UP POLITICS: ఆసక్తిరేపుతున్న యుపీ పాలిటిక్స్.. అలకలతో పార్టీలు వీడుతున్న నేతలు.. ప్రత్యక్షపోరులో సీఎం అభ్యర్థులు

UP POLITICS: ఆసక్తిరేపుతున్న యుపీ పాలిటిక్స్.. అలకలతో పార్టీలు వీడుతున్న నేతలు.. ప్రత్యక్షపోరులో సీఎం అభ్యర్థులు
Up Politics

5 రాష్ట్రాలలొ ఎన్నికలు జరుగుతున్నా... యుపీ మాత్రమే అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అందుక్కారణం.. అక్కడ యోగీ ఆదిత్యనాథ్ సారథ్యంలో అధికారంలో వున్న బీజేపీ తిరిగి బంపర్ మెజారిటీతో గెలుస్తామన్న ధీమాతో వుండడమే.

Rajesh Sharma

| Edited By: Anil kumar poka

Jan 20, 2022 | 8:22 PM

UP POLITICS BECOMING INTERESTING DAY BY DAY: యావత్ భారత దేశ ప్రజల దృష్టిని ఆకర్షించేలా రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో. నిజానికి అయిదు రాష్ట్రాలు.. అంటే యుపీతోపాటు ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్నా… యుపీ మాత్రమే అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అందుక్కారణం.. అక్కడ యోగీ ఆదిత్యనాథ్ సారథ్యంలో అధికారంలో వున్న బీజేపీ తిరిగి బంపర్ మెజారిటీతో గెలుస్తామన్న ధీమాతో వుండడమే. యోగీ తన పరిపాలనతో యుపీ ప్రజలను ఆకట్టుకోగలిగారా లేదా తేల్చే ఎన్నికలు ఇవి. రెండోసారి బీజేపీని అధికారంలోకి తీసుకువస్తానన్న విశ్వాసాన్ని పదే పదే ప్రదర్శిస్తూ ముందుకు సాగుతున్న యోగి ఆదిత్యనాథ్‌కు రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు మంత్రులు షాకిచ్చారు. గతవారం వరుసగా రెండు రోజుల్లో ఇద్దరు మంత్రులు బీజేపీని వీడి విపక్ష సమాజ్ వాదీ పార్టీలో చేరిపోయారు. దాంతో ఖంగుతిన్న కమలనాథులు.. ఎస్పీ నుంచి ఆకర్ష్‌ ప్రారంభించారు. ఏకంగా ములాయం ఇంటి నుంచే ఇద్దరు కీలక వ్యక్తులను బీజేపీలోకి లాక్కున్నారు. ఈపరిణామాలను చూస్తున్న వారిలో యుపీ పాలిటిక్స్ మరింత ఆసక్తి రేకెత్తించాయి. సీఎం క్యాండిడేట్లిద్దరు ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి సిద్దమవుతుండడం కూడా ఆసక్తి రేపుతోంది. ఇంకోవైపు బీఎస్పీ అధినేత్రి మాయావతి అనూహ్య నిర్ణయంతో ప్రజలకు షాకిచ్చారు. రాజకీయ పండితులను సైతం ఆశ్చర్యచకితులను చేశారు. బీఎస్పీ ఎన్నికల బరిలో నామమాత్రం కాబోతుండడంతో ప్రధాన పోటీ బీజేపీ, ఎస్పీల మధ్యే వుండబోతోందన్నది తేటతెల్లమైంది.

ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్‌ ఆశించి భంగపాటుకు గురైన కొందరు నాయకులు పార్టీలు మారుతున్నారు. యూపీ మహిళా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షురాలు ప్రియాంక కూడా ఇదేబాటలో పయనించారు. లడ్‌కీ హూ.. లడ్‌ సక్‌తీ హూ (నేను బాలికను.. అయినా పోరాడగలను) అంటూ ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున ప్రచారాన్ని ప్రారంభించిన ప్రియాంక.. పార్టీ తనను నిర్లక్ష్యం చేసిందని ఆరోపిస్తూ పార్టీని వీడారు. తనకున్న పది లక్షల మంది సోషల్ మీడియా ఫాలోవర్స్‌ని వాడుకుని ప్రయోజనం పొందిన కాంగ్రెస్ పార్టీ తనకు టిక్కెట్ ఇవ్వకపోవడం నిర్లక్ష్యమేనంటూ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. 24 గంటలు గడవక ముందే కమలం పార్టీలో చేరిపోయారామె. కాంగ్రెస్‌ పార్టీ టికెట్ల పంపిణీలో అవకతవకలు జరిగాయని, డబ్బులు చేతులు మారాయని ప్రియాంక మౌర్య బహిరంగంగానే ఆరోపించారు. తాను ఓబీసీ విమెన్‌ని కనుకే తనకు టికెట్‌ ఇవ్వలేదని ప్రియాంక మౌర్య వ్యాఖ్యానించారు. టికెట్‌ కోసం కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ ప్రియాంక గాంధీ కార్యదర్శి సందీప్ సింగ్‌ తన నుంచి డబ్బులు ఆశించాడని, తాను ఆ లంచం ఇవ్వలేకపోయానని ఆమె వాపోయారు. మరోవైపు దాదాపు అన్ని పార్టీల్లో అసమ్మతులు, ఆగ్రహాలు పెల్లుబుకుతున్నాయి. సమాజ్‌వాదీ పార్టీకి షాకిస్తూ.. ఆ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్‌ కోడలు అపర్ణ యాదవ్‌ జనవరి 19న భారతీయ జనతా పార్టీలో చేరారు. ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు ప్రతీక్‌ యాదవ్ సతీమణి అయిన అపర్ణ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. న్యూఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయంలో కమలం సీనియర్‌ నేతలు అపర్ణాకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మరోవైపు అపర్ణ యాదవ్ బీజేపీలో చేరడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్ తనదైన శైలిలో స్పందించారు. ఆమె తమ పార్టీ సిద్ధాంతాలను కమలం పార్టీలోకి తీసుకెళ్తారని ఆశిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. తమ పార్టీ టికెట్లు ఇవ్వలేని వారికి బీజేపీ టికెట్లు ఇస్తుందని, ఇందుకు ఆ పార్టీ నేతలకు కృతజ్ఞతలంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు అఖిలేశ్. అయితే.. అపర్ణాను పార్టీ వీడకుండా నేతాజీ (ములాయం సింగ్) చాలా వరకు ఒప్పించే ప్రయత్నం చేశారని తెలిపారు.

ఇంకోవైపు రెండోసారి అధికారంలోకి ఎలాగైనా రావాలని వ్యూహాలు రచిస్తున్న బీజేపీ.. తన మిత్రపక్షాలతో పొత్తును ఖరారు చేసుకుంది. ఎలాంటి రాద్ధాంతాలు లేకుండా పొత్తు కుదరడం.. సీట్ల సంఖ్య ఖరారు కావడంతో బీజేపీ నేతల్లో ఉత్సాహం నింపింది. మరోసారి 300 సీట్లకు పైగా గెలుపొంది.. తమ కూటమి తిరిగి అధికారంలోకి వస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అప్నాదళ్‌, నిషద్‌ పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. వెనుకబడిన సామాజిక వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ రెండు పార్టీలతో కలిసి ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నట్లు జేపీ నడ్డా వెల్లడించారు. రెండు పార్టీల నేతలతో సమావేశం అనంతరం నడ్డా మీడియాతో మాట్లాడారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్‌ డెమొక్రటిక్‌ అలయెన్స్‌.. ఎన్డీయేగా మూడు పార్టీలు బరిలోకి దిగుతున్నట్లు నడ్డా వెల్లడించారు. మొత్తం 403 సీట్లలోనూ కూటమిగానే బరిలోకి దిగుతామని చెప్పారు. ఈ సందర్భంగా ఐదేళ్ల యోగి పాలనపై నడ్డా ప్రశంసలు వర్షం కురిపించారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు రాష్ట్రాభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు. యూపీలో ఎన్డీయే కూటమి మరోసారి 300కు పైగా సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కూడా ఎన్డీయే విజయం ఖాయమని ట్వీట్‌ చేశారు. అప్నాదళ్‌ అధినేత్రి అనుప్రియా పటేల్‌, నిషద్‌ పార్టీ అధ్యక్షుడు సంజయ్‌ నిషద్‌ తదితరులున్న ఫోటోను అమిత్ షా తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఓబీసీల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తోందని, మిగిలిన పార్టీలు ఓబీసీలను విస్మరించాయని దుయ్యబట్టారు. ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదాగా కల్పించిన ఘనత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందన్నారు. పొత్తులో భాగంగా 2017 ఎన్నికల్లో అప్నాదళ్‌కు 11 సీట్లు కేటాయించగా.. 9 సీట్లలో గెలుపొందింది. నిషద్‌ పార్టీ ఒంటరిగా 72 స్థానాల్లో పోటీ చేయగా.. కేవలం ఒక్క స్థానంలోనే గెలుపొందింది. ఇంకోవైపు ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థులు ఈసారి మొదటి సారిగా అసెంబ్లీకి పోటీ చేయబోతున్నారు. ముందుగా అయోధ్య అంతర్భాగంగా వున్న ఫైజాబాద్ నుంచి యోగి ఆదిత్యనాథ్ పోటీ చేస్తారని భావించారు. కానీ ఆయన తనను రెండుసార్లు పార్లమెంటుకు పంపిన గోరఖ్ పూర్ నుంచే అసెంబ్లీకి పోటీ చేయాలని యోగి నిర్ణయించుకున్నారు. గోరఖ్ పూర్ అర్బన్ స్థానం బరిలో యోగి దిగుతున్నారు. ఇక గతంలో ముఖ్యమంత్రిగా వ్యవహరించినా.. మండలికే ప్రాతినిధ్యం వహించిన అఖిలేశ్ యాదవ్ కూడా ఈసారి డైరెక్ట్ ఎన్నికల్లో పోటీకి సిద్దమవుతున్నారు. యోగి అసెంబ్లీ బరిలోకి దిగుతుండడంతో.. అఖిలేశ్‌పై ఒత్తిడి పెంచింది. దాంతో ఆయన తాను లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న అజాంగఢ్ లోకి ఓ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీకి సిద్దమవుతున్నట్లు సమాచారం. మొత్తమ్మీద యుపీ పాలిటిక్స్ యావత్ దేశప్రజల్లోను ఆసక్తి రేకెత్తిస్తున్నాయనే చెప్పాలి.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu