Aam Aadmi Party: జాతీయ పార్టీగా గుర్తింపు పొందేందుకు ఒక్క ఆడుగు దూరంలో ఆప్.. ఇక ఆ రాష్ట్రాలే టార్గెట్..

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఘన విజయం నూతన అధ్యయనానికి తెర తీసింది...

Aam Aadmi Party: జాతీయ పార్టీగా గుర్తింపు పొందేందుకు ఒక్క ఆడుగు దూరంలో ఆప్.. ఇక ఆ రాష్ట్రాలే టార్గెట్..
AAP
Srinivas Chekkilla

|

Mar 11, 2022 | 8:44 PM

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఘన విజయం నూతన అధ్యయనానికి తెర తీసింది. దశాబ్దం కిందట ఎలాంటి అట్టహాసాలు, ఆర్భాటాలు లేకుండా ఆవిర్భవించిన చిన్న ప్రాంతీయ పార్టీ ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. కేవలం పదేళ్ల వ్యవధిలోనే రెండు రాష్ట్రాలలో అధికారంలోకి రావడం అన్నది మామూలు విషయం కాదు. పంజాబ్‌(Punjab)లో ఆప్‌ సాధించిన విజయం కూడా అసాధారణమైనదే! గెలుపుతో పాటు 60 ఏళ్ల రికార్డును తుచిడిపెట్టేసింది చీపురు పార్టీ. AAP పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తన రెండో ప్రయత్నంలో 92 స్థానాల్లో విజయం సాధించడం గొప్ప విషయం. ఇక్కడ ప్రధాన ప్రత్యర్థి, అధికారంలో ఉన్న కాంగ్రెస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో 77 సీట్లు సాధించగా.. ఇప్పుడు కేవలం 18 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది.

గత ఎన్నికల్లో 20 స్థానాల్లో విజయం సాధించిన ఆప్‌..18 నియోజకవర్గాల్లో తిరిగి గెలుపొందింది. రెండు స్థానాల్లో ఓడిపోయింది. ఇందుకో ఒకటి (భోలాత్) కాంగ్రెస్ రాగా.. మరో స్థానంలో శిరోమణిఆకాలీదళ్ గెలిచింది. కాంగ్రెస్ గతంతో పోలిస్తే 59 సీట్లను కోల్పోయింది. ఇక శిరోమణి అకాలీదళ్ (SAD) 2015 నుంచి సీట్లు కోల్పోతూ వస్తోంది. 2012 ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్‌ గెలిచిన 20 స్థానాల్లో 2017 ఎన్నికల్లో 13 సీట్లను ఆప్ కైవసం చేసుకుంది. మరో 7 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో AAP మళ్లీ శిరోమణిఆకాలీదళ్ సిట్టింగ్‌ స్థానాల్లో 10 సీట్లను గెలుచుకుంది. దీంతో ప్రస్తుతం SAD మూడు స్థానాలకే పరిమితమైంది.

ఆప్ ప్రయాణం అంత సులభంగా ప్రారంభం కాలేదు. 2013లో దేశ రాజధాని ఢిల్లీలో ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్ ఉద్యమం విజయవంతం అయిన తర్వాత ఆప్ తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించింది. అదే సంవత్సరంలో AAP ఢిల్లీ ఎన్నికలలో పోటీ చేసి కాంగ్రెస్‌ సపోర్ట్‌తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. లోక్ పాల్ బిల్లును ఆమోదించడంలో విఫలమైన వెంటనే ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేశారు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ ఎన్నికల్లో ఆప్ 67 సీట్లు గెలుచుకోగా, బీజేపీకి కేవలం 3 సీట్లకే పరిమితమైంది. 2020లో ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ మళ్లీ అధికారంలోకి వచ్చింది. 62 సీట్లు సాధించి మరోమారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ 8 సీట్లు మాత్రమే పెంచుకోగలిగింది. ఢిల్లీలో ఇప్పుడు పంజాబ్‌లో ఆప్ స్థిరమైన పనితీరు రాష్ట్ర రాజకీయాలకు కొత్త ప్రారంభాన్ని సూచిస్తుంది. ఆ పార్టీ చాలా చోట్ల కాంగ్రెస్ స్థానంలో నిలవడమే కాకుండా బీజేపీకి వ్యతిరేకంగా కూడా పోరాడుతుంది. పంజాబ్, ఢిల్లీ ఎన్నికల ఓటింగ్ సరళి అందుకు నిదర్శనం.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌కు పెరుగుతున్న ఓట్ల శాతం ఆ పార్టీ కాషాయ పార్టీకి ప్రధాన ప్రత్యర్థిగా ఎదుగుతుందనే వాస్తవాన్ని స్పష్టంగా బలపరుస్తోంది. ఆప్ 2013లో 29.7 శాతం ఉన్న ఓట్ల శాతాన్ని 2020 అసెంబ్లీ ఎన్నికల్లో 55 శాతానికి పెంచుకోగలిగింది. ఇదిలా ఉంటే.. జాతీయ పార్టీ ఇంకా 30 శాతం రేంజ్‌లో కొనసాగుతోంది. 2013లో 33.3 శాతం ఓట్లు రాగా, 2020 ఎన్నికల్లో అది 38.7 శాతానికి పెరిగింది. లోక్‌సభ ఎన్నికల్లో అనుసంరించాల్సిన విధానంపై ఆప్‌ దృష్టి సారిస్తోంది. ముఖ్యంగా పంజాబ్, ఢిల్లీలోని డేటా ఇది స్పష్టంగా కనిపిస్తుంది. 2014లో 432 స్థానాల్లో పోటీ చేసిన పార్టీ దాదాపు 2 శాతం ఓట్లతో 4 సీట్లు (అన్నీ పంజాబ్‌ నుంచి) గెలుచుకోగలిగింది. అయితే, 2019లో ఆర్ కేవలం 35 స్థానాల్లో (పంజాబ్ ప్రాంతంలో) పోటీ చేసి అర శాతం ఓట్లను సాధించింది. పంజాబ్‌లో విజయం సాధించడంతో రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఏకైక ప్రాంతీయ పార్టీగా ఆప్ అవతరించింది. పంజాబ్‌లో అద్భుత విజయంతో పాటు గోవాలో కూడా 2 సీట్లతో ఖాతా తెరిచింది. గోవాలో 6 శాతం ఓట్లు రావడం రాష్ట్రంలో పార్టీ పటిష్ట స్థితిని తెలుపుతుంది.

జాతీయ పార్టీ హోదా పొందడానికి నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో ఆప్‌కి కనీసం 6 శాతం ఓట్లు అవసరం. ఇప్పటికి మూడు రాష్ట్రాల్లో ఈ ఘనత సాధించింది. ఢిల్లీతో పాటు (55 శాతం), ఇప్పుడు పంజాబ్ (42 శాతం), గోవా (6.7 శాతం)లో ఆరు శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు ఏడాది చివరి నాటికి జరగనున్నాయి. ఈ రాష్ట్రాల్లో విజయం సాధించి జాతీయ హోదా పొందాలని భావిస్తోంది. ఆ పార్టీ లోక్‌సభలో కనీసం నాలుగు సీట్లు గెలవాలి. పంజాబ్‌లోని సంగ్రూర్‌లో వారికి ప్రస్తుతం ఒకే ఒక్క సీటు మాత్రమే ఉంది. గత లోక్‌సభ ఎన్నికలలో దాని పనితీరు ఆకట్టుకోలేకపోయినప్పటికీ, పంజాబ్‌లో విజయం మార్పులు తీసుకురాగలదు.

Read Also.. Punjab Congress: సొంత పార్టీపైనే సెటైర్లు వేసిన సిద్ధూ.. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu