UP Assembly Elections: ఆ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో ధనవంతులే ఎక్కువ.. ఎంత మంది అంటే..

UP Assembly Elections: ఆ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో ధనవంతులే ఎక్కువ.. ఎంత మంది అంటే..
Assembly Elections

ఎన్నికలు ఏవైనా సరే ధనవంతులకే టిక్కెట్లు ఇచ్చేందుకు అన్ని పార్టీలు మొగ్గు చూపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌లో కుబేరులకే రాజకీయ పార్టీలు టిక్కెట్లు ఇచ్చాయి...

Srinivas Chekkilla

|

Feb 12, 2022 | 8:25 PM

ఎన్నికలు ఏవైనా సరే ధనవంతులకే టిక్కెట్లు ఇచ్చేందుకు అన్ని పార్టీలు మొగ్గు చూపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌లో కుబేరులకే రాజకీయ పార్టీలు టిక్కెట్లు ఇచ్చాయి. యూపీలో సోమవారం జరిగే రెండోదశ పోలింగ్‌లో బరిలో ఉన్న 45 శాతం మంది అభ్యర్థులు కోటీశ్వరులే. రెండోదశలో 584 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 260 మంది కోటీశ్వరులు కావడం విశేషం. బీజేపీ నుంచి 53 అభ్యర్థుల్లో 52 మంది కోటీశ్వరులు. ఎస్పీ నుంచి 52 మంది అభ్యర్థుల్లో 46 మంది కోటీశ్వరులు. బీఎస్పీ నుంచి 55 మంది అభ్యర్థుల్లో 46 మంది కోటీశ్వరులు. కాంగ్రెస్‌ నుంచి 49 మంది అభ్యర్థుల్లో 16 మంది కరోడ్‌పతులు ఉన్నారు.

యూపీ రెండోదశ పోలింగ్‌లో రిచెస్ట్‌ అభ్యర్థి ఎవరంటే కాంగ్రెస్‌ నుంచి రాంపూర్‌లో బరిలో ఉన్న నవాబ్‌ కాజీం అలీఖాన్‌. ఆయన ఆస్తుల విలువ రూ.296 కోట్లు. బరేలి కంటోన్మెంట్‌ నుంచి ఎస్పీ అభ్యర్థిగా బరిలో ఉన్న సుప్రియా ఆరన్‌ రూ.157 కోట్ల ఆస్తులతో రెండో స్థానంలో ఉన్నారు. నాగ్వాన్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న దేవేంద్ర నాగ్‌పాల్‌ రూ.140 కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు.

ఉత్తరప్రదేశ్‌లో శుక్రవారం జరిగే మూడోదశ ఎన్నికల్లో కూడా 250 మంది కోటీశ్వరులయిన అభ్యర్థులు పోటీపడుతున్నారు. 813 మంది అభ్యర్థుల్లో 250 మంది, అంటే 31 శాతం మంది కరోడ్‌పతిలు. బీఎస్పీ నుంచి 67 మంది అభ్యర్థుల్లో 56 మంది, ఆర్‌ఎల్‌డి నుంచి 40 అభ్యర్థుల్లో 13 మంది, 225 మంది స్వతంత్ర అభ్యర్థులలో 24 మంది కోటి రూపాయలు మించిన ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్లలో తెలిపారు. ఒక్కో అభ్యర్థికి సగటున మూడో దశలో రూ. 1.61 కోట్ల ఆస్తి ఉంది. మూడో దశలో పోటీ చేస్తున్నవారిలో అత్యంత సంపన్నులయిన ముగ్గురు అభ్యర్థుల పేర్లు ఎస్పీకి చెందిన అనూప్ కుమార్ గుప్తా (రూ. 42కోట్లు), కాంగ్రెస్‌కు చెందిన అజయ్ కపూర్ (రూ. 31 కోట్లు), ఎస్పీకి చెందిన సీమా సచెన్ (రూ. 29 కోట్లు) ఆస్తులు ఉన్నట్లు ఎడిఆర్ తెలిపింది.

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ దగ్గరపడుతోంది. మొత్తం 117 నియోజకవర్గాలకు ఈనెల 20న ఎన్నికలు జరగనుండగా.. 1304 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. అయితే వీరిలో 25 శాతం మంది నేర చరితులే ఉండడం గమనార్హం. 57 నియోజకవర్గాల్లో అయితే ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది నేర అభియోగాలున్న వ్యక్తులే పోటీలో ఉన్నారు. ఇక మొత్తం అభ్యర్థులో 521 మంది కోటీశ్వరులున్నారు. అసోషియేషన్‌ ఆఫ్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) సంస్థ ఈ నివేదిక వెల్లడించింది.

మొత్తం 1304 మంది అభ్యర్థుల్లో 1276 మంది ప్రమాణ పత్రాలను పరిశీలించిన అనంతరం ఏడీఆర్‌ ఈ నివేదిక రూపొందించింది. మిగతా 28 అభ్యర్థుల ప్రమాణ పత్రాల్లో వివరాలు పూర్తిగా లేకపోవడంతో వాటిని పరిగణనలోకి తీసుకోలేదని ఏడీఆర్‌ పేర్కొంది. పంజాబ్‌ ఎన్నికల్లో జాతీయ పార్టీల నుంచి 228 మంది, ప్రాంతీయ పార్టీల నుంచి 256 మంది పోటీ చేస్తున్నారు. 447 మంది స్వతంత్రులుగా బరిలో ఉన్నారు. మిగతా వారు గుర్తింపు లేని పార్టీల నుంచి పోటీ చేస్తున్నట్లు ఏడీఆర్‌ నివేదిక పేర్కొంది.

పంజాబ్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 41 శాతం మంది కోటీశ్వరులు. అత్యధికంగా కాంగ్రెస్‌ పార్టీలో 107 మంది కోటీశ్వరులు ఉండగా.. శిరోమణి అకాలీదళ్‌ నుంచి 89 మంది, ఆమ్‌ ఆద్మీ పార్టీలో 81, బీజేపీలో 60 మంది అభ్యర్థులు తమ ఆస్తులు రూ.కోటి పైనే ఉన్నట్లు అఫిడవిట్లలో పేర్కొన్నారు. ఆప్‌ నుంచి పోటీ చేస్తోన్న కుల్వంత్‌ సింగ్‌ రూ.238 కోట్ల ఆస్తులతో ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత శిరోమణి అకాలీదళ్‌కు చెందిన సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ రూ.202 కోట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి కరణ్‌ కుమార్‌ రూ.155 కోట్ల ఆస్తులను ప్రకటించారు. ఐదుగురు అభ్యర్థులు తమకు ఎలాంటి ఆస్తులు లేవని పేర్కొన్నారు.

Read Also.. Elections 2022: యూపీ ఎన్నికలపై కమల దళం భారీ ఆశలు.. ప్రధాని మోదీకి చాలా కీలకం.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu