హైదరాబాద్‌లో ఎలెక్షన్ కోడ్ స్టార్ట్.. వరద సాయానికి ఈసీ బ్రేక్.. గ్రేటర్ ఫలితాల తర్వాతే సాయం!

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బుధవారం నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల నగారా మంగళవారం మోగగా.. గత ఇరవై రోజులుగా కొనసాగుతున్న వరద సాయానికి బుధవారం బ్రేక్ పడినట్లయింది.

  • Rajesh Sharma
  • Publish Date - 3:45 pm, Wed, 18 November 20
హైదరాబాద్‌లో ఎలెక్షన్ కోడ్ స్టార్ట్.. వరద సాయానికి ఈసీ బ్రేక్.. గ్రేటర్ ఫలితాల తర్వాతే సాయం!

Election code commences in Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బుధవారం నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల నగారా మంగళవారం మోగగా.. బుధవారం నుంచి నామినేషన్లకు తెరలేచింది. నోటిఫికేషన్ జారీ అయిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎలెక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం ఆదేశాలిచ్చింది.

ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఇటీవలి వరదలతో దెబ్బతిన్న బాధితులకు ప్రభుత్వం అందచేస్తున్న వరద సాయానికి బ్రేక్ పడింది. జీహెచ్ఎంసీ పరిధిలో వరదసాయం కోసం దరఖాస్తుల స్వీకరణ, పంపిణీని నిలిపి వేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో నగరంలో పరిధిలో వరద సాయం పంపిణీ నిలిచిపోనున్నది. తిరిగి గ్రేటర్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాతనే వరద సాయం పంపిణీ పున: ప్రారంభం కానున్నది. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరవాత పథకాన్ని యధావిధిగా కొనసాగించుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నది రాష్ట్ర ఎన్నికల సంఘం.

నిజానికి మంగళవారం గ్రేటర్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో నోటిఫికేషన్ జారీ అయ్యే వరకు వరద సాయం పంపిణీ కొనసాగుతుందని భావించిన బాధితులు బుధవారం తెల్లవారుజాము నుంచే ఈసేవా కేంద్రాల్లో పెద్ద ఎత్తున క్యూ కట్టారు. తాజాగా ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలతో వరద సాయం పంపిణీ నిలిచిపోనున్నది. అయితే బాధితుల నుంచి దరఖాస్తులను మాత్రం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. చెల్లింపులను ఎన్నికల ఫలితాల తర్వాతనే తిరిగి ప్రారంభించనున్నది సర్కార్.

ALSO READ: ఆ విషయాన్ని మైండ్‌లోంచి తీసేయ్యండి.. పార్టీ నేతలకు కేసీఆర్ ఆదేశం

ALSO READ: వచ్చే ఏడు టీమిండియా బిజీ బిజీ.. క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే పండగ