ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు అసలు కారణమిదే: తేజ

తక్కువ కాలంలో టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్న హీరోలలో ఉదయ్ కిరణ్ ఒకడు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా టాలీవుడ్‌కు పరిచయమైన ఉదయ్ కిరణ్.. ఆ తరువాత వరుస విజయాలతో అప్పట్లో సెన్సేషనల్ హీరోగా ఎదిగాడు. కారణాలు తెలీదు కానీ ఉదయ్ కిరణ్ కెరీర్ మాత్రం ఉన్నట్లుండి తలకిందులైపోయింది. ఛాన్స్‌లు లేక చాలా ఇబ్బందులు పడ్డ ఈ యువ హీరో జీవితంలోనూ విఫలమై 2014 జనవరి 5న ఆత్మహత్య చేసుకొని తనువు చాలించాడు. అయితే ఉదయ్ కిరణ్ సినీ కెరీర్ విఫలం వెనుక ఎన్నో రూమర్లు వినిపించినా.. అందుకు సాక్ష్యాలు లేవు. ఏదేమైనా అప్పట్లో అతడి మరణం అందరి మనసును కదిలించింది. అయితే ఉదయ్ ఆత్మహత్య చేసుకోకుండా ఉండాల్సిందంటూ పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ఇదిలా ఉంటే తాజాగా ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకోవడానికి అసలు కారణాలు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు దర్శకుడు తేజ.

ఉద‌య్ కిర‌ణ్ అమాయ‌కుడని.. చాలా మంచివాడ‌ని.. ఇండ‌స్ట్రీలో ఉన్న ప‌రిస్థితులు అర్థం చేసుకోలేక చ‌చ్చిపోయాడ‌ని చెప్పుకొచ్చాడు తేజ‌. ఇక్క‌డి మ‌న‌షుల‌ను అర్థం చేసుకోవ‌డం అంత ఈజీ కాద‌ని తేజ పేర్కొన్నాడు. ఇక ఉద‌య్ కిర‌ణ్ మాన‌సిక స్థితి కూడా బాగోలేద‌ని.. వాళ్ళింట్లో అన్న‌య్య కూడా ఆత్మ‌హత్యే చేసుకున్నాడని ఆయన చెప్పాడు. ఇక ఉదయ్‌కు కూడా అదే స‌మ‌స్య ఉండేద‌ని.. ఔన‌న్నా కాద‌న్నా సినిమాకు ముందే ఓ సారి ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నించాడని వెల్లడించాడు. అప్పుడు తానే ఆపి అతడితో సినిమా చేసాన‌ని.. అయితే ఆ త‌ర్వాత మాత్రం కుద‌ర్లేదని చెప్పాడు ద‌ర్శ‌కుడు తేజ‌. ఏదేమైనా కూడా ఓ మంచి మ‌నిషిని కోల్పోవ‌డం బాధ క‌లిగించింద‌ని తేజ భావోద్వేగానికి గురయ్యాడు. కాగా చిత్రం సినిమాతో ఉదయ్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేసిన తేజ.. ఆ తరువాత నువ్వు నేను.. ఔనన్నా కాదన్నా చిత్రాలను తెరకెక్కించిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *