Amit Shah in Punjab Election Campaign: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల(Punjab Assembly Election 2022)కు సమయం దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. పంజాబ్‌లో ఎలాగైనా అధికార పీఠాన్ని దక్కించుకోవాలని భారతీయ జనతా పార్టీ(BJP) పక్కా ప్లాన్‌తో వెళ్తోంది. ఇందులో భాగంగా ఇవాళ కేంద్ర మంత్రి అమిత్ షా(Amit Shah) ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. లూథియానా, అమృత్సర్ ప్రాంతంలో పర్యటించనున్నారు. కేంద్ర హోం మంత్రి లూథియానాలో ఒక గంట మాత్రమే గడపనున్నారు. దారాసి మైదానం చుట్టూ భారీగా భద్రత ఏర్పాట్లు చేస్తోంది పోలీస్ శాఖ. అలాగే బీజేపీ సీనియర్ నేతలు కూడా మహానగరంలో మకాం వేసి ఏర్పాట్లను పరిశీలించారు.
హోంమంత్రి ఆదివారం పంజాబ్‌లో పర్యటించనున్నారు. ముందుగా లూథియానాలో ర్యాలీ నిర్వహించి అనంతరం పాటియాలాలో జరిగే ర్యాలీలో ప్రసంగిస్తారు. హోంమంత్రి హెలికాప్టర్ ద్వారా ప్రభుత్వ కళాశాలలో దిగి ఆ తర్వాత దారేసి గ్రౌండ్‌కు చేరుకుంటారు. అక్కడ ర్యాలీలో ముప్పై నుంచి 45 నిమిషాల పాటు ఆగిన తర్వాత పాటియాలాకు బయలుదేరుతారు. జిల్లా ప్రధాన వేదికపై పరిమిత సంఖ్యలో కుర్చీలు ఏర్పాటు చేస్తున్నారు. లూథియానా మహానగరంలోని చారిత్రాత్మకమైన దారాసి మైదానంలో బీజేపీ అభ్యర్థులకు అనుకూలంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ర్యాలీలో పాల్గొంటారు. దీంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలీసులు దారేసి మైదానాన్ని ఒకరోజు ముందే భద్రత కింద తీసుకున్నారు. పరిసర ప్రాంతాల్లో దిగ్బంధం ఏర్పాటు చేశారు. పంజాబ్ పోలీసులతో పాటు వచ్చిన పారామిలటరీ బలగాలను కూడా దిగ్బంధనం చేశారు. కేంద్రమంత్రి అమిత్ షా ర్యాలీకి ముందు బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి, ఇతర సీనియర్ నేతలు అక్కడికి చేరుకున్నారు. అక్కడే విడిది చేసి ఏర్పాట్లను పరిశీలించారు. దీంతో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా లూథియానాకు చేరుకున్నాయి.
భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు పుష్పిందర్ సింఘాల్ అన్ని ఏర్పాట్లను సమీక్షించామని తెలిపారు. ఆదివారం అమిత్ షా ర్యాలీ తర్వాత ఎన్నికల వాతావరణం పూర్తిగా మారిపోనుంది. మహానగరంలో బీజేపీ, దాని మిత్రపక్షాలు అన్ని స్థానాల్లో విజయం సాధిస్తాయి. ర్యాలీకి వేలాది మంది హాజరవుతారని అంచనా వేస్తున్నామని, అయితే ఎన్నికల సంఘం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం సుమారు పది వేల మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశామని కేంద్ర మంత్రి మీనాక్షి లేకి తెలిపారు.
ఇదిలావుంటే పంజాబ్ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీకి గతంలో చేదు అనుభం ఎదురైన నేపథ్యంలో అమిత్ షా పర్యటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఫిరోజ్పూర్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా, రైతుల నిరసనల కారణంగా వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత అమిత్ షా తొలిసారి పంజాబ్‌లో పర్యటించనున్నారు. కమిషనరేట్ పోలీసులు ఎలాంటి రిస్క్ తీసుకోకూడదన్నారు. హోంమంత్రి కాన్వాయ్ వెళ్లే దారిలో పోలీసు బలగాలను పూర్తిగా మోహరించారు. దారేసి మైదాన్ చుట్టుపక్కల ఆంక్షలు విధించారు.
లూథియానా, పాటియాలా బహిరంగ సభల అనంతరం అమిత్ షా.. అమృత్‌సర్‌లో పర్యటించనున్నారు. సాయంత్రం 5:15 అమత్సర్ చేరుకుని వాల్మీకి మందిర్‌లో పూజలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత దుర్గియానా మందిర్‌లో సాయంత్రం 7 గంటలకు ప్రార్థనలు చేస్తారని పంజాబ్ బీజేపీ శాఖ వెల్లడించింది.