Punjab Assembly Elections 2022: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో పంజాబ్ ప్రజలకు కాంగ్రెస్ కీలక ప్రకటన చేసింది. బాలికల విద్యను ప్రోత్సహిస్తూ 12వ తరగతి ఉత్తీర్ణత సాధించిన ప్రతి బాలికకు 20 వేల రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దీనితో పాటు, బాలికలకు తదుపరి చదువుల కోసం కంప్యూటర్లు, టాబ్లెట్లు కూడా ఇస్తామని ప్రకటించారు.
అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పంజాబ్ ప్రజలను ఆకట్టుకునేందుకు, ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ కంటే ముందే రాష్ట్రంలో వాగ్దానాల పర్వం చేసింది. ఇప్పుడు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పెద్ద వాగ్దానాలు చేసింది. పంజాబ్లో బాలికల విద్యతో పాటు, మహిళల కోసం కూడా కాంగ్రెస్ హామీల వర్షం కురిపిస్తోంది. ఈ మేరకు పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ ప్రకటన చేస్తూ.. 5, 10వ తరగతి ఉత్తీర్ణులైన ప్రతి బాలికకు పార్టీ తరుఫున రూ.5 వేలు, 15 వేల రూపాయలు ఇస్తుందని ప్రకటించారు. అదే సమయంలో 12వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు 20 వేల రూపాయలు అందజేస్తామన్నారు. దీంతో పాటు తదుపరి చదువులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కంప్యూటర్లు, ట్యాబ్లెట్లు కూడా అందజేస్తామన్నారు.
పంజాబ్లోని బదౌర్లో జరిగిన ర్యాలీలో సిద్ధూ ప్రసంగిస్తూ పంజాబ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే మరోసారి మహిళలకు నెలకు రూ.2000, కుటుంబ సభ్యులకు ఏడాదిలో 8 సిలిండర్లు ఇస్తామని ప్రకటించారు.అంతకుముందు, పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ శనివారం మాట్లాడుతూ, కాంగ్రెస్ పంజాబ్ యూనిట్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూతో కలిసి పని చేయడానికి, పార్టీ కోసం “త్యాగం” చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. సిద్ధూకు మధ్య ప్రచ్ఛన్నయుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. సిద్ధూ తన సొంత పార్టీ రాష్ట్ర ప్రభుత్వంపై తరచూ విమర్శలు చేస్తుంటారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా సిద్ధూ చేసిన ప్రతికూల వ్యాఖ్యల గురించి అడిగిన ప్రశ్నకు, చన్నీ పార్టీకి ఆయన విశ్వసనీయ సైనికుడు అని, చాలా నిజాయితీతో తన బాధ్యతను నిర్వర్తిస్తున్నాడని చెప్పాడు. సిద్ధూ సాహబ్తో కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఇప్పటికే చేస్తున్నాను. పార్టీ కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమే. పార్టీ ఏది చెబితే అది పాటిస్తాను. అంటూ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ ప్రకటించిన విషయం విదితమే.
Read Also.. Viral Video: ట్రైన్ లోకో ఫైలట్ ఎమర్జెన్సీ బ్రేక్.. మోటార్మ్యాన్పై ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు!