Punjab Elections 2022 : చలికాలంలో హీటెక్కిన పంజాబ్ పాలిటిక్స్.. వ్యుహ ప్రతివ్యుహాల్లో రాజకీయ పార్టీలు

Punjab Politics: చలికాలంలోనూ ప్రధాన రాజకీయ పార్టీలు చేసుకుంటున్న విమర్శలు, ఆరోపణలు వేడి పుట్టిస్తున్నాయి. ఈ ఎన్నికలు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌కు అత్యంత కీలకంగా మారాయి.

Punjab Elections 2022 : చలికాలంలో హీటెక్కిన పంజాబ్ పాలిటిక్స్.. వ్యుహ ప్రతివ్యుహాల్లో రాజకీయ పార్టీలు
Punjab Political Parties
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Jan 05, 2022 | 3:45 PM

Punjab Assembly Elections 2022: పంజాబ్‌లో ఇప్పుడు విచిత్రమైన సన్నివేశం కనిపిస్తోంది. ఓ పక్కేమో కరోనాను కట్టడి చేయడం కోసం కఠినమైన ఆంక్షలు. మరో పక్కేమో ఆ మహమ్మారికి స్వాగతం పలుకుతూ ఎన్నికల ర్యాలీలు..ఇవాళ కాకపోతే రేపైనా కరోనాను కంట్రోల్ చేయవచ్చు. కానీ, అయిదేళ్లకోసారి వచ్చే ఎన్నికలలో ఆ మాత్రం సందడి లేకపోతే ఎలా అన్నది రాజకీయ పార్టీల భావన కావొచ్చు. మహా అయితే మరో రెండు నెలల సమయమే మిగిలి ఉంది కాబట్టే రాజకీయపార్టీలు ఎన్నికల సమరాంగణంలో అనుసరించాల్సిన వ్యూహాలపై కసరత్తులు మొదలు పెట్టాయి. భారతీయ జనతాపార్టీ పంజాబ్‌పై పెద్దగా ఆశలు పెట్టుకోకపోయినా ఏమో గుర్రం ఎగరావచ్చుననే చిగురంత ఆశతో జోరుగా ప్రచారం చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా పంజాబ్‌పై గట్టి ఫోకసే పెట్టారు.

చలికాలంలోనూ ప్రధాన రాజకీయ పార్టీలు చేసుకుంటున్న విమర్శలు, ఆరోపణలు వేడి పుట్టిస్తున్నాయి. ఈ ఎన్నికలు కాంగ్రెస్‌కు అత్యంత కీలకంగా మారాయి. అధికారాన్ని నిలుపుకోవడం కాంగ్రెస్‌ ముందున్న ప్రధాన లక్ష్యం. కాంగ్రెస్‌ పని అయిపోయిందనుకుంటున్న వారికి ఈ విజయంతో ఓ సమాధానం చెప్పాలని కూడా అనుకుంటోంది.. ఇప్పటికే బోలెడన్ని హామీలను గుప్పించింది. మొన్నటి చండీగఢ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధించిన విజయంతో ఆమ్‌ ఆద్మీ పార్టీ జోష్‌ మీద ఉంది. సర్వేలు కూడా ఆప్‌కు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతుండటంతో దూకుడు పెంచింది. పకడ్బందీ వ్యూహంతో ప్రచారంలో దూసుకుపోతున్నది. సీఎం అభ్యర్థిగా ఎంపీ భగవంత్‌ మాన్‌ పేరును ప్రకటించింది కూడా ! నెల రోజుల కిందట బీజేపీపై భగవంత్‌మాన్‌ సంచలన ఆరోపణలు చేశారు. తమ పార్టీలో చేరితే డబ్బు, కేంద్ర మంత్రి పదవి ఇస్తామంటూ బీజేపీకి చెందిన ఓ ప్రముఖ నేత తనకు ఆఫర్‌ చేశారని, అఇయతే ఆ ఆఫర్‌ను తాను తిరస్కరించారని భగవంత్‌ మాన్‌ చెప్పడం సంచలనం సృష్టించింది. డబ్బుతోనో, పదవితోనో తనను కొనాలనుకోవడం మూర్ఖత్వమని కూడా చెప్పారు. బీజేపీ రాజకీయాలన్ని ఇలాగే ఉంటాయని, ఇతర పార్టీల నుంచి రాజకీయ నాయకులను తీసుకోవడంపైనే బీజేపీ దృష్టి పెడుతుందని, ప్రజా సమస్యలు ఆ పార్టీకి పెద్దగా పట్టమని అన్నారు. ఈ విషయాన్ని వదిలేస్తే ఆప్‌ మాత్రం ఈసారి ఎలాగైనా అధికారం సాధించాలనే గట్టి పట్టుదలతో ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గ పోరు, ఆకాళీదళ్‌ పార్టీ బలహీనపడటం, రైతులు బీజేపీ పట్ల వ్యతిరేకంగా ఉండటం ఆప్‌కు బాగా కలిసివస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్‌ను, ఉచిత తాగునీటిని అందిస్తామని ఆల్‌రెడీ చెప్పిన ఆప్‌ కీలక రంగాలైన విద్య, వైద్యంపై కూడా ఫోకస్‌ పెట్టింది. గత ఎన్నికల్లో 20 స్థానాలను సంపాదించి పంజాబ్‌ అసెంబ్లీలో రెండో అతి పెద్ద పార్టీగా అవతరించింది. పైగా 23.72 శాతం ఓట్లను సంపాదించింది. అప్పట్నుంచే అధికారం దిశగా అడుగులు వేస్తూ వచ్చింది. గత ఎన్నికల్లో లోక్‌ ఇన్సాఫ్‌ పార్టీతో జత కట్టిన ఆప్‌ ఈసారి ఒంటరిగానే బరిలో దిగాలనుకుంటోంది. అప్పుడు లోక్‌ ఇన్సాఫ్‌ పార్టీకి ఆరు సీట్లు కేటాయించింది. అందులో రెండు స్థానాలను గెల్చుకుంది.. ఈ ఎన్నికల్లో ఆప్‌ను గెలిపించే బాధ్యతను అరవింద్ కేజ్రీవాల్‌ తన భుజ స్కంధాల మీద వేసుకున్నారు. ఇప్పటికే నాలుగు విడతల్లో 73 మంది అభ్యర్థుల పేర్లను ఆప్‌ ప్రకటించింది. కేజ్రీవాల్‌ జనాకర్షణ ఎంత వరకు ఓట్ల రూపంలో కన్వర్ట్‌ అవుతుందో చూడాలి.

శిరోమణి అకాలీదళ్‌ పదేళ్ల పాటు పంజాబ్‌లో అధికారంలో ఉండింది. అప్పుడే ఆ పార్టీపై అవినీతి ఆరోపణలు కుప్పలు తెప్పలుగా వచ్చాయి. మరోవైపు విచ్చల విడిగాపెరిగిన డ్రగ్స్‌ వాడకం కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చిపెట్టింది. ఈ కారణంగానే 2017లో జరిగిన ఎన్నికల్లో ఓటమి చవి చూసింది. కేవలం 15 అసెంబ్లీ స్థానాలను మాత్రమే సాధించగలిగింది. ఈసారైనా గణనీయంగా సీట్లు సాధించాలనుకున్న అకాలీదళ్‌కు తమ భాగస్వామ్య మిత్రపార్టీ బీజేపీ తెచ్చిన మూడు సాగు చట్టాలు ఆందోళన కలిగించాయి. వెంటనే బీజేపీతో రెండు దశాబ్దాల అనుబంధాన్ని తెంచేసుకుంది. అకాలీదళ్‌ పార్టీ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ సతీమణి హర్‌సిమ్రత్‌ కౌర్‌ కూడా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి అకాలీదళ్‌ అసెంబ్లీ ఎన్నికల మీద దృష్టి పెట్టింది..రైతుల మద్దతు కూడగట్టుకోవడం కష్టంగా భావించిన అకాలీదళ్‌ దళితలపై ఫోకస్‌ పెట్టింది. ఎందుకంటే పంజాబ్‌లో 32 శాతం మంది దళితులే ఉన్నారు కాబట్టి. పైగా మాయావతి నేతృత్వంలోని బహుజన్‌ సమాజ్‌పార్టీతో పొత్తు కూడా పెట్టుకుంది. 20 స్థానాలు బీఎస్‌పీకి కేటాయించింది. 2017 ఎన్నికల్లో 111 స్థానాల్లో పోటీ చేసిన బీఎస్‌పీకి 110 నియోజకవర్గాలలో డిపాజిట్లు కోల్పోయిందన్న విషయం గమనార్హం. సాధించిన ఓట్లు కూడా 1.59 శాతమే. అయితే ఈసారి మాత్రం దళితుల ఓట్లను సంపాదించడంలో మాయావతి సాయపడగలరని అకాలీదళ్‌ భావిస్తోంది. ఇప్పటికే 91 స్థానాలలో అభ్యర్థులను ప్రకటించింది కూడా. వీరంతా తమ తమ నియోజకవర్గాలలో ప్రచారం మొదలు పెట్టేశారు కూడా!

అధికార కాంగ్రెస్‌ పార్టీకి కూడా కొన్ని ఇబ్బందులు తప్పడం లేదు. అమరీంద్‌ సింగ్‌ పార్టీని వదిలిపెట్టేసి పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ పేరుతో కొత్త పార్టీ పెట్టుకున్నారు.. దీని ప్రభావం ఎంతో కొంత కాంగ్రెస్‌పై పడుతుందని కొందరు అంటున్నారు .. బీజేపీతో అమరీందర్‌ పెట్టుకున్న పొత్తు పెద్దగా వర్క్‌అవుట్‌ కాకపోవచ్చని మరికొందరు విశ్లేషిస్తున్నారు. 2017లో అకాలీదల్‌తో పొత్తు పెట్టుకున్న బీజేపీ 23 స్థానాలలో పోటీ చేసింది.. కేవలం మూడు స్థానాలలో మాత్రమే గెలుపొందింది. అప్పుడు బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం 5.39. 2019లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో మాత్రం పోటీ చేసిన మూడు స్థానాలలో విజయం సాధించింది బీజేపీ. పైగా తమ ఓట్ల శాతాన్ని 9.63కు పెంచుకుంది కూడా! ఇప్పుడు అమరీందర్‌ సింగ్‌ ప్లస్‌ బీజేపీ కలిసి ఎన్ని స్థానాలు గెల్చుకోగలరన్నదే ప్రశ్న. సాగు చట్టాల రద్దుతో రైతులు సంతృప్తి చెందారా? నరేంద్రమోదీ కరిష్మా ఏ మేరకు పని చేయగలదు? అమరీందర్‌ సింగ్‌ కాంగ్రెస్‌ ఓట్లను చీల్చగలరా? ఇలాంటి ప్రశ్నలన్నీ ఉత్పన్నం అవుతున్నాయి.

ప్రస్తుత ముఖ్యమంత్రి చరణ్‌సింగ్‌ చన్నీ, పీసీసీ చీఫ్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధు మధ్య సయోధ్య కుదిరినట్టే అనిపిస్తోంది. అయినప్పటికీ సిద్దు ఎప్పుడు ఏం మాట్లాడతారో, ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఆందోళన మాత్రం కాంగ్రెస్‌లో అలాగే ఉంది. దళితుల ఓట్ల కోసమే చన్నీకి ముఖ్యమంత్రి పదవి అప్పగించారని, ఇప్పుడు జరగబోతున్న ఎన్నికల్లో కూడా చన్నీనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని అంటున్నాయి ప్రతిపక్ష పార్టీలు. కాంగ్రెస్‌ మాత్రం ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడానికి వెనకాముందు అవుతోంది. ముఖ్యమంత్రి పదవిపై ఎప్పట్నుంచో ఆశలు పెట్టుకున్న సిద్దును కాదనలేదు కాంగ్రెస్‌. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్న క్రౌడ్‌ పుల్లర్‌ ఆయనొక్కడే! ఇప్పుడు పంజాబ్‌లో సంయుక్త సమాజ్‌ మోర్చా పేరుతో కొత్త పార్టీ వచ్చింది. సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన 22 రైతు సంఘాలు కలిసి పెట్టుకున్న పార్టీ ఇది! మొత్తంగా పంజాబ్‌ ఎన్నికలు ఆప్పుడు ఆసక్తిగా మారాయి. ఉత్తరప్రదేశ్‌ తర్వాత ఎన్నికల విశ్లేషకులు ఎక్కువగా దృష్టి పెడుతున్నది పంజాబ్‌పైనే!

Read Also….  PM Modi Punjab Tour: ‘భద్రతా లోపం’ కారణంగా పంజాబ్‌లో ప్రధాని మోడీ ర్యాలీ రద్దు..! వివరణ కోరిన హోంశాఖ