UP Assembly Election 2022: త్వరలో జరగనున్న ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ సరికొత్త అస్త్రాలను బయటకు తీస్తోంది. జై శ్రీరామ్ నినాదంతో కొన్ని దశాబ్దాలుగా రాజకీయం చేస్తున్న ఆ పార్టీ, ఇప్పుడు ‘కృష్టం వందే జగద్గురుం’ అంటూ కొత్త మంత్రాన్ని జపిస్తోంది. ఈ రెండు నినాదాల మధ్యలో ‘హర హర మహాదేవ’ నినాదం మరోవైపు మార్మోగుతోంది. కులానికో పార్టీ ఉన్న ఉత్తరప్రదేశ్ ఓటర్లను కులాలకు అతీతంగా ‘మతం’ ప్రాతిపదికన ఏకం చేసే ప్రయత్నంలో బీజేపీ నిమగ్నమైంది. ‘రామ’ జన్మభూమి అయోధ్య రామమందిర నినాదాన్ని నిజం చేస్తున్న తాము శ్రీకృష్ణ జన్మస్థానం మథురను ఎలా విస్మరిస్తామంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రెండ్రోజుల క్రితం వ్యాఖ్యానించడమే ఇందుకు నిదర్శనం. రాముడు – కృష్ణుడు మధ్య శివుణ్ణి కూడా గుర్తుచేస్తున్నారు. హిందువులు తమ జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే పవిత్ర పుణ్యక్షేత్రం కాశీలో విశ్వనాథుడి ఆలయాభివృద్ధి, పునర్నిర్మాణ కార్యక్రమాలకు ఇటు ప్రధాని మోది – అటు ముఖ్యమంత్రి యోగి ద్వయం ఎంతగా ప్రచారం కల్పిస్తున్నారో చూస్తున్నాం. మొత్తంగా యూపీ ఓటర్లను ‘కులం’ గోడలు దాటి మతం గొడుగు నీడకు తెచ్చేందుకు కమలనాథులు శాయశక్తులా కృషి చేస్తున్నారు.
కులానికొక పార్టీ.. యూపీలో ప్రధాన రాజకీయ పార్టీల్లో సమాజ్‌వాదీ పార్టీని ‘యాదవులు’ తమ సొంత పార్టీగా భావిస్తుంటే, మరో ప్రధాన రాజకీయ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీని దళితులు తమ సొంత పార్టీగా భావిస్తుంటారు. దీంతో పాటు జాట్ల కోసం రాష్ట్రీయ లోక్‌దళ్, కుర్మీల కోసం అప్నాదళ్, నిషాద్‌లు, కేవాట్లు, భిండ్, మల్లా, కశ్యప్, మాంఝి, గోండ్ సహా మరికొన్ని సామాజికవర్గాల కోసం సంయక్తంగా ‘నిర్బల్ ఇండియన్ శోషిత్ హమారా ఆమ్ దళ్’ (సంక్షిప్తంగా నిషాద్) పార్టీ ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని మరికొన్ని చిన్న చిన్న పార్టీలు, వేర్వేరు కులాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. వీటిలో సమాజ్‌వాదీ పార్టీ యాదవులకు తోడు మైనారిటీలను కలుపుకుని ఇన్నాళ్లూ రాజకీయం చేసి, కొన్నాళ్లు అధికారాన్ని కూడా చలాయించగా, బహుజనులతో పాటు బ్రాహ్మణులను కూడా కలుపుకుని బీఎస్పీ అధికారం సాధించగల్గింది. మిగతా పార్టీలకు అధికారం సాధించే సత్తా లేనప్పటికీ, తమ తమ ఓటుబ్యాంకుతో కొన్ని సీట్లు గెలుచుకోవడం, మిగతా నియోజకవర్గాల్లో ఓట్లు చీల్చడం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో గెలుపు అందుకోవాలంటే సామాజిక సమీకరణాల ఎత్తుగడలు ఏ పార్టీకైనా తప్పవు.
మండల్ – కమండల్.. సామాజిక సమీకరణాల్లో భాగంగా బీజేపీ ఓటు బ్యాంకును పరిశీలిస్తే అగ్రవర్ణాలైన బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ (ఠాకూర్లు, రాజ్‌పుత్‌లు) వంటి కులాల్లో అత్యధిక శాతం ఓటర్లున్నారు. మిగతా రాష్ట్రాలతో పోల్చితే దాదాపు 10% జనాభాతో బ్రాహ్మణులు యూపీలో ఎక్కువ సంఖ్యలోనే ఉన్నప్పటికీ, కేవలం అగ్రవర్ణాల ఓట్లతో పార్టీ గెలుపును సొంతం చేసుకోలేదు. దళితులు బీఎస్పీ వెంట, యాదవులు, మైనారిటీలు ఎస్పీ వెంట నడుస్తున్న క్రమంలో, ఇతర కులాలను తమవైపు తిప్పుకున్నప్పుడే బీజేపీ విజయాలు సాధించగల్గింది. ఎస్బీ, బీఎస్బీ ఓటుబ్యాంకు మినహా మిగిలినవారిలో ఓబీసీ కులాల ఓటర్లే ఎక్కువ. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీయే స్వయంగా ఓబీసీ అన్న విషయాన్ని బీజేపీ వీలుచిక్కినప్పుడల్లా చెబుతూ ఓబీసీలకు దగ్గరవుతూనే ఉంది. దానికి తోడు తాజా జరిగిన కేంద్ర కేబినెట్ విస్తరణలో అత్యధిక సంఖ్యలో ఓబీసీలకు చోటు కల్పించి, ఆ విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేసింది. ఇంతటితో సరిపెడితే సరిపోదని భావిస్తున్న కమలనాథులు మతం అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు.
పశ్చిమం – కీలకం ముస్లింలు, జాట్ ఓటర్ల సంఖ్య, ప్రాబల్యం ఎక్కువగా ఉన్న పశ్చిమ యూపీలో జాట్ల మద్ధతు లేకుండా బీజేపీ ఎక్కువ స్థానాలు గెలిచే పరిస్థితి లేదు. 3 వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ సాగిన రైతు ఉద్యమం, లఖింపురి ఖేరి ఘటన నేపథ్యంలో జాట్ల నుంచి బీజేపీ వ్యతిరేకత ఎదుర్కొంటోంది. దానికి తోడు వారికంటూ ఉన్న సొంత పార్టీ ఆర్ఎల్డీ ఇప్పుడు సమాజ్‌వాదీతో జతకలిసింది. దీంతో బీజేపీకి ఇక్కడ ఎదురీత తప్పడం లేదు.
జై శ్రీరామ్ నుంచి హరే కృష్ణ వరకు.. ఎదురీతను కాస్త సులభం చేసే భావోద్వేగం మతం. పశ్చిమ యూపీలో ఈ భావోద్వేగాన్ని పెంచడం కోసం బీజేపీ ఇక్కడున్న శ్రీకృష్ణ జన్మస్థాన్ మథుర క్షేత్రాన్ని తెరపైకి తెస్తోంది. రామజన్మభూమి వివాదం తరహాలోనే ఇక్కడ కృష్ణుడు పుట్టిన చోట ఈద్గా మసీదు ఉంది. రామ జన్మభూమిలో ఆలయాన్ని మొఘల్ పాలకుడు బాబర్ హయాంలో పడగొట్టి మసీదు కట్టగా, శ్రీకృష్ణ జన్మస్థాన్ ఆలయంపై పలుమార్లు దాడులు జరిగాయి. చివరిసారిగా మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ హయాంలో జరిగిన చివరిసారి 1670లో దాడులు జరిగాయి. ఆయన హయంలోనే అక్కడ ఈద్గా మసీదు నిర్మాణం జరిగింది. రామజన్మభూమి వివాదం తరహాలోనే ఇక్కడ కూడా శ్రీకృష్ణ జన్మస్థానం వివాదం కోర్టులో ఉంది. ఇదే ఇప్పుడు బీజేపీకి మరో అంశంగా మారింది. అయోధ్య, కాశీ క్షేత్రాల మాదిరిగానే మథురను కూడా అభివృద్ధి చేస్తామంటూ భావోద్వేగ అస్త్రాన్ని సంధిస్తోంది.
-మహాత్మ కొడియార్, టీవీ9
Also Read..
Andhra Pradesh: పెంపుడు కోళ్ల విషయంలో రెండు కుటుంబాల మధ్య గొడవ.. కత్తులతో దాడి.. నలుగురికి గాయాలు..