ఉద్ధవ్ సర్కార్‌పై విరుచుకుపడ్డ మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్..

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

  • Shiva Prajapati
  • Publish Date - 9:50 pm, Sat, 28 November 20

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని ‘మహా వికాస్ అఘాడీ’ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విరుచుకుపడ్డారు. మహారాష్ట్రలో ‘మహా వికాస్ అఘాడీ’ ప్రభుత్వం ఏర్పడి నేటికి సంవత్సరం పూర్తయ్యింది. ఈ సందర్భంగా స్పందించిన దేవేంద్ర ఫడ్నవీస్.. మీడియాతో మాట్లాడారు. ఉద్ధవ్ ప్రభుత్వంపై, పరిపాలనా విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల వేళ రైతులకు ఇచ్చిన హామీలను ఉద్ధవ్ ప్రభుత్వం మరిచిపోయిందన్నారు. రైతుల సమస్యలను గాలికి వదిలేసిందని మండిపడ్డారు. పంట నష్టపోయిన రైతులకు ఆర్థికంగా చేయూతనివ్వాల్సిన ప్రభుత్వం.. వారిని గాలికి వదిలేసిందని దుయ్యబట్టారు. అంతేకాదు.. మరాఠా రిజర్వేషన్ల కల్పనలోనూ ఉద్ధవ్ సర్కార్ ఘోరంగా విఫలం అయ్యిందన్నారు. ఉద్ధవ్ పాలన ఎలా ఉందో ఇటీవల హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులే చెబుతున్నాయని వ్యాఖ్యానించారు. విపక్ష పార్టీలను భయబ్రాంతులకు గురిచేయాలని చూస్తున్న ఉద్ధవ్ లాంటి ముఖ్యమంత్రిని తానెప్పుడూ చూడలేదన్నారు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే ఊరుకునేది లేదని దేవేంద్ర ఫడ్నవీస్ తేల్చి చెప్పారు. ప్రశ్నించే వారిని అణిచివేయాలని ప్రభుత్వం చూస్తోందంటూ ఆర్నాబ్ గోస్వామి, కంగనా రనౌత్‌ల పట్ల ఉద్ధవ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఆయన తూర్పారబట్టారు. ప్రభుత్వం ఇకనైనా తన విధానాలను మార్చుకోవాలని హితవుచెప్పారు.