మీ ఓటు ఇలా వినియోగించుకోండి… బల్దియాలో బ్యాలెట్ ఓటింగ్‌పై అవగాహన కల్పిస్తున్న ఎన్నికల అధికారులు..

గ్రేటర్‌ ఎన్నికల్లో 18 ఏళ్ల తర్వాత బ్యాలెట్‌ ఓటింగ్‌ విధానాన్ని ఎలక్షన్‌ కమిషన్‌ తిరిగి ప్రవేశపెట్టింది. గత కొన్నేళ్ల నుంచి ఓటర్లందరికి ఈవీఎం విధానమే బాగా అలవాటైంది. ఇప్పుడు నగరవాసికి బ్యాలెట్‌ ఓటింగ్‌ విధానం

  • Sanjay Kasula
  • Publish Date - 3:47 pm, Sun, 29 November 20

గ్రేటర్‌ ఎన్నికల్లో 18 ఏళ్ల తర్వాత బ్యాలెట్‌ ఓటింగ్‌ విధానాన్ని ఎలక్షన్‌ కమిషన్‌ తిరిగి ప్రవేశపెట్టింది. గత కొన్నేళ్ల నుంచి ఓటర్లందరికి ఈవీఎం విధానమే బాగా అలవాటైంది. ఇప్పుడు నగరవాసికి బ్యాలెట్‌ ఓటింగ్‌ విధానం కొంచెం కొత్తగా అనిపించే అవకాశముంది. ఇక వృద్ధులు, నిరక్షరాస్యులు కొంత కన్ఫ్యూజన్‌కు గురయ్యే అవకాశము ఉంది. నిజానికి ఈవీఎంలు రాకముందు అన్నీ ఎన్నికలు బ్యాలెట్‌ విధానంలోనే జరిగేవి. ఈవీఎంలు వచ్చిన తర్వాత అంతా ఈ బ్యాలెట్‌ బాక్స్‌ను మర్చిపోయారు. మళ్లీ గ్రేటర్‌ ఎన్నికల్లో ఈ బాక్స్‌లు దర్శనమివ్వనున్నాయి.

గ్రేటర్‌ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే ప్రజలు బ్యాలెట్‌ ఓటింగ్‌ విధానంపై కొంత అవగాహన తెచ్చుకోవడం అవసరం. అక్కడి అధికారులు ఎలా ఓటు వేయాలో వివరిస్తారు. కానీ ముందుగానే ఆ ప్రక్రియ గురించి తెలిస్తే ఓటు వేయడం ఇంకాస్త సులభం అవుతుంది. పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లేవారు తప్పనిసరిగా ఓటరు స్లిప్‌ను తమవెంట తీసుకెళ్లాలి. స్టెప్‌ వన్‌లో ఆ స్లిప్‌ను పోలింగ్‌ అధికారికి చూపించాలి. ఆ స్లిప్‌పై ఉన్న నెంబర్‌ చెక్‌ చేసిన తర్వాత ప్రిసైడింగ్‌ అధికారికి ఐడీ కార్డు చూపించాలి. సెకండ్‌ స్టెప్‌లో పోలింగ్‌ అధికారి ఓటరు ఎడమ చేయి చూపుడు వేలికి సిరా మార్క్‌ వేస్తారు.

ఇక థర్డ్‌ స్టెప్‌లో భాగంగా పోలింగ్‌ అధికారి ఓటరు సంతకం లేదంటే వేలిముద్ర తీసుకుంటారు. ఓటరు చేతికి రబ్బరు స్టాంప్‌ ఇచ్చి.. ఓటు వేసే విధానం వివరిస్తారు. ఫోర్త్‌ స్టెప్‌లో బ్యాలెట్‌ పేపరుతో ఓటు వేసే గదిలోకి వెళ్లాలి. ఫిఫ్త్‌ స్టెప్‌లో బ్యాలెట్‌ పేపరులో ఉండే అభ్యర్థి పేరు లేదా పార్టీ గుర్తు ఎదురుగా స్టాంప్‌ వేయాలి. ఆ స్టాంప్‌ అటు ఇటుగా వేస్తే మీ ఓటు చెల్లని ఓట్ల లిస్టులోకి చేరిపోతుంది. ఇక చివరి స్టెప్‌లో ఆ బ్యాలెట్‌ పేపర్‌ను జాగ్రత్తగా బ్యాలెట్‌ బ్యాక్స్‌లో వేసేయాలి. అంతే అక్కడితో ఓటింగ్‌ ప్రక్రియ పూర్తయినట్లే. అటు గర్భిణులు, బాలింతలు, వృద్ధులు క్యూలో గంటల తరబడి వెయిట్‌ చేయాల్సిన పని లేకుండా నేరుగా పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లి ఓటేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.