Dhyan Chand Sports University: ఉత్తరప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వరుస పర్యటనలు చేస్తున్నారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఆదివారం కూడా ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ మధ్యాహ్నం 1 గంటలకు మేజర్ ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటనను విడుదల చేసింది. మీరట్‌లోని సర్ధానా పట్టణంలోని సలావా-కైలీ గ్రామాలలో సుమారు రూ. 700 కోట్ల అంచనా వ్యయంతో మేజర్ ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీని స్థాపించనున్నారు.
క్రీడా సంస్కృతిని పెంపొందించడం, దేశంలోని అన్ని ప్రాంతాలలో ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాలను నెలకొల్పే లక్ష్యంతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా పలు ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నారు. దీనిలో భాగంగా మీరట్‌లో మేజర్ ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్శిటీ స్థాపన చేయనున్నట్లు పీఎంఓ వెల్లడించింది.
సింథటిక్ హాకీ గ్రౌండ్, ఫుట్‌బాల్ గ్రౌండ్, బాస్కెట్‌బాల్, వాలీబాల్, హ్యాండ్‌బాల్, కబడ్డీ గ్రౌండ్, లాన్ టెన్నిస్ కోర్ట్, జిమ్నాసియం హాల్, సింథటిక్ రన్నింగ్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్, మల్టీపర్పస్ వంటి ఆధునిక, అత్యాధునిక క్రీడా మౌలిక సదుపాయాలతో ఈ క్రీడా విశ్వవిద్యాలయం ఉంటుంది. హాల్, సైక్లింగ్ వెలోడ్రోమ్ లాంటివి కూడా దీనిలో ఉండనున్నాయి.
వీటితోపాటు షూటింగ్, స్క్వాష్, జిమ్నాస్టిక్స్, వెయిట్ లిఫ్టింగ్, ఆర్చరీ, కెనోయింగ్, కయాకింగ్ వంటి క్రీడా సౌకర్యాలతో నిర్మించనున్నారు. ఒకేచోట 540 మంది మహిళలు, 540 మంది పురుష క్రీడాకారులతో సహా మొత్తం 1080 మంది క్రీడాకారులకు శిక్షణనిచ్చే విధంగా ఈ యూనివర్సిటీని స్థాపించనున్నారు.
Also Read: