టెన్షన్‌… టెన్షన్.. ఈ అర్థరాత్రే దేవరగట్టులో కర్రల సమరం..!?

రాత్రి అవడంతో దేవరగట్టులో టెన్షన్‌ టెన్షన్‌. ఈ అర్థరాత్రే దేవరగట్టులో కర్రల సమరం జరిగే సమయం. అందుకు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఆందోళన అందరిలో కనిపిస్తోంది. ఈసారి ఎలాగైనా బన్ని ఉత్సవాన్ని అడ్డుకుని తీరుతామని అధికారులు, పోలీసులు పట్టుదలతో ఉన్నారు…

  • Sanjay Kasula
  • Publish Date - 10:29 pm, Mon, 26 October 20

Devaragattu Festival :  రాత్రి అవడంతో దేవరగట్టులో టెన్షన్‌ టెన్షన్‌. ఈ అర్థరాత్రే దేవరగట్టులో కర్రల సమరం జరిగే సమయం. అందుకు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఆందోళన అందరిలో కనిపిస్తోంది. ఈసారి ఎలాగైనా బన్ని ఉత్సవాన్ని అడ్డుకుని తీరుతామని అధికారులు, పోలీసులు పట్టుదలతో ఉన్నారు. ఎప్పటిలానే ఈసారీ కర్రల సమరం జరిపి తీరుతామని భక్తులు సైతం అంతే కమిట్‌మెంట్‌ కనబరుస్తున్నారు. ఇరువర్గాలు ఎవరికి వారే తమ ఏర్పాట్లలో ఉండటంతో దేవరగట్టులో అర్థరాత్రి హైడ్రామా కొనసాగుతోంది.

ప్రస్తుతం దేవరగట్టులో భక్తుల కంటే పోలీసులే ఎక్కువ సంఖ్యలో కనిపిస్తున్నారు. అడుగడుగునా చెక్‌ పోస్టులతో భక్తులను కట్టడి చేస్తున్నారు. గ్రామంలో 50కిపైగా సీసీకెమెరాలు ఏర్పాటు చేసి భక్తుల కదలికలపై పటిష్టమైన నిఘా ఉంచారు. డ్రోన్‌ కెమెరాలతో దేవరగట్టు ప్రాంతం మొత్తాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఏ ఇద్దరూ గుమ్మికూడకుండా 144 సెక్షన్‌ విధించి దేవరగట్టును తమ కంట్రోల్‌ ఉంచుకున్నారు పోలీసులు.

అటు పోలీసులకు ధీటుగా భక్తులు సైతం బన్ని ఉత్సవానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అంతమంది పోలీసుల పహారా ఉన్నప్పటికినీ.. భక్తులు కర్రల సమరం కోసం అగ్గి దివిటీలు రెడీ చేస్తుండటం ఖాకీలకు షాక్‌ ఇచ్చింది. కర్ర అంచున వస్త్రాన్ని చుట్టి.. దాన్ని నూనెలో ముంచి, మంట అంటించి.. ఆ వెలుగులో మాళమల్లేశ్వర స్వామి కోసం కర్రలతో తలపడుతారు. తలలు పగలగొట్టుకుంటారు. విపరీతమైన రక్తపాతం జరుగుతుంది. అందుకే.. ఏళ్లుగా జరుగుతున్న ఈ కర్రల సమరాన్ని.. ఈసారి ఎలాగైనా ఆపాలని ప్రయత్నిస్తున్నారు అధికారులు. వేలాది మందితో జరిగే బన్ని వేడుకలో కరోనా వ్యాపించే ప్రమాదం ఉన్నా.. భక్తులు అవేమీ పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఎప్పటిలానే కర్రల సమరానికి ఏర్పాట్లు చేసుకుపోతున్నారు.

కర్రల సమరం జరగకుండా చూసేందుకు కఠిన చర్యలు తీసుకున్నారు పోలీసుల. సరిహద్దు ప్రాంతాల్లో 11 పోలీస్‌ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. అలూరు, హోలగొంద, హాలహర్వి మండలాల్లో పూర్తిగా లాక్‌డౌన్‌ విధించారు. ఆర్టీసీ బస్సులను సైతం నిన్న సాయంత్రం నుంచే నిలిపివేశారు. ఏపీ కర్ణాటక సరిహద్దుల్లో మద్యం షాపులు బంద్‌ చేశారు. దేవరగట్టులో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఏడుగురు డీసీపీలు, 28 మంది సీఐలు, 73 మంది ఎస్ఐలతో పాటు వెయ్యి మందికి పైగా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

దేవరగట్టులో కర్రల సమరాన్ని నిషేధించినా.. స్వామి వారి పూజా, కల్యాణ కార్యక్రమాలు మాత్రం యధాతథంగా కొనసాగుతాయి. ఆలూరు, హోళగుంద, హాలహర్వి మండలాల్లోని గ్రామాలకు చెందిన 25 మంది పెద్దల పేర్లను నమోదు చేసుకున్న పోలీసులు.. వారిని మాత్రమే దేవరగట్టులో పూజా కార్యక్రమాలకు అనుమతిస్తామని చెబుతున్నారు. అటు.. ఆలయ నిర్వాహకులు సైతం ఈసారి కర్రల సమరం ఉండదని చెబుతున్నారు. భక్తులు ఇందుకు సహకరించాలని కోరుతున్నారు.