Omicron: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారంటే..

Elections, Elections 2022, Allahabad High court, Covid 19, Omicron, Election commission of india

Omicron: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారంటే..
Follow us

| Edited By: uppula Raju

Updated on: Dec 25, 2021 | 1:19 AM

దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న క్రమంలో గురువారం అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో యూపీతో సహా అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు కేంద్ర ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించింది. దేశంలో ఒమిక్రాన్‌ వేగంగా విస్తరిస్తోందని పరిస్థితి చూస్తుంటే కరోనా రెండో ఉధృతి మించి ఉండొచ్చని అలహాబాద్ సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ‘కరోనా నిబంధనలు పాటిస్తూ ఎన్నికల ర్యాలీలు నిర్వహించడం ఏవిధంగానూ సాధ్యపడదు. కేసులు పెరుగుతున్న దృష్ట్యా చైనా, నెదర్లాండ్స్‌, జర్మనీ తదితర దేశాలు పాక్షిక లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాయి’ అని జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది. అయితే ఒమిక్రాన్‌ కట్టడిలో భాగంగా రాజకీయ పార్టీల ర్యాలీలను ఆపండన్న అలహాబాద్‌ హైకోర్టు వ్యాఖ్యలు సమర్థనీయమే అయినా.. ఏకంగా అసెంబ్లీ ఎన్నికలను వాయిదావేయమనడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రజాస్వామ్య, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం? అయితే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్రం షెడ్యూల్ ఇంకా ప్రకటించలేదు. దీనికి తోడు ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్నా డెల్టా, డెల్టా వేరియంట్‌లా తీవ్రత ఉండకపోవచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక ఒమిక్రాన్‌ బారిన పడుతున్నవారు ఆస్పత్రిలో చికిత్స తీసుకుని వేగంగానే కోలుకుంటున్నారు. ఇతర వేరియంట్ల కంటే ప్రాణాంతకం కాకపోవచ్చని కొన్ని అధ్యయానాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మూడో దశ ఉద్ధృతిని ముందే వూహించి ఎన్నికలను వాయిదా వేయాలనుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమనే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈనేపథ్యంలో దేశంలో ఒమిక్రాన్‌ వ్యాప్తి ఎలా ఉంటుందో రాబోయే రెండు వారాల్లో పరిస్థితిని అంచనా వేయడానికి కేంద్ర ఎన్నికల సమయానికి తగినంత సమయం ఉందని, అప్పటికి పరిస్థితి అదుపులోకి రాకపోతే ఎన్నికల వాయిదాపై పునరాలోచన చేయాలని రాజకీయ నిపుణులు సూచిస్తున్నారు. ఇక కరోనా వైరస్ ఇప్పట్లో అంతమవ్వదని ఈ వైరస్‌ ప్రభావం మరో మూడేళ్ల వరకు ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈక్రమంలో మహమ్మారి కారణంగా అన్ని రోజుల పాటు ఎన్నికలను వాయిదా వేయడం రాజ్యాంగంలోని ప్రాథమిక అంశాలైన ప్రజాస్వామ్యం, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఆ దేశాల్లో ఎన్నికలు ఎలా నిర్వహించారంటే.. ఒకనొక దశలో కరోనా వైరస్‌ హాట్‌స్పాట్‌గా మారిపోయింది అగ్రదేశం అమెరికా. అయినా కొవిడ్‌ నిబంధనలకు పాటిస్తూనే అధ్యక్ష ఎన్నికలను నిర్వహించారు. ఇప్పుడు అలహాబాద్‌ హైకోర్టు సూచించినట్లే అక్కడ వైరస్‌ విస్తృత రూపం దాల్చాక రాజకీయ పార్టీల ర్యాలీలపై నిషేధం విధించారు. నిధుల సేకరణ, జన సమీకరణ, బహిరంగ సమావేశాలను రద్దు చేశారు. ప్రచారమంతా ఆన్‌లైన్‌లోనే సాగింది. డిజిటల్‌ క్యాంపెయిన్లతో ప్రచారం హోరెత్తించారు. ఇక పోలింగ్‌ విషయంలో కరోనా నిబంధనలను తూచా తప్పకుండా పాటించేలా జాగ్రత్తలు తీసుకున్నాయి. పోలింగ్‌ కేంద్రాల్లో మాస్క్‌లు తప్పనిసరి చేశారు. సాధ్యమైనంతవరకు జనాలు గూమిగూడకుండా చాలామందికి మెయిల్‌ ద్వారా తమ బ్యాలెట్‌ పేపర్లను పంపే సౌలభ్యం కల్పించారు. ఇక 2020లో దక్షిణ కొరియాలో జరిగిన ఎన్నికలైతే ఒక చరిత్ర అని చెప్పుకోవాలి. గత 28 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా ఏకంగా 66.2 శాతం పోలింగ్‌ నమోదైంది. కరోనా కాలంలోనూ ఇలా భారీగా పోలింగ్‌ నమోదవ్వడానికి ఆ దేశ ప్రభుత్వం తీసుకున్న పటిష్ఠమైన చర్యలే ప్రధాన కారణం. ముందస్తుగానే పోలింగ్‌ కేంద్రాలను శానిటైజేషన్‌ చేసింది. మాస్క్‌లు, గ్లౌవ్స్‌, హ్యాండ్ శానిటైజర్లను కచ్చితంగా ఉపయోగించాలని ఆదేశాలు జారీ చేసింది. థర్మల్‌ స్ర్కీనింగ్ చేశాకే ఓటర్లను పోలింగ్ బూత్‌ల్లోకి అనుమతించారు. 99.5 డిగ్రీల ఫారెన్‌హీట్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నవారిని ప్రత్యేక పోలింగ్ బూత్‌ల్లోకి పంపి ఓటు వేసేలా ఏర్పాట్లు చేశారు. ఇక కొవిడ్‌ బాధితులు మెయిల్‌ ద్వారా తమ బ్యాలెట్‌ పేపర్‌ను పంపించే సౌలభ్యం కల్పించారు. ఇక హోం క్వారంటైన్‌, ఐసోలేషన్‌ ఉన్నవారిని సాయంత్రం 6 తర్వాత అది కూడా ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన పోలింగ్‌ కేంద్రాల్లోకి పంపి ఓటు వేయించారు.

మన రాజ్యాంగం ఏం చెబుతోందంటే.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం, ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించిన తర్వాత ఆరు నెలల వరకు ఎన్నికలను వాయిదా వేయవచ్చు. అయితే ఇది హౌస్ అండ్‌ అసెంబ్లీ రెండు సెషన్‌ల మధ్య రాజ్యాంగపరంగా నిర్వచించబడిన పరిమితి ( రాజ్యాంగంలోని ఆర్టికల్ 85(1), ఆర్టికల్ 174(1) ప్రకారం జరుగుతుంది. ఆరునెలల తర్వాత మరికొంత కాలం పొడిగించాలంటే మాత్రం ఎగ్జిక్యూటివ్‌ కోర్టు అనుమతి తీసుకోవాల్సిందే. ఇక అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) తలెత్తితే ఆర్టికల్ 172(1)లోని నిబంధన ప్రకారం, ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత ఆరు నెలల పాటు అదనంగా ఒక ఏడాది పాటు ఎన్నికలను వాయిదా వేయవచ్చు. కాగా కరోనా విస్తరిస్తోన్న దశలోనే 2020లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. గత ఎన్నికల కంటే భారీగా పోలింగ్‌ నమోదైంది. ఇక ఈ ఏడాది కూడా కరోనా రెండో దశ ఉద్ధృతి సాగుతున్న దశలోనే తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అస్సాం, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగడం గమనార్హం.

Also Read:

Telugu Actress: కళ్లతోనే మాయ చేస్తోన్న.. ఈ క్రేజీ బ్యూటీ ఎవరో కనిపెట్టగలరా..?

Samantha: వరుణ్ ధావన్ తో జోడీ కట్టనున్న సామ్‌.. స్టైలిష్‌ స్పై ఏజెంట్లుగా మెప్పించనున్న క్రేజీ కాంబో..

Anand Mahindra: ఆఫ్రికన్‌ అన్నాచెల్లెళ్ల ప్రతిభకు ఆనంద్‌ మహీంద్రా ఫిదా.. ట్విట్టర్‌లో ఏం చెప్పారంటే..