పోటీ ఆ ఇద్దరి మధ్యే.. రాంపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో డింపుల్ వర్సెస్ జయప్రద

సమాజ్‌వాదీ పార్టీనుంచి బీజేపీ గూటికి చేరి ఉత్తరప్రదేశ్ రాంపూర్ స్ధానం నుంచి పోటీచేసి ఓటమిపాలైన జయప్రద. కనౌజ్ ఎంపీగా పోటీచేసి ఓటమి పాలైన యూపీ మాజీ సీఎం అఖిలేశ్ సతీమణి డింపుల్.. ఈ ఇద్దరూ ప్రస్తుతం ఒకరిపై ఒకరు పోటీ పడబోతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాంపూర్ స్ధానం నుంచి ఎంపీగా ఆజంఖాన్ గెలుపొందడంతో ఆయన ప్రాతినిధ్యం వహించిన రాంపూర్ అసెంబ్లీ స్ధానానికి ఉపఎన్నిక జరగబోతుంది. ఈ స్దానంలో పోటీ చేసేందుకు బీజేపీ అభ్యర్ధిగా జయప్రద, ఎస్పీ నుంచి డింపుల్ పోటీ చేసే ఛాన్స్ కనిపిస్తున్నాయి.

ఈ స్ధానం ఎస్పీకి కంచుకోట. గతంలో 2009,2014 ఎన్నికల్లో ఎస్పీ నుంచి జయప్రద ఎంపీగా పోటీ చేసి గెలిచారు. గత ఎన్నికల్లో ఆజంఖాన్ చేతిలో ఓడిపోయారు. ఇక్కడి నుంచి డింపుల్‌ను బరిలోకి దించాలని అఖిలేశ్ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో గతంలో జయప్రద ఇదే స్ధానం నుంచి ఎంపీగా గెలుపొందారు గనుక ఈసారి ఎమ్మెల్యేగా నిలపాలని ఆలోచిస్తుందట బీజేపీ. ఈ ఇద్దరూ ఎన్నికల బరిలోకి దిగుతున్నారనే వార్తతో రాంపూర్ ఉప ఎన్నిక ఉత్కంఠకు తెరలేపింది.

ఇక త్వరలోనే ఈ ఎన్నికకు నోటిఫికేషన్ కూడా విడుదల కానుంది. 1980 నుంచి రాంపూర్ స్ధానం సమాజ్ వాదీ పార్టీదే. ఈ పరిస్థితుల్లో అక్కడ ఎలాగైనా జెండా పాతాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. మరోవైపు మొన్నటి వరకు బీజేపీని ఓడించేందుకు ఎస్పీ, బీఎస్పీ రెండూ ఒకతాటిపై పనిచేశాయి. ఎన్నికల ఫలితాల తర్వాత చెరో దారి చూసుకున్నారు. ఈ ఉపఎన్నికలో బీఎస్పీ సాయం చేస్తుందో లేదో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *