UP Elections 2022: ప్రియాంక గాంధీ మరో వ్యూహం.. యూపీ ఎన్నికల్లో వర్కౌట్ అవుతుందా?

UP Elections 2022: ప్రియాంక గాంధీ మరో వ్యూహం.. యూపీ ఎన్నికల్లో వర్కౌట్ అవుతుందా?
Priyanka Gandhi

Uttar Pradesh Assembly Election 2022: యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తన సత్తా చాటేందుకు కాంగ్రెస్ పార్టీ(Congress Party) సరికొత్త వ్యూహాలతో ముందుకెళుతోంది. మరోసారి అక్కడ అధికార పీఠాన్ని సొంతం చేసుకోవాలని అధికార  భారతీయ జనతా పార్టీ(BJP) ఉవ్విళ్లూరుతోంది.

Janardhan Veluru

|

Jan 20, 2022 | 7:31 PM

Uttar Pradesh Assembly Election 2022: యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తన సత్తా చాటేందుకు కాంగ్రెస్ పార్టీ(Congress Party) సరికొత్త వ్యూహాలతో ముందుకెళుతోంది. మరోసారి అక్కడ అధికార పీఠాన్ని సొంతం చేసుకోవాలని అధికార  భారతీయ జనతా పార్టీ(BJP) ఉవ్విళ్లూరుతోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు నల్లేరుపై బండి నడకకాదని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. రెండోసారి సీఎం పీఠంపై కూర్చోవాలనుకుంటున్న యోగి ఆదిత్యనాథ్‌కు.. అఖిలేష్ యాదవ్ నుంచి గట్టి పోటీ ఎదురుకావచ్చని అంచనావేస్తున్నారు. బీజేపీ- సమాజ్‌వాది పార్టీల మధ్యే ప్రధాన పోటీ ఉండొచ్చన్న అంచనాల  నేపథ్యంలో… అటు కాంగ్రెస్ పార్టీ కూడా రేసులో నిలిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. కాంగ్రెస్ పార్టీని అక్కడ ముందుండి నడిపిస్తున్న ప్రియాంక గాంధీ.. సీట్ల కేటాయింపులో మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు సీట్లు కేటాయించి మహిళలను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు.

ఇప్పుడు యువకులను కూడా పార్టీకి దగ్గర చేసేందుకు కూడా ప్రియాంక గాంధీ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా యువకుల కోసం ప్రత్యేక మేనిఫెస్టోను ఆ పార్టీ విడుదల చేయనుంది. ఢిల్లీలో ఈ ‘యూత్ మేనిఫెస్టో’ను శుక్రవారంనాడు ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు ప్రియాంగ గాంధీ, రణ్‌దీప్ సుర్జెవాలా, కేసీ వేణుగోపాల్ తదితరులు పాల్గొంటారని తెలుస్తోంది. యువతకు ఉపాధి కల్పనతో పాటు ఇతరత్ర హామీలు ఇవ్వనుంది కాంగ్రెస్ పార్టీ. ప్రత్యేక మేనిఫెస్టోతో యువకులకు దగ్గరకావాలన్న కాంగ్రెస్ నేతల వ్యూహం ఏ మేరకు ప్రయోజనం చేకూర్చుతుందో వేచిచూడాల్సిందే. మహిళలు, యువకులకు దగ్గరయ్యే అసెంబ్లీ ఎన్నికల్లో మ్యాజిక్ చేయొచ్చని ప్రియాంక బలంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే మహిళలకు సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత కల్పించడం.. యువకుల కోసం ప్రత్యేక మేనిఫెస్టోను ఆమె తీసుకొస్తున్నట్లు తేటతెల్లమవుతోంది.

కొనసాగుతున్న కప్ప దాట్లు.. బీజేపీలో కొత్త ఉత్సాహం..

ఇదిలా ఉండగా ప్రధాన పార్టీల మధ్య నేతల కప్పదాట్లు కొనసాగుతున్నాయి. గురువారంనాడు సమాజ్‌వాది పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రమోద్ గుప్తా ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే కాంగ్రెస్ యువ నాయకురాలిగా ఆ రాష్ట్రంలో మంచి గుర్తింపు సాధించిన ప్రియాంక మౌర్య కూడా బీజేపీ గూటికి చేరారు. డబ్బులు ఇవ్వనందుకే తనకు ఎన్నికల్లో టిక్కెట్ నిరాకరించారంటూ ఆమె పార్టీ అధిష్టానంపై సంచలన ఆరోపరణలు చేశారు. సమాజ్‌వాది పార్టీ కురువృద్దుడు ములాయం సింగ్ యాదవ్ కోడలు అపర్ణా యాదవ్ బీజేపీలో చేరిన మరుసటి రోజే.. ప్రియాంక మౌర్య కూడా ఆ పార్టీలో చేరడం బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపుతోంది. ములాయం సింగ్ యాదవ్‌ను అఖిలేష్ యాదవ్ బంధీగా పెట్టుకున్నారని.. ఆయన పరిస్థితి పార్టీలో దారుణంగా ఉందంటూ అపర్ణా యాదవ్ బుధవారం వ్యాఖ్యలు చేశారు. అఖిలేష్ నాయకత్వంలోని సమాజ్‌వాది పార్టీ నేరగాళ్లు, మోసగాళ్లకు అడ్డాగా మారిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. తనకు తన మామగారైన ములాయం ఆశీస్సులు ఉన్నట్లు కూడా ప్రకటించుకున్నారు.

తన సేవా కార్యక్రమాలను మరింత మెరుగ్గా కొనసాగించేందుకు బీజేపీలో చేరినట్లు ప్రియాంక మౌర్య తెలిపారు. కాంగ్రెస్ పార్టీని మహిళలకు దగ్గరకు చేసేందుకు తాను ఎంతగానే కృషిచేసినట్లు తెలిపారు. అయితే ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ తనకు అవకాశం కల్పించలేదని ఆవేదన వ్యక్తంచేశారు.

అటు రాయిబరేలి సదార్ ఎమ్మెల్యే అదితి సింగ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆమె ఏ పార్టీలో చేరనున్నారన్నది ఆసక్తికరంగా మారింది.

యూపీలోని మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ 312 స్థానాల్లో (39.67శాతం ఓట్లు) బీజేపీ విజయం సాధించి అధికార పగ్గాలు సొంతం చేసుకుంది. సమాజ్‌వాది పార్టీ 47 స్థానాలకు పరిమితంకాగా.. బీఎస్పీ కేవలం 19 స్థానాల్లోనే గెలిచింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 7 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది.

Also Read..

UP POLITICS: ఆసక్తిరేపుతున్న యుపీ పాలిటిక్స్.. అలకలతో పార్టీలు వీడుతున్న నేతలు.. ప్రత్యక్షపోరులో సీఎం అభ్యర్థులు

Budget 2022: బంగారం ప్రియుల‌కు అదిరిపోయే వార్త‌.. కోటి ఆశ‌ల కొత్త బ‌డ్జెట్ చెబుతోన్న తీపి క‌బురు..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu