టీఆర్ఎస్ లో అసమ్మతి సెగలు.. టీడీపీకిదే ఛాన్స్ ! రంగంలోకి చంద్రబాబు !

dissent in trs.. chandrababu to take advantage, టీఆర్ఎస్ లో అసమ్మతి సెగలు.. టీడీపీకిదే ఛాన్స్ ! రంగంలోకి చంద్రబాబు !

తెలంగాణలో పాలక టీఆరెస్ పార్టీలో ఇటీవల తలెత్తిన అసమ్మతిని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తనకు అనువుగా మలచుకోవాలని యోచిస్తున్నారట. ఈ రాష్ట్రంలో తమ పార్టీ పునర్వైభవాన్ని సంతరించుకోవాలంటే సెల్ఫ్ రెస్పెక్ట్ (ఆత్మగౌరవం) అనే ‘ మంత్రాన్ని ‘ అందిపుచ్ఛుకోవాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 14 న ‘ ఆత్మీయ సమావేశం ‘ పేరిట హైదరాబాద్ లోని ఎన్ఠీఆర్ ట్రస్ట్ భవన్ లో ఓ సమావేశాన్ని నిర్వహించనున్నట్టు సమాచారం. ఇతర పార్టీల్లో చేరినప్పటికీ.. తమ సేవలను గుర్తించడం లేదని అసంతృప్తితో రగిలిపోతున్న సీనియర్ నేతలను ఈ మీటింగ్ కి ఆహ్వానించనున్నారు. తెలంగాణాలో ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో తమకు పదవులు దక్కలేదని టీఆరెస్ నేతల్లో పలువురు అలక బూనిన సంగతి తెలిసిందే. అయితే సీఎం కేసీఆర్ వారికి త్వరలో ఏదో ఒక పదవిని కేటాయిస్తానని హామీ ఇవ్వడంతో వారు కొంతవరకు శాంతించారు. కానీ ఎంతకాలం వేచి ఉండాలన్నది వారికి ఇంకా అంతుబట్టడంలేదు.

ఈ రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలో లేకున్నా.. పార్టీని బలోపేతం చేయాలన్నదే చంద్రబాబు లక్ష్యంగా చెబుతున్నారు. ఇతర పార్టీల్లో చేరిన బీసీ నాయకులను తిరిగి టీడీపీలో చేరాల్సిందిగా ఆయన ఆహ్వానించే సూచనలు కనిపిస్తున్నాయి. నాగం జనార్దనరెడ్డి వంటి మాజీ టీడీపీ నేతలు తిరిగి పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిధ్ధంగా ఉన్నారని ఓ ఇంగ్ల్లీష్ డైలీ పేర్కొంది కూడా. తెలంగాణాలో నియోజకవర్గాల వారీగా టీడీపీ నేతలతో ఇంటరాక్ట్ కావాలని చంద్రబాబు భావిస్తున్నారని, ప్రతి సోమవారం హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో ఈ సమావేశాలు ఉంటాయని తెలుస్తోంది.
ఈ రాష్ట్రంలో 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ, ఈ ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసి మంచి ఫలితాలు సాధించిన వారితోను, అలాగే స్థానిక ఎన్నికల్లో మండలాల వారీగా విజయానికి చేరువగా వఛ్చినవారితోను చంద్రబాబు మీట్ అవుతారని తెలుస్తోంది.

మొదటిదశలో ఆయన హైదరాబాద్ సహా పాత రంగారెడ్డి, వరంగల్, మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలపై దృష్టి పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ, పార్లమెంట్ స్థాయిలో అడ్ హాక్ కమిటీలను ఏర్పాటు చేయడమే గాక.. జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను కూడా పరిపుష్టం చేయాలన్నది చంద్రబాబు వ్యూహంగా ఉన్నట్టు చెబుతున్నారు. ఈ సంక్షోభ సమయంలో పార్టీకి పూర్తి అండగా ఉండాలని పార్టీ సీనియర్ నేత, మాజీ హోం మంత్రి టి. దేవేందర్ గౌడ్   యోచిస్తున్నారు. తెలంగాణాలో క్షేత్ర స్థాయి నుంచి టీడీపీని బలోపేతం చేయాలని బాబు యోచిస్తున్నట్టు టీటీడీపీ చీఫ్ ఎల్. రమణ అంటున్నారు. దేవేందర్ గౌడ్ వంటివారే కాక.. ఇంకా విజయరామారావు వంటివారిని కూడా టీడీపీ నాయకత్వం బుజ్జగించి మళ్ళీ ఇక్కడ బలపడాలన్నదే ఈ పార్టీ తాజా వ్యూహం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *