దశ తిరిగిన ‘ జిప్ లైన్ ‘..కోట్లకు పడగెత్తింది

అమెరికాలోని స్టార్టప్ ‘ జిప్ లైన్ ‘ ఒక్కసారిగా కోట్లకు పడగెత్తింది. డ్రోన్ల ద్వారా అత్యవసర ప్రాణ రక్షణ మందులను డెలివరీ చేసే ఈ సంస్థ 190 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇన్వెస్టర్ల నుంచి వంద కోట్ల డాలర్లకు పైగా విలువ చేసే సొమ్మును పొందగల స్థాయికి ఎదిగింది. ఆపదలో ఉన్న వారికి రక్తాన్ని, ఇంకా రేబిస్ వ్యాక్సీన్, యాంటీ వీనమ్, తదితరాలను డ్రోన్ల ద్వారా ఈ సంస్థ డెలివరీ చేస్తుంది. ముఖ్యంగా రువాండా, ఘనాల లోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో గల హెల్త్ క్లినిక్ లకు ఈ డ్రోన్లు చేరుకొని ఆ క్లినిక్ లకు వీటిని అందజేయగలుగుతాయి. జిప్ లైన్ టోటల్ కేపిటల్ 225 మిలియన్ డాలర్లకు పెరిగినట్టు ఈ సంస్థ సీఈఓ  కెల్లర్ రినౌడో ప్రకటించారు. తమ సంస్థ డ్రోన్లు 1.75 కేజీల బరువైన వస్తువులను తీసుకువెళ్ళగలవని, అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ గంటకు 68 మైళ్ళ వేగంతో గాల్లో ఎగురగలవని తెలిపారు. రువాండాలో జిప్ లైన్ డ్రోన్లు ఇప్పటివరకు పది లక్షల కిలో మీటర్లకు పైగా ప్రయాణించి.. 14 వేల వరకు డెలివరీలను అందజేశాయి. త్వరలో నార్త్ కెరొలినాలో తమ సంస్థ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *