UP Elections 2022: ఆఖరి పంచ్‌ ఎవరిదో?.. యూపీ తుది విడత పోలింగ్‌పైనే అందరి దృష్టి..

UP Elections 2022: ఆఖరి పంచ్‌ ఎవరిదో?.. యూపీ తుది విడత పోలింగ్‌పైనే అందరి దృష్టి..
Up Elections

Uttar Pradesh Assembly Election 2022: నరాలు తెగే ఉత్కంఠ.. నువ్వా నేనా అన్నట్లు తగ్గ పోరు.. తగ్గేదేలే అన్న తీరు.. గెలుపు ఎవరిది.. ఓడేదెవరు.. ఎత్తులకు పై ఎత్తుల్లో చిత్తు అయ్యేదెవరో తేలే సమయం వచ్చేసింది.

Basha Shek

|

Mar 05, 2022 | 6:21 PM

Uttar Pradesh Assembly Election 2022: నరాలు తెగే ఉత్కంఠ.. నువ్వా నేనా అన్నట్లు తగ్గ పోరు.. తగ్గేదేలే అన్న తీరు.. గెలుపు ఎవరిది.. ఓడేదెవరు.. ఎత్తులకు పై ఎత్తుల్లో చిత్తు అయ్యేదెవరో తేలే సమయం వచ్చేసింది. అదేనండి ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగింపు దశకు చేరాయి. ఉత్తరప్రదేశ్ శాసనసభకు జరిగే ఏడో దశ ఎన్నికలు ఎల్లుండితో ముగియనున్నాయి. అయితే చివరి దశలో వారణాసిలో మోదీ, అజమ్‌గర్‌లో అఖిలేష్‌ హవా ఎంత వరకు వీయనుందో తేలనుండడం ఆసక్తిని పెంచుతోంది. ఉత్తరప్రదేశ్ లో 403 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి దశలో 11 జిల్లాల్లోని 58 అసెంబ్లీ స్థానాలు, ఫిబ్రవరి 10న పోలింగ్ జరిగింది. రెండో దశలో (9జిల్లాల్లోని 55 స్థానాలకు), ఫిబ్రవరి 14న పోలింగ్, మూడో దశలో (16 జిల్లాల్లోని 59 స్థానాలకు) ఫిబ్రవరి 20న , నాలుగో దశలో (9 జిల్లాల్లోని 60 స్థానాలకు) ఫిబ్రవరి 23న , ఐదో దశలో (11 జిల్లాల్లోని 60 స్థానాలకు) ఫిబ్రవరి 27న , ఆరో దశలో (10 జిల్లాల్లోని 57 స్థానాలకు) మార్చి 3న పోలింగ్ జరిగింది. ఇక చివరి ఏడో దశలో (9 జిల్లాల్లోని 54 నియోజకవర్గాల్లో) మార్చి 7న పోలింగ్ జరగనుంది. మార్చి 10న తుది ఫలితాలు వెల్లడికానున్నాయి. మార్చి 7వ తేదీన ఏడో విడత అసెంబ్లీ ఎన్నికలు ఈస్ట్‌ ఉత్తర్‌ప్రదేశ్‌లో జరగనుండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. రాజకీయ, భౌగోళిక విభిన్న పరిస్థితులు ప్రభావం అక్కడ బాగా ఉండడమే ఇందుకు కారణం. ముఖ్యంగా వారణాసి, మీర్జాపూర్‌, అజమ్‌గర్‌ డివిజన్లలోని 9 జిల్లాల్లో మిగిలిన 54 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరగనుండడడంతో అధికార, ప్రతిపక్షాలు వ్యూహాలు, ప్రతివ్యూహాల్లో తలమునకలై ఉన్నాయి. వారణాసిలో మోడీ, అజమ్‌గర్‌లో అఖిలేష్‌ హవా కొనసాగుతోంది. ఇప్పుడు కూడా అక్కడ వారిదే పై చేయి కానుంది.

చరిత్ర ఏం చెబుతోందంటే..

ఉత్తరప్రదేశ్ లో దాదాపు 18కోట్ల జనాభా ఉంది. భారతదేశంలోనే పెద్దరాష్ట్రం. అంతే కాదు ప్రపంచంలోనే జనాభా పరంగా ఉత్తరప్రదేశ్ కంటే పెద్ద దేశాలు 5 మాత్రమే ఉన్నాయి. చైనా, భారత్, అమెరికా, ఇండొనేషియా, బ్రెజిల్ దేశాలే యూపీ కంటే పెద్ద ప్రాంతాలు. వాయువ్య ప్రాంతం – రోహిల్ ఖండ్, నైరుతి ప్రాంతం – డోఅబ్, బ్రిజ్, మధ్య ప్రాంతం – అవధ్ (ఓధ్), ఉత్తర భాగం – భాగల్ ఖండ్, బుందేల్ ఖండ్, తూర్పు భాగం – పూర్వాంఛల్ (భోజపురి ప్రాంతం) ఉంటాయి. ఇక ఉత్తర్‌ప్రదేశ్‌లో మొత్తం 75 జిల్లాలు ఉన్నాయి. భారతదేశ జనాభాలో యూపీ జనాభా సుమారు 16.17% ఉంది. విస్తీర్ణ పరంగా ..రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ తర్వాత ఐదో స్థానంలో ఉంది యూపీ. ఇక్కడ లోక్‌సభలో 80, రాజ్యసభలో 31 స్థానాలు ఉండగా…శాసన సభ సభ్యుల సంఖ్య 403. మరో నామినేటెడ్ స్థానం, శాసన మండలిలో 100 మంది సభ్యులు ఉంటారు. ప్రభుత్వానికి ఏర్పాటుకు అవసరమైన శాసన సభ్యుల సంఖ్య 202 మంది.

రాజకీయ యోధులు..

భారత రాజకీయాల్లో యూపీది ప్రత్యేక స్థానం. మాజీ ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, చరణ్ సింగ్, వి.పి.సింగ్ వంటి ఎంతో మంది మేధావులు ఇక్కడ నుంచే చట్ట సభలకు ఎన్నికయ్యారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి కూడా లక్నో నుంచి ఎన్నికైన వారే కావడం విశేషం. ప్రస్తుత ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీకి చెందిన యోగి ఆదిత్యనాథ్‌, ఇంకా ములాయం సింగ్ యాదవ్, మాయావతి, రాజ్‌నాథ్ సింగ్, కళ్యాణ్ సింగ్, అఖిలేష్ యాదవ్, ధరం సింగ్ సైనీ నేతలు కూడా ఇక్కడి వారే.

2017లో ఎవరంటే..

ఉత్తరప్రదేశ్ లో చివరిగా 2017లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో బీజేపీ భారీ మెజార్టీతో అధికారం పీఠం కైవసం చేసుకుంది. బీజేపీకి 303 సీట్లు, మిత్రపక్షం అప్పాదళ్(ఎస్)కు 9 స్థానాలు రాగా, ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీ(49), సుహేల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(4) సీట్లు, ప్రగతి శీల్ సమాజ్ వాదీ పార్టీకి 1 స్థానం దక్కాయి. ఇక కాంగ్రెస్ 7, బీఎస్పీ 15, జేఎస్డీ(ఎల్) 1, ఇండిపెండెంట్లు ముగ్గురు, ఇతరులు 2 స్థానాల్లో గెలుపొందారు. అధికారంలో బీజేపీ సర్కార్ ఉండగా..వరుసగా రెండో సారి విజయంపై కమలం పార్టీ ధీమాగా ఉంది. అయితే గత 35 ఏళ్లలో ఇక్కడ ఒకసారి గెలిచిన పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేదు. అయితే ఈసారి గెలిచి చరిత్ర తిరగరాయాలని చూస్తున్నారు సీఎం యోగి ఆదిత్యనాథ్​. భారీ ప్రాజెక్టులను ప్రారంభించి అభివృద్ది మంత్రమే గెలిపిస్తుందని ప్రధాని మోడీ, సిఎం యోగీ నమ్ముతుండగా..అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ భారీ ఎత్తులు, వ్యూహాలు రచిస్తోంది. ఎలాగైనా అధికారంలోకి రావాలని రాష్ట్రీయ లోక్ దళ్ సహా కొన్ని చిన్నపార్టీలను కలుపుకొని రంగంలోకి దిగింది ఎస్పీ. 2021 ఏప్రిల్‌లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఎస్పీ అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఇలా రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ), ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), భాగీదారి సంకల్ప్ మోర్ఛా(9పార్టీల కూటమి)తో పొత్తులు పెట్టుకున్న ఎస్పీ గెలుపు మాదేనంటోంది. ఇక ఒకప్పుడు రాజ్యమేలిన బీఎస్పీ, కాంగ్రెస్ లు కూడా మేమేం తక్కువ కాదంటున్నాయి. యూపీ కాంగ్రెస్ కు ఈసారి ప్రియాంక గాంధీ ఇంచార్జ్ గా ఉండి అన్నీ తానై నడిపించారు. ఈ సారి గెలిచే సీట్ల సంఖ్య పెరగొచ్చనే ఆ పార్టీ ఆశలు పెట్టుకుంది. భాగీదారీ పరివర్తన్ మోర్చా పేరుతో ఎంఐఎం, భారత్ ముక్తి మోర్చా, జనతా క్రాంతి పార్టీ, భారతీయ వంచిత్ సమాజ్ పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. ముస్లింలు, ఓబీసీలు, దళితుల మద్దతు ఉందని చెప్పుకుంటున్న భాగీదారి పరివర్తన్ మోర్చా ఎంత మేర ప్రభావం చూపనుందో చూడాలి.

ఇక రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్​ఎల్​డీ)కి జయంత్ చౌదరి నాయకత్వం వహిస్తుండగా యూపీలో కీలకమైన జాట్ల వర్గం మద్దతు ఆ పార్టీకి ఉంది. ఈ ఎన్నికల్లో ఎస్పీ తో కలిసి పోటీచేస్తున్న ఆర్ఎల్డీ ఎన్ని సీట్లు గెలుస్తుందో మరి కొద్ది రోజుల్లో తేలనుంది. ఇక బీజేపీతో పొత్తుపెట్టుకున్న ఆప్నాదల్(సోనేవాల్) గెలుపు పై ధీమా వ్యక్తం చేసున్నారు. వారే కాదు అప్నా దళ్(కె) పార్టీ కూడా ఈసారి ఎస్పీతో కలిసి బరిలోకి దిగుతోంది. మహాన్ దళ్ పార్టీ నేత కేశవ్ దేవ్ మౌర్యకి… రోహిల్‌ఖండ్, పశ్చిమ యూపీలో పట్టు ఉంది. మౌర్యులు, శాక్యాలు, కుష్వాహాలు, సైనీలు, కాంబోజ్‌లు వంటి ఇతర వెనుకబడిన తరగతుల మద్దతు బాగా ఉంది మహాన్ దళ్ పార్టీకి. ఎస్పీతో పొత్తుపెట్టుకున్న ఈ పార్టీ కీలక సీట్లలో ప్రభావం చూపే అవకాశం ఉంది..

ఏడో దశ ఎన్నికలు.. ఈనియోజకవర్గాల్లో..

చివరి దశలో జరిగే 54 స్థానాల్లో గెలుపు పై ధీమాగా ఉన్నాయి ప్రధాన పార్టీలు. 2017లో జరిగిన ఎన్నికల్లో ఈ 54 స్థానాల్లో 29 నియోజకవర్గాల్లో బీజేపీ విజయం సాధించింది. ఏడు చోట్ల బీజేపీ మిత్రపక్షాలు గెలవగా, సమాజ్‌ వాదీ పార్టీ 11 చోట్ల, 6 సీట్లను బీఎస్పీ గెలుచుకుంది. 3 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌, మిగిలిన ఐదు స్థానాల్లో ఇతర చిన్న పార్టీలు విజయం సాధించాయి. ఈ స్థానాల్లో ఇప్పుడు BJP, SP మధ్య రసవత్తర పోరు సాగుతోంది. ఆయా డివిజన్లలో పట్టు కోసం బీజేపీ ప్రయత్నం చేస్తుండగా…అజమ్‌గర్‌లో బలంగా ఉంది సమాజ్‌వాదీ పార్టీ. ఇతర ప్రాంతాల్లోనూ అదే స్థాయిలో రాణించాలని ప్రయత్నం చేస్తోంది. నియోజకవర్గాల విషయానికొస్తే.. అట్రాలియా, గోపాల్‌పూర్‌, సగాడి, మాబారక్‌పూర్‌, అజమ్‌గర్‌, నిజామాబాద్‌, ఫులూర్‌-పొవై, దీదర్‌గంజ్‌, లాల్‌గంజ్‌(ఎస్సీ), మెహ్‌నగర్‌(ఎస్సీ), మధుబన్‌, ఘోసి, ముహమ్మాబాద్‌- గోహ్న(ఎస్సీ), మావు, బదల్‌పూర్‌, షాగంజ్‌, గాజిపూర్‌, జంగిపూర్‌, జహూరాబాద్‌, మొహమ్మదాబాద్‌, జమానియా, ముగల్‌సరై, సకల్‌దిహా, సైదరాజా, చకియా(ఎస్సీ), పింద్ర, అజ్‌గరా(ఎస్సీ), శివ్‌పూర్‌, రోహానియా, వారణాసి ఉత్తరం, వారణాసి దక్షిణం, వారణాసి కంటోన్మెంట్‌, సెవపూరి, భదోహి, జ్ఞాన్‌పూర్‌, ఔరాయి(ఎస్సీ), చన్బే(ఎస్సీ), మిర్జాపూర్‌, మజ్‌హవాన్‌, రోబర్ట్స్‌గంజ్‌, ఒబ్రా(ఎస్టీ), దుద్హి(ఎస్టీ) అసెంబ్లీ నియోజకవర్గాల్లో సోమవారం ఎన్నికలు జరగనుండగా..ఈ నియోజకవర్గాల్లో 11 శాసనసభ స్థానాలు ఎస్సీ, రెండు నియోజకవర్గాలు ఎస్టీలకు రిజర్వ్ అయ్యాయి.

వారణాసిలో..

వారణాసి పార్లమెంట్‌ నియోజవర్గం నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.2014 అసెంబ్లీ ఎన్నికల్లో వారణాసి పార్లమెంట్‌ నియోజవర్గంలోని అన్ని స్థానాల్లో బీజేపీ సత్తా చాటింది. ఈ సారి అదే బాటలో నడిచే వీలున్నా దళితులు, ఓబీసీ ఓట్లు కీలకం కానున్నాయి. 2017 ఎన్నికల్లోను వారణాసితో ప్రధాని మోడీకి ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. హిందుత్వవాదం, వెనుకబడిన వర్గాల మద్దతు తమకే అని అంచనాల్లో ఉంది కమలం పార్టీ . ఇక 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ, బీజేపీకి మధ్య గట్టి పోటీ నడిచింది. ఆయా ప్రాంతాల్లో దళితులు, ఓబీసీ వర్గాల ప్రభావం ఎక్కువగానే ఉండనుంది. గాజిపూర్‌, ఘోసి, జౌన్‌పూర్‌, లాల్‌గంజ్‌ పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీఎస్పీ నెగ్గడం అంత సులభమేమీ కాదు.

వీరే కీలకం.. 

2019 లోక్‌సభ ఎన్నికల్లో దళితుల ఓటు బ్యాంకు కీలకంగా మారింది. రోబర్ట్స్‌గంజ్‌, మిర్జాపూర్‌లో కుర్మి- ఓబీసీ ప్రజలు ఎక్కువ. ఈ సారి బీజేపీ కూటమిలో పోటీ చేసిన అప్నాదళ్‌(S) అక్కడ బాగా ప్రభావం చూపే అవకాశం ఉంది. అప్నాదళ్‌ అధ్యక్షుడు అనుప్రియపటేల్‌ మోడీ కేబినెట్‌లో సభ్యులు. ఈ ఎన్నికల్లోనూ బీజేపీతో పొత్తు పెట్టుకుందా పార్టీ. అక్కడ బీజేపీకే బలం ఉంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానాల్లో బీజేపీకి పట్టు ఉంది. బీజేపీనే కాదు…ఆ పార్టీ కూటమి బలం ఇక్కడ ఉండటం గమనించాల్సిన అంశం. అప్నాదళ్‌, సుహుల్‌దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ(SBSP) పార్టీల మద్దతు కమలం గుర్తు పార్టీకి ఉంది. కీలకమైన కుర్మి, రాజ్‌భర్‌ లో వెనుకబడిన వర్గాల మద్దతు ఉండగా..ఎస్‌బీఎస్‌పీ మూడు స్థానాల్లో, అప్నాదళ్‌ నాలుగు స్థానాల్లో, నిషాద్‌ పార్టీ స్వతంత్రంగా పోటీ చేసి ఓ స్థానంలో గెలిచాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ పొత్తులో ముగ్గురు అభ్యర్థులను బరిలోకి దిగడం ఆసక్తి రేపుతోంది. కాగా 2021 డిసెంబరులో వారణాసిలో కాశీవిశ్వనాథుడి గుడి నిర్మాణానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. ఆ ప్రభావం హిందువుల మీద కనిపిస్తుందనే వాదన వినిపిస్తోంది. వారణాసి నుంచి మోడీ పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించడమే కాదు ఆ పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో బీజేపీకే విజయవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అజమ్‌గర్‌లో ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌కు మంచి పట్టు ఉంది. ఆ పార్టీతో పొత్తు పెట్టుకొన్న పార్టీలపై బీజేపీ గుస్సాగా ఉన్నా చివరి పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా అంటున్నాయి ప్రధాన పార్టీలు.

కొండవీటి శివనాగరాజు, రీసెర్చ్ ప్రొడ్యూసర్, టీవీ9 తెలుగు

Also Read:BECIL Jobs: డిగ్రీ అర్హతతో..బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. వారం రోజుల్లో..

ఆ విషయంలో దేశానికే తెలంగాణ ఆదర్శం.. అలా చేయడమే ప్రభుత్వం లక్ష్యం.. మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్య

Viral Video: నమ్మండి నిజమే… ట్రైన్‌ను నెట్టిన ప్రయాణికులు.. ఎందుకంటే..?

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu