కాంగ్రెస్ పార్టీ కొత్త ట్రై చేస్తోంది. తన గోల్ ఏంటో తెలుసుకునే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లుగా కనిపిస్తోంది. గుజరాత్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టినట్లుగా తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుని ప్రధాని నరేంద్ర మోదీపై వ్యక్తిగత దాడులు మానుకోవాలని కాంగ్రెస్ అగ్రనాయకత్వం పార్టీ గుజరాత్ యూనిట్‌ను కోరింది. దీంతో పాటు ఈ ఏడాది చివర్లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు మోదీ వర్సెస్ కాంగ్రెస్ పోరుగా మారకూడదని పార్టీ హైకమాండ్ సూచించింది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేయడానికి కాంగ్రెస్ టాస్క్ ఫోర్స్ టీమ్‌ను ఏర్పాటు చేసుకుంది. ఈ టాస్క్ ఫోర్స్ టీమ్ ఈ ఎన్నికలల్లో కీలకంగా పనిచేయనుంది. రాష్ట్ర పార్టీకి ట్రీట్మెంట్ చేస్తుంది. ఎలా నడుచుకోవాలో.. ఎలా మాట్లాడాలో కూడా నేర్పిస్తుంది. ఇదిలావుంటే.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వ్యూహంపై చర్చించడానికి పార్టీ గుజరాత్ యూనిట్ నాయకులతో సోమవారం సమావేశం నిర్వహించింది. దేశ రాజధాని ఢిల్లీలోని కాంగ్రెస్ వార్ రూమ్‌లో జరిగిన ఈ సమావేశంలో ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, పి చిదంబరం, రణదీప్ సూర్జేవాలా, అజయ్ మాకెన్, జైరాం రమేష్, ముకుల్ వాస్నిక్, సునీల్ కనుంగోలు, గుజరాత్ కాంగ్రెస్ నాయకత్వం పాల్గొన్నారు. పలు అంశాలపై చర్చించింది.
నాలుగున్నర గంటలకు పైగా జరిగిన చర్చ..
ప్రధాని మోదీపై వ్యక్తిగత దాడికి పాల్పడకూడదని.. ఎన్నికలను ‘పీఎం మోదీ వర్సెస్ కాంగ్రెస్’గా మార్చకూడదని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం. అయితే, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ప్రభుత్వ విధానాలను విమర్శించాలని టాస్క్‌ఫోర్స్ గుజరాత్ యూనిట్‌ను కోరింది.
2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ గురించి కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ చేసిన “నీచ్ ఆద్మీ” అంటూ చేసిన కామెంట్ ఆ ఎన్నికల ఫలితాలపై భారీ ప్రభావం పడింది.. అదే పెద్ద కీలక మలుపుగా పరిగణించారు. ఇంతకుముందు, కాంగ్రెస్ చాలా దూకుడుగా ప్రచారం చేసింది. అయితే బీజేపీ, ప్రధాని మోడీ ఈ వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మార్చుకుంది. అదేవిధంగా, డిసెంబర్ 1, 2007 న, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సోనియా గాంధీ నరేంద్ర మోడీని “మౌత్ కా సౌదాగర్” అని పిలిచారు. ఈ ప్రకటన కాంగ్రెస్‌కు చాలా భారంగా మారింది.
సమావేశంలో తీసుకున్న నిర్ణయాలేంటి ?
గుజరాత్ ప్రభుత్వ వైఫల్యాలు, దళితులు, రైతులు, గిరిజనుల సమస్యలు, రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ఉంచాలని కూడా సమావేశంలో నిర్ణయించారు. ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వ హామీలను గుజరాత్లో బహిర్గతం చేయగా, ఆప్‌ను ‘బిజెపి బి టీమ్’గా ప్రచారం చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాకు ఇన్ఛార్జ్ రఘు శర్మ ద్వారా పంపి తుది ముద్ర వేయనున్నారు.
ఇక 2017 ఎన్నికల్లో 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీలో 182 స్థానాలకుగాను బీజేపీ 99 స్థానాలను గెలుచుకోగా, కాంగ్రెస్ 77 స్థానాలను గెలుచుకుంది.