మాన్‌సూన్ ఎఫెక్ట్: కొచ్చి ఎయిర్ పోర్ట్ తాత్కాలికంగా మూసివేత!

Operations at the Cochin International Airport to resume tomorrow, మాన్‌సూన్ ఎఫెక్ట్: కొచ్చి ఎయిర్ పోర్ట్ తాత్కాలికంగా మూసివేత!

కేరళ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. కొన్ని రోజుల నుంచి కుండపోతగా  కురుస్తున్న వర్షాలకు నదుల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులన్నీ నీటితో నిండిపోయాయి. భారీ వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాలు..వరదలతో కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు సమీపంలో ఉన్న పెరియార్‌ నదికి వరద ఉధృతి ఎక్కువైంది. ఆగస్టు 15వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో ఆదివారం (ఆగస్టు 11) మధ్యాహ్నం 12 గంటల వరకు కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేసివేస్తున్నామని అధికారులు ప్రకటించారు.

వరదల వల్ల కేరళలో 40 మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు. సుమారు లక్ష మంది నిరాశ్రయులయ్యారు. గత మూడు రోజుల్లో వయనాడ్‌, మలప్పురం జిల్లాల్లో రెండు కొండచరియలు విరిగిపడ్డ ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదంలో 200 మందికి గాయాలయ్యాయి. ఆ ప్రాంతంలోని ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.

ఈక్రమంలో మరింత ప్రమాదం జరగవచ్చని భావిస్తున్న అధికారులు వయనాడ్‌ నుంచి 22 వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. భారీ వర్షాల కారణంగా కేరళ ప్రభుత్వం రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. సీఎం పినరయి విజయన్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అధికారులతో మాట్లాడి వరద పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఇప్పటికే పలు సహాయక శిబిరాలను ఏర్పాటు చేసిన బాధితులకు మౌలిక సదుపాయాలను ఏర్పాటుచేశారు. కాగా 2018లో కూడా కేరళ రాష్ట్రాన్ని వరదలు అతలాకుతలం చేసిన విషయం విదితమే.

మొన్నటి వరకు తీవ్ర నీటి ఎద్దడితో తల్లడిల్లిన తమిళనాడును సైతం భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. పర్యటక ప్రాంతమైన నీలగిరి కొండల్లో భారీ వర్షాలతో.. వరద ఉదృతంగా ప్రవహిస్తోంది. పిల్లూరు ఆనకట్టకు పెద్ద ఎత్తున వరద ప్రవాహం ఉండడంతో.. ఆనకట్ట ప్రమాదకరంగా మారింది. దీంతో ముందస్తు జాగ్రత్తగా నీలగిరి జిల్లాల్లో అధికారులు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. పిల్లూరు ఆనకట్ట దిగవ ప్రాంతంలో పలు గ్రామాలు నీట మునిగాయి. దీంతో ముంపు ప్రాంతాల్లో సహాయ చర్యల కోసం తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్‌ పోర్స్‌ సాయంను కోరింది. దానికితోడు ప్రభుత్వ యంత్రాంగమంతా ఎప్పటికప్పడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ.. సహాయ చర్యలను ముమ్మరం చేస్తోంది.

మరోవైపు కావేరి నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో నదీ పరివాహాక ప్రాంతాల్లో దండోరా వేసి ప్రమాద హెచ్చరికలను జారీ చేస్తున్నారు. ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలు పడుతుండటంతో హోగెనేకల్‌లో వాగులు, జలపాతాలు ఉప్పొంగుతున్నాయి. మరోవారం పాటు ఇదే స్థాయిలో వరద కొనసాగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *