మాస్క్‌లు పెట్టుకోండి.. లేదా సమాధులు తవ్వండి…

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది.. మానవాళిని భయభ్రాంతులను చేస్తోంది.. ఆ మహమ్మారి విజృంభణను ఎలా కట్టడి చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.

  • Balu
  • Publish Date - 1:31 pm, Tue, 15 September 20

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది.. మానవాళిని భయభ్రాంతులను చేస్తోంది.. ఆ మహమ్మారి విజృంభణను ఎలా కట్టడి చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.. టీకా వచ్చేంత వరకు ఎవరి జాగ్రత్తలో వారు ఉండాలని ప్రభుత్వాలు చెబుతున్నా కొందరు మాత్రం పట్టించుకోవడం లేదు.. మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం వల్ల కరోనాను కొంతలో కొంత నియంత్రించవచ్చని నిపుణులు చెబుతున్నా నిర్లక్ష్యం వహిస్తున్నారు.. అయితే కరోనా నియంత్రణ కోసం పెట్టిన నిబంధనలను పాటించని వారికి కొన్ని దేశాలు జరిమానాలు విధిస్తున్నాయి.. కొన్ని దేశాలు జైల్లో కూడా తోస్తున్నాయి.. ఇండోనేషియాలో మాత్రం ఇలా చేస్తున్న వారికి విచిత్రమైన శిక్షలు విధిస్తున్నారు. తూర్పు జావాలో ఇలా మాస్కులు పెట్టుకోని ఓ ఎనిమిది మందితో సమాధులు తవ్వించారు.. నిబంధనలు పాటించకపోతే రేపొద్దున్న మీకు కూడా వీటి అవసరం రావచ్చని చెబుతున్నారు.. అక్కడ సమాధులు తవ్వే వాళ్లు తక్కువగా ఉన్నారట! ముగ్గురు మాత్రమే ప్రస్తుతం ఆ పని చేస్తున్నారట! అందుకే మాస్క్‌లు పెట్టుకోనివారితో సమాధులు తవ్విస్తున్నామని చెబుతున్నారు అధికారులు. ఒక్కో సమాధిని ఇద్దరు కలిసి తవ్వుతున్నారని, ఒకరు తవ్వుతుంటూ మరొకరు చెక్క బోర్డు పెడుతున్నారని అధికారులు అంటున్నారు.. ఇలా సమాధులు తవ్వడం కంటే మాస్కు పెట్టుకుంటే సరిపోతుందనే భావనకు వచ్చారు అక్కడి ప్రజలు..