బీసీసీఐకి దినేశ్‌ కార్తీక్‌ బేషరతు క్షమాపణ… ఎందుకు?

Dinesh Karthik Tenders

భారత క్రికెటర్ దినేశ్‌ కార్తీక్‌కు బీసీసీఐ షోకాజ్‌ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కరీబియన్‌ ప్రీమియర్ లీగ్‌ (సీపీఎల్)లో ట్రిన్‌బాగో నైట్‌ రైడర్స్‌ జట్టు ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొన్నందుకు అతడికి నోటీసులు పంపించింది. దీంతో దినేశ్‌ కార్తీక్‌ బీసీసీఐకు బేషరుతుగా క్షమాపణలు చెప్పాడు. వివరాల్లోకెళితే…

వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్‌)లో షారూక్‌ ఖాన్‌కి చెందిన ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ టీమ్‌‌‌తో కలిసి దినేశ్ కార్తీక్ కూర్చున్న ఫొటోలు నెట్‌లో ప్రత్యక్షమయ్యాయి. దీంతో.. అసలు ఏం జరిగిందని బీసీసీఐ విచారించగా.. ట్రిన్‌బాగో జట్టు డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి దినేశ్ కార్తీక్ వెళ్లినట్లు వెలుగులోకి వచ్చింది. ఐపీఎల్‌లో షారుక్‌కి చెందిన కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకి దినేశ్ కార్తీక్‌ కెప్టెన్‌గా ఉన్న విషయం తెలిసిందే.

బీసీసీఐతో సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఉన్న భారత క్రికెటర్.. ప్రైవేట్ లీగ్స్‌లో ఆడటం, ఆటగాళ్లతో కలిసి ప్రమోషనల్ ఈవెంట్స్‌లో పాల్గొనడం నిషిద్ధం. దీంతో.. నిబంధనల్ని ఉల్లఘించిన కార్తీక్‌కి షోకాజ్ నోటీసులు జారీ చేసిన బీసీసీఐ.. వెంటనే వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మ్యాచ్‌ను వీక్షించడానికి కోల్‌కతా నైట్ రైడర్స్‌ కోచ్‌ బ్రెండన్‌ మెక్‌కలమ్‌ కోరడంతో అక్కడికి వెళ్లానని తెలిపాడు. ‘బీసీసీఐ అనుమతి లేకుండా అక్కడికి వెళ్లినందుకు బేషరుతుగా క్షమాపణలు చెబుతున్నాను. ఇక మీద ట్రిన్‌బాగో నైట్‌ రైడర్స్‌కు సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకోను. వారి డ్రెస్సింగ్ రూమ్‌లో ఉండనని స్పష్టం చేస్తున్నాను’ అని బీసీసీఐని అతడు క్షమాపణలు కోరాడు. దీంతో బీసీసీఐ కార్తీక్‌ను క్షమిస్తుందని అందరూ భావిస్తున్నారు.

ఐపీఎల్‌లోని కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు, సీసీఎల్‌లోని ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌కు బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ యజమాని. ఈ ఇరు జట్లకు న్యూజిలాండ్‌ దిగ్గజ ఆటగాడు బ్రెండన్‌ మెక్‌కలమ్‌ కోచ్‌గా నియమితుడయ్యాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కార్తీక్‌ సారథిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పోర్ట్‌ ఆఫ్ స్పెయిన్‌లో సెయింట్‌ కిట్స్‌తో జరిగిన ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ తొలి మ్యాచ్‌కు కార్తీక్‌ను మెక్‌కలమ్‌ ఆహ్వానించాడు. ట్రిన్‌బాగో జట్టు జెర్సీ ధరించి డ్రెస్సింగ్ రూమ్‌లో కార్తీక్ కనిపించాడు. దీంతో క్రమశిక్షణ ఉల్లంఘన చర్యల కింద నీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలంటూ అతడికి బీసీసీఐ సీఈవో రాహుల్‌ జోహ్రీ నోటీసు పంపించారు. బోర్డు కాంట్రాక్ట్ ఆటగాడు అయిన కార్తీక్‌కు ఇతర లీగుల్లో ఆడే అనుమతి లేదు. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్లు ఐపీఎల్‌లో కాకుండా ఇతర ప్రైవేటు లీగుల్లో ఆడటానికి వీల్లేదు.

 

 

Dinesh Karthik Tenders

08/09/2019,3:37PM

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *