UP Assembly Election 2022: ప్రియాంకగాంధీ పడుతున్న కష్టానికి ఫలితం దక్కుతుందా?

UP Assembly Election 2022:  ప్రియాంకగాంధీ పడుతున్న కష్టానికి ఫలితం దక్కుతుందా?
Priyanka Gandhi

ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం దక్కాలంటే ఇప్పుడున్నవారితో సాధ్యం కాదని తెలుసుకున్న ప్రియాంక కొత్తవారికి అవకాశాలిచ్చారు. ఇప్పటి వరకు కాంగ్రెస్‌ ప్రకటించిన మొత్తం 166 మంది అభ్యర్థులలో 119 మంది పూర్తిగా కొత్తవారు.

Balu

| Edited By: Ram Naramaneni

Jan 23, 2022 | 2:08 PM

UP Assembly polls: ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌(Congress) పార్టీ అధికారం చేజార్చుకుని మూడు దశాబ్దాలు దాటింది. 1985 ఎన్నికల్లో 269 స్థానాలు సంపాదించిన కాంగ్రెస్‌ పార్టీకి ఆ తర్వాత మూడెంకల సీట్లు సాధించడం దుర్లభంగా మారింది. 1989 ఎన్నికల్లో జనతాదళ్‌ 208 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది. అప్పుడు కాంగ్రెస్‌ పార్టీకి వచ్చినవి 94 సీట్లు మాత్రమే. మరోవైపు భారతీయ జనతాపార్టీ 57 సీట్లు గెల్చుకుంది. అది మొదలు అక్కడ కాంగ్రెస్‌ రోజురోజుకూ క్షిణిస్తూ వస్తోంది. ఇప్పుడెంత దయనీయమైన స్థితిలో ఉందంటే కనీసం పాతిక స్థానాలు వచ్చినా చాలు అన్నంతగా! తొమ్మిదో దశకం నుంచి ఉత్తరప్రదేశ్‌ రాజకీయాలు సమూలంగా మార్పు చెందాయి. అక్కడ కుల రాజకీయాలు పెరిగాయి. సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్‌సమాజ్‌ పార్టీలు అవతరించాక కాంగ్రెస్‌ ఓటు బ్యాంక్‌ మరింతగా తగ్గింది. కాంగ్రెస్‌కు అండగా ఉన్న దళితులు బహుజన్‌సమాజ్‌ పార్టీకి వెళ్లారు. బీసీ సామాజికవర్గం సమాజ్‌వాదీ పార్టీకి జైకొట్టింది.. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్‌ అక్కడ అధికారంలోకి రావడం కల్ల. అయినను పోయిరావలె హస్తినకు అన్నట్టుగా .. అయినను ఎన్నికల్లో పోటీ చేసి తీరవలె అని అనుకుంది కాంగ్రెస్‌.. వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెల్చుకుని ఉనికిని కాపాడుకోవడానికి తాపత్రయపడుతోంది. ఆ భారాన్ని తన భుజస్కంధాల మీద వేసుకున్న ప్రియాంకగాంధీ అహర్నిశమూ అందుకోసం కష్టపడుతున్నారు.

గెలుపు కోసం సరికొత్త వ్యూహాలను పన్నుతున్నారు. కాంగ్రెస్‌కు పూర్వ వైభవం దక్కాలంటే ఇప్పుడున్నవారితో సాధ్యం కాదని తెలుసుకున్న ప్రియాంక కొత్తవారికి అవకాశాలిచ్చారు. ఇప్పటి వరకు కాంగ్రెస్‌ ప్రకటించిన మొత్తం 166 మంది అభ్యర్థులలో 119 మంది పూర్తిగా కొత్తవారు. అలాగే 40 శాతం సీట్లను మహిళలకు కేటాయించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. యువతకు పెద్ద పీట వేశారు. సామాజిక సమస్యలపై పోరాటం చేసిన వారిని గుర్తించి వారికి టికెట్లు కేటాయించారు ప్రియాంక. వెనుకబడిన వర్గాలు, దళితుల సమస్యలపై పోరాటం సాగిస్తున్నవారిని కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారు. ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలి తల్లి ఆశాసింగ్‌కు, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమించిన సదాఫ్‌ జాఫర్‌కు , ఆశా కార్యకర్తల కోసం పోరాడి ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ సభలో భౌతిక దాడికి గురైన పూనం పాండేకు, ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన రామ్‌ రాజ్‌ గోండ్‌కు కాంగ్రెస్‌ టికెట్‌ ఇచ్చింది. వీరంతా రాజకీయాలకు కొత్త.. అలాగే అసెంబ్లీకి కూడా తొలిసారి పోటీ చేస్తున్నారు.

ఇప్పుడున్న పరిస్థితులలో కాంగ్రెస్‌కు పూర్తి ఆధిక్యం వస్తుందని ఎవరూ అనుకోవడం లేదు. ప్రియాంకగాంధీకి కూడా ఆ నమ్మకం లేదు. 1988 జూన్‌ నుంచి 89 డిసెంబ‌ర్ వ‌ర‌కు అక్కడ కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. నారాయణ్‌ దత్‌ తివారీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠం దక్కకపోయినా బలం పెంచుకోవాలనే లక్ష్యంతో కాంగ్రెస్‌ వెళుతోంది. మరో రెండేళ్లలో వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ఈ గెలుపు టానిక్‌లా పని చేస్తోందని అనుకుంటోంది. 2004 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో యూపీలో కాంగ్రెస్‌కు తొమ్మిది స్థానాలు వచ్చాయి. 12 శాతం ఓట్లను సాధించగలిగింది. అప్పుడే ఇతర పార్టీలను కలుపుకుని యూపీఏగా ఏర్పడి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. 2009కి వచ్చేసరికి ఓట్ల శాతాన్ని 18.3కు పెంచుకుంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 21 లోక్‌సభ సీట్లను గెల్చుకోగలిగింది. 2014 ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ సీన్‌ మారిపోయింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్ల శాతం కేవలం ఏడున్నరే! గెల్చుకున్న సీట్లు కూడా రెండంటే రెండే! 2019 ఎన్నికల్లో అయితే మరీ దారుణం. ఆరున్నర ఓట్ల శాతంతో కేవలం ఒకే ఒక్క సీటు గెల్చుకుంది. కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న అమేథిలో కూడా ఓడిపోయింది. పైగా ఓడిపోయింది రాహుల్‌గాంధీ కావడం గమనార్హం. రాహుల్‌గాంధీనే ఓడిపోవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నిరాశ నిస్పృహలు ఆవరించాయి. చాలా మంది ఇతర పార్టీలలోకి వెళ్లిపోయారు. పార్టీకి దూరమైనవారందరినీ మళ్లీ దగ్గర తీసుకుంటున్నారు ప్రియాంక. ఎన్నికల మేనిఫెస్టోను కూడా పకడ్బందీగా రూపొందించారు. తాము అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానం చేసింది కాంగ్రెస్‌. అలాగే లక్షన్నర ఉపాధ్యాయ పోస్టులను కూడా భర్తి చేస్తామని చెప్పింది. కాలేజీలు, యూనివర్సటీలను అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చింది. ద్వేషాన్ని వ్యాప్తి చేయమని, ప్రజలను ఏకతాటిపైకి తెస్తామని కాంగ్రెస్‌ పేర్కొంది. మరి ప్రియాంక పడుతున్న కష్టానికి ఫలితం దక్కుతుందా? పూర్వ వైభవం సంగతి అటుంచి కనీసం ఉనికినైనా కాపాడుకోగలుగుతుందా? ఓట్ల శాతాన్ని పెంచుకోగలుగుతుందా? అన్నది చూడాలి!

Also Read: Vizianagaram District: మైనర్లు, మహా ముదుర్లు.. మహిళలు పూలకు వెళ్లటం చూసి..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu