Punjab Assembly Election 2022: ఓ వైపు ఎన్నికలు జరుగుతున్నా.. పంజాబ్ కాంగ్రెస్‌లో అనేక మార్పులు చోటు చేసుకున్నా.. నాటి మంటల పొగలు ఇంకా వెలువడుతూనే ఉన్నాయి. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్( Captain Amarinder Singh). నవజ్యోత్‌సింగ్ సిద్ధూ(Navjot Singh Sidhu)ను తిరిగి మంత్రి పదవిలోకి తీసుకోవాలని పాకిస్థాన్(Pakistan) నుంచి గతంలో తనకు రాయబారం అందినట్లు ప్రకటించారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పేరుతో సందేశం వచ్చినట్లు ఆరోపించారు.
పంజాబ్ రాజకీయాల్లో అప్పట్లో కెప్టెన్, సిద్ధూ మధ్య వివాదం సంచలనంగా మారింది. ఇరువురి మధ్య విబేధాల నేపథ్యంలో సిద్ధూ.. సొంత పార్టీపైనే విమర్శలు చేశారు. అది కాస్తా కాంగ్రెస్ పార్టీలో సంక్షోభానికి తెరలేపింది. దీంతో సిద్ధూను మంత్రి పదవి నుంచి కెప్టెన్ తొలగించారు. ఈ క్రమంలో.. సిద్ధూను మళ్లీ మంత్రి పదవిలోకి తీసుకోవటంపై పాకిస్థాన్ ప్రధాని లాబీయింగ్చేసినట్లు అమరీందర్ తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. సిద్ధూ అసమర్థుడు కాబట్టి అతడిని మంత్రివర్గం నుంచి తొలగించాను. 70 రోజుల్లో ఒక్క ఫైల్ అతడు సిద్ధం చేయలేకపోయాడని అమరీందర్ సింగ్ దుయ్యబట్టారు.
అయితే రెండు, మూడు వారాల తర్వాత సిద్ధూని తిరిగి రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని పాకిస్థాన్ నుంచి ఓ మెసేజ్ వచ్చింది. ఈసారి చేర్చుకోండి. అయినా అతని సరైన పనితీరు కనబరచకపోతే మళ్లీ తొలగించండంటూ పాక్ ప్రధాని పేరుతో ఓ సందేశం వచ్చిందని అమరీందర్ తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర మంత్రులు హర్దీప్సింగ్ పూరీ, గజేంద్రసింగ్ షెకావత్ కూడా ఉన్నారు. వివాదం కాస్తా చినికి చినికి గాలివానలా మారడంతో కాంగ్రెస్ పార్టీని వీడిన అమరీందర్ సింగ్ పీఎల్సీ పార్టీ ఏర్పాటు చేశారు. పంజాబ్ ఎన్నికల సందర్భంగా అమరీందర్ సింగ్ ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. తాజాగా 22 మందితో కూడిన మొదటి అభ్యర్థుల జాబితా విడుదల చేశారు. పాటియాలా అర్బన్ నుంచి బరిలోకి దిగనున్న కెప్టెన్ ఇప్పుడు ఈ తరహా కామెంట్స్ చేయడం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
Read Also…UP Election 2022: సమాజ్‌వాదీ పార్టీకి మరో షాక్, బీజేపీలో చేరిన జలాల్పూర్ ఎమ్మెల్యే..