్పీ, బీజేపీల మధ్య ముఖాముఖీ పోటీ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. బరిలో వున్న మరో పార్టీ కాంగ్రెస్. యుపీని కొన్ని దశాబ్దాల పాటు ఏలిన కాంగ్రెస్ పార్టీ 90వ దశకం నుంచి అధికారాన్ని పొందలేకపోయింది. దాంతో బీజేపీ, ఎస్పీ, బీఎస్పీల తర్వాత నాలుగో స్థానానికి కాంగ్రెస్ పార్టీ పడిపోయింది.

నిజానికి రాహుల్ గాంధీ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్ళలో జరిగిన ఎన్నికల్లో యుపీలో పునర్వైభవాన్ని సాధించేందుకు విఫలయత్నం చేశారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నీ తానై పార్టీని నడిపించినా అధికారానికి ఆమడ దూరంలోనే కాంగ్రెస్ పార్టీ నిలిచిపోయింది. ఆనాటి ఎన్నికల్లో ఎస్పీ అధికార పగ్గాలు చేపట్టింది. ఆ తర్వాత 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక్క ఊపు ఊపింది. 2014లో కేంద్రంలో అధికారంలో చేపట్టిన బీజేపీ.. అదే ఊపును 2017లో యూపీలో చూపించింది. 403 అసెంబ్లీ సీట్లున్న యుపీలో ఏకంగా రెండింట మూడొంతుల మెజారిటీని సాధించింది. ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే ఏకంగా 325 సీట్లను భారతీయ జనతా పార్టీ ఆనాటి ఎన్నికల్లో సాధించింది. అనంతరం ఆనాటికి గోరఖ్‌పూర్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న యోగీ ఆదిత్య నాథ్‌ని యుపీ సీఎంని చేసింది బీజేపీ. ఆ తర్వాత అయిదేళ్ళు కాలగమనంలో కరిగిపోగా.. 2022 ఎన్నికల్లో బీజేపీ రెండోసారి అధికారాన్ని పొందేందుకు వ్యూహాలు రచిస్తోంది. బీజేపీకి ప్రధాన ప్రతిపక్షం సమాజ్ వాదీ పార్టీ నుంచి తీవ్రమైన పోటీ ఎదురవుతోంది. ఇప్పటి వరకు లభ్యమైన ప్రీ-పోల్ సర్వేలు, ఒపీనియల్ పోల్స్ బీజేపీ వైపే మొగ్గుచూపుతున్నాయి. కానీ 2017 నాటి మాదిరిగా మూడొందలకు పైగా సీట్లు సాధిస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకమేంటున్నారు. ఇక బీఎస్పీ బరిలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు (యాంగీ ఇంకుంబెన్సీ) చీలి అధికార బీజేపీకి లాభించే పరిస్థితి ఎదురవుతుందని భయపడిన ఎస్పీ అధినాయకత్వానికి బీఎస్పీ అధినేత్రి మాయావతి నిర్ణయం నెత్తిన పాలుపోసింది.

మాయావతి తాను స్వయంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయొద్దని నిర్ణయించుకోవడంతో బీఎస్పీ వర్గాలు నిరాశలో పడిపోయాయి. సీఎం క్యాండిడేట్ స్వయంగా పోటీకి దూరవమవడంతో బీఎస్పీ అధికారాన్ని చేపట్టే రేసులో లేదన్న విషయం తేటతెల్లమైంది. ఈక్రమంలో బీజేపీ, ఎస్పీలు ముఖాముఖి పోరుకు రెడీ అయిపోయాయి. ఇదిలా వుంటే.. కాంగ్రెస్ పార్టీ పునర్వైభవానికి మళ్ళీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. 2012 ఎన్నికల్లో రాహుల్ సారథ్యం విఫలం కావడంతో తాను స్వయంగా యాక్టివ్ అయిన ప్రియాంక గాంధీ వధేరా.. గత ఎన్నికల్లో పార్టీకి అన్నీ తానై వ్యవహరించారు. పార్టీ ప్రధాన ప్రచారకర్తగా యుపీవ్యాప్తంగా ఆనాడు ప్రియాంక కలియ తిరిగారు. అయితేనేం.. కాంగ్రెస్ పార్టీ ఘోరమైన ఫలితాలనే పొందింది. ప్రస్తుతం కూడా ప్రియాంకనే యుపీ కాంగ్రెస్‌కు పెద్ద దిక్కయ్యారు. ప్రచారాన్ని తన భుజాన మోస్తున్నారు. ఈక్రమంలోనే ప్రియాంక చేసిన ఓ కామెంట్.. (విలేకరి ప్రశ్నకు సమాధానంగా) యుపీ పాలిటిక్స్‌లోనే కాకుండా యావత్ దేశంలో చర్చనీయంశమైంది. యుపీలో సీఎం క్యాండిడేట్ ఎవరంటూ ఓ విలేకరి పదే పదే ప్రశ్నించగా.. ‘‘వేరే ఎవరో ఎందుకు నేనున్నాను కదా’’ అని ప్రియాంక సమాధానమివ్వడంతో ఆమే స్వయంగా తాను యుపీ సీఎం రేసులో వున్నానంటూ పరోక్షంగా బదులిచ్చారంటూ మీడియా పెద్ద ఎత్తున కథనాలు ప్రచురించాయి. జనవరి 21న ప్రియాంక ఈ మేరకు కామెంట్ చేయడం.. జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చనీయంశంగా మారడంతో ప్రియాంకక మర్నాటికి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. జనవరి 22న ప్రియాంక తన వివరణ ఇచ్చుకున్నారు. విలేకరి పదే పదే ప్రశ్నించడంతో చిరాకుతో ఇచ్చిన సమాధానమదని చెబుతూ.. యుపీ సీఎం క్యాండిడేట్‌ని తాను కాదని చెప్పుకున్నారు ప్రియాంక. అసలు యుపీ ఎన్నికల్లో పోటీ చేసే విషయంలోనే తానింకా నిర్ణయం తీసుకోలేదని చెప్పుకొచ్చారామె.

నిజానికి యుపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం దాదాపు అసాధ్యమని దాదాపు అన్ని సర్వేలు, ఒపీనియన్ పోల్స్ చెబుతున్నాయి. పార్టీ పరిస్థితి కూడా అందుకు భిన్నంగా ఏమీ లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ తరపున సీఎం క్యాండిడేట్ ఎవరంటూ మీడియా పదే పదే ప్రశ్నించడంతో ప్రియాంకకు చిర్రుత్తినట్లుందని రాజకీయ విశ్లేషకులు చమత్కరిస్తున్నారు. కేవలం అసంబ్లీ ఎన్నికలే కాదు.. యుపీలో లోక్ సభ ఎన్నికల్లోను పెద్దగా సీట్లు పొందలేకపోతోంది కాంగ్రెస్ పార్టీ. తాజాగా సీఎం అభ్యర్థిత్వంపై ప్రియాంక చేసిన వ్యాఖ్యలు పార్టీలోనే కాదు.. ప్రజల్లోను చర్చనీయంశమయ్యాయి. ప్రియాంక కామెంట్లకు, ఆమె వివరణకు కొందరు నవ్వుకుంటుండగా మరికొందరు.. ఈసారైనా కాంగ్రెస్ కాసింత మెరుగైన ఫలితాలను సాధించగలదా అని చర్చించుకుంటున్నారు. ఈ విషయంలో తేలాలంటే మార్చి పదో తారీఖు దాకా వేచి చూడక తప్పదు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu