UP Election 2022: ఐదు మాసాల్లో సీఎం యోగీ 100 పర్యటనలు.. యూపీ ఎన్నికల్లో ‘ఉపయోగి’ అవుతాయా?

UP Election 2022: ఐదు మాసాల్లో సీఎం యోగీ 100 పర్యటనలు.. యూపీ ఎన్నికల్లో ‘ఉపయోగి’ అవుతాయా?
UP CM Yogi Adityanath

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను భారతీయ జనతా పార్టీ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలన్న తమ కల నెరవేరాలంటే..

Janardhan Veluru

|

Jan 04, 2022 | 4:17 PM

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను భారతీయ జనతా పార్టీ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలన్న తమ కల నెరవేరాలంటే.. అయువుపట్టు అయిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తీరాలన్న సంకల్పంతో కమలనాథులు ముందుకు సాగుతున్నారు. రాజకీయ పరిభాషలో కేంద్రంలో అధికారానికి యూపీ అడ్డదారి.. యూపీ ఓటర్లను మెప్పించిన పార్టీయే.. దశాబ్ధాలుగా కేంద్రంలో అధికారంలోకి రావడం పరిపాటిగా మారింది. ఇందుకు తగ్గట్లే అక్కడ తమ ఎన్నికల వ్యూహాలను కమలం పార్టీ నేతలు అమలు చేస్తున్నారు. ఇటు ప్రధాని మోడీ మానియా, అటు సీఎం యోగి ఆదిత్యనాథ్‌‌‌ ఇమేజ్‌తో తమ విజయం నల్లేరు మీద బండి నడకేనని కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వారి ఆకాంక్షలకు తగ్గట్లే యూపీ ఓటర్లు మళ్లీ యోగి ఆదిత్యనాథ్‌కే పట్టం కట్టనున్నారని సర్వేల అంచనాలు బీజేపీ శ్రేణుల్లో జోష్‌ను పెంచుతున్నాయి.

గత ఏడాది మే మాసంలో జరిగిన యూపీ పంచాయితీ ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీ సాధించిన అనూహ్య విజయం బీజేపీ శ్రేణులను షాక్‌కు గురిచేసింది. ఈ ఫలితాల తర్వాత అక్కడ యోగి సర్కారుపై ప్రజా వ్యతిరేకత మొదలయ్యిందని రాజకీయ పండితులు విశ్లేషించారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి ఈ ప్రజా వ్యతిరేకత మరింత పెరిగే అవకాశముందని భావించారు. అయితే ఈ ప్రతికూల ఫలితాలతో యోగి ఆదిత్యనాథ్ అప్రమత్తమయ్యారు. ప్రజల విశ్వాసాన్ని పొందే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అఖిలేష్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్‌వాది పార్టీ మరింత పుంజుకోకుండా పక్కా వ్యూహాలకు పదునుపెట్టారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో విస్తృత పర్యటనలతో ప్రజలకు దగ్గరవుతున్నారు. ఆరు మాసాల క్రితం నుంచే ఈ దిశగా తన కార్యాచరణ మొదలుపెట్టేశారు ముఖ్యమంత్రి యోగి . రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రజలతో మమేకం అవుతున్నారు. గత ఐదు మాసాల్లో (156 రోజులు) ఆయన ఏకంగా 100 పర్యటనలు చేపట్టారు. ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్ కంటే యోగియే ఎక్కువ పర్యటనలు చేయడం విశేషం.

రాష్ట్ర రాజధాని లక్నోలో అధికారిక కార్యక్రమాలతో నిత్యం బిజీగా గడిపే యోగి ఆదిత్యనాథ్.. అటు జిల్లాల పర్యటనలకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. జిల్లాల పర్యటనల్లో పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు చేయడంతో పాటు కరోనా వైరస్ నివారణ కోసం కోట్లాది రూపాయలతో అనేక కార్యక్రమాలు ప్రారంభించారు. వెనుకబడిన ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాల మారుమూల ప్రాంతాలకు కూడా చేరేలా చొరవ చూపారు. ఆ దిశగా అధికార యంత్రాంగానికి దిశానిర్థేశం చేశారు.

యోగి ఆదిత్యనాథ్ గత ఐదు మాసాలుగా.. సరాసరిగా ప్రతి నెలా 20 జిల్లాల్లో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఒక్క డిసెంబరు మాసంలోనే 23 జిల్లాల్లో పర్యటించి.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. అంతకు ముందు నవంబరు మాసంలో 17 జిల్లాల్లో పర్యటించారు. సెప్టెంబర్ మాసంలో 32, ఆగస్టు మాసంలో 15 జిల్లాల్లో పర్యటనలు చేపట్టారు. కొత్త ఏడాదిలో మొదటి మూడు రోజుల్లోనే మూడు జిల్లాల్లో పర్యటించారు. జనవరి 1న రాంపూర్, 2న మీరట్, 3న అమేథీలో పర్యటించారు. ఇటు లక్నోలోనూ వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

యూపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇప్పుడిప్పుడే పలు పార్టీల నేతలు అక్కడ పర్యటనలు చేపడుతున్నారు. అయితే యోగి ఆదిత్యనాథ్.. అందరికంటే ముందే దాదాపు రాష్ట్రాన్ని చుట్టేశారు. మిగిలిన పార్టీల నేతలు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండగా.. యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల కధన సీమలో ఆరు మాసాల ముందు నుంచే యాక్టివ్ అయిపోయారు. గత ఐదేళ్లలో కొన్ని జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో మూడు, నాలుగు సార్లు పర్యటించి ప్రజల మన్ననలు పొందారు యోగి ఆదిత్యనాథ్.

గత ఏడాది మే మాసంలో కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో యోగి ఆదిత్యనాథ్ విస్తృత పర్యటనలు చేపట్టారు. 26 రోజుల వ్యవధిలోనే యోగి.. 40 జిల్లాల్లో పర్యటించారు. నిత్యం అధికారులతో కోవిడ్ పరిస్థితిని సమీక్షించారు. కోవిడ్‌ని కట్టడి చేయడంలో యోగి ఆదిత్యనాథ్ సమర్థవంతంగా పనిచేశారంటూ ప్రజల మెప్పు పొందారు. ఇటు పట్టణ, అటు గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తూ అందరికీ దగ్గరయ్యేందుకు ప్రయత్నించారు. అటు వరద ముంపు సహాయక చర్యల్లోనూ యూపీ సీఎం చురుగ్గా స్పందించారు. బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఫిరోజాబాద్‌లో జ్వరాలతో బాధపడుతున్న ప్రజలను ఓదార్చి.. ప్రభుత్వం అండగా నిలిచేలా చర్యలు తీసుకున్నారు. అలాగే గతంలో యూపీ సీఎంలుగా పనిచేసిన వారు.. ఆధ్యాత్మిక స్థలాలైన అయోధ్య, వారణాసిలో పర్యటనలకు విముఖత ప్రదర్శించేవారు. అయితే ముఖ్యమంత్రి హోదాలో యోగి ఆదిత్యనాథ్ సమయం, సందర్భం దొరికినప్పుడల్లా అక్కడ పర్యటించారు.

గత ఆరు మాసాల్లో ప్రజలకు మరింత దగ్గరైన యోగి ఆదిత్యానాథ్.. ప్రజా నాయకుడిగా చాటుకున్నారు. మునుపటితో పోల్చితే యోగి ఆదిత్యనాథ్ తన వ్యక్తిగత ఇమేజ్‌ను మరింత పెంచుకున్నారు. మరి ఈ ఇమేజ్ యూపీలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు ‘ఉపయోగి’ పడుతాయో? లేదో? వేచి చూడాల్సిందే.

Also Read..

Sriharikota Covid: షార్‌లో కరోనా కలకలం..12 మందికి కరోనా నిర్ధారణ.. భయాందోళనలో ఉద్యోగులు..

Covid-19 New Variant ‘IHU’: ఫ్రాన్స్‌లో మరో వేరియంట్ వెలుగులోకి… ఇప్పటికే 12 మందికి సోకినట్లు నిర్ధారణ..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu