రాణిగారిని తాకి ట్రంప్ తప్పు చేశాడా ?

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎక్కడికెళ్లినా ఏదో ఒక ‘ తెంపరి పని ‘ చేస్తూనే ఉంటారని మీడియా కోడై కూయడం కొత్తేమీ కాదు. తన అభ్యంతరకర చేష్టలతో ఆయన సదా వార్తలకెక్కుతూనే ఉంటాడు. గతంలో రష్యా వెళ్ళినప్పుడు తన భార్య మెలనియా చేతిని తన చేతితో పట్టి అందరికీ కనిపించేలా తామో ‘ ఆదర్శ ‘ దంపతులమన్నట్టు లోకానికి చాటాడు. ఇప్పుడు తాజాగా.. బ్రిటన్ పర్యటనలో ఉన్న ఈయన తన గౌరవార్థం బకింగ్ హామ్ ప్యాలస్ లో రాణి ఎలిజబెత్-2 ఇచ్చిన విందుకు హాజరయ్యాడు. ఆమెను అభినందిస్తూ తన ప్రసంగం ముగిశాక.. ఆమె వెనుక వైపు తన ఎడమచేతితో సున్నితంగా తాకాడు. 72 ఏళ్ళ ట్రంప్ 93 ఏళ్ళ రాణి పట్ల ఇలా వ్యవహరించడం రాయల్ ప్రోటోకాల్ ని ఉల్లంఘించడమేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండో ప్రపంచ యుధ్ధ సమయంలో శాంతి, సామరస్యాల కోసం రాణి ఎలిజబెత్ చేసిన ,కృషి, అమెరికా, బ్రిటన్ మధ్య సంబంధాల మెరుగుదలకు ఆమె చూపిన చొరవను ప్రశంసిస్తూ ఆయన మాట్లాడినంతవరకూ బాగానే ఉంది. అయితే ఆ తరువాతే ట్రంప్ తన చర్యతో మరోసారి సంచలనం రేపాడు. రాణిని ఒకరు తాకడం నిషేధమని, రాచరిక కుటుంబం పట్ల ఒకరు ఎలా వ్యవహరించాలన్నది నిబంధనల్లో లేకపోయినప్పటికీ అది ఓ తప్పిదమేనని న్యూస్ ఎక్స్ప్రెస్ పేర్కొంది. రాణిని గానీ, రాచరిక కుటుంబంలో ఎవరినైనా కలిసినప్పుడు గానీ ఒకరి ప్రవర్తనకు సంబంధించి కోడ్ అన్నది లేకున్నా… సంప్రదాయ నిబంధనలు, ఆచారాలంటూ ఉంటాయని..వీటిని పాటించాలనే అంతా భావిస్తారని ఈ రాణి కుటుంబ వెబ్ సైట్ పేర్కొంది. ఏమైనా ట్రంప్ చర్య సోషల్ మీడియాలో పలువురి ఆగ్రహానికి కారణమైంది. ఇది సహించలేని చర్య అని వారు ట్వీట్లు చేసి ఆయనను దుమ్మెత్తి పోశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *