పార్టీ మారినా..తోట నాకు శత్రువే: డిప్యూటీ సీఎం

Pilli subash Chandrabose on siromundanam case, పార్టీ మారినా..తోట నాకు శత్రువే: డిప్యూటీ సీఎం

వైసీపీలో చేరిన తోట త్రిమూర్తులుపై.. ఆ పార్టీ సీనియర్ నాయకుడు, ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామంలో ఆయన వాహన శ్రేణిని ఎస్సీలు అడ్డుకున్నారు. శిరోముండనం కేసుపై తోట త్రిమూర్తులును శిక్షించాలని దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు. కేసు చివరి దశకు చేరుకున్న సమయంలో ప్రధాన నిందితుడైన తోట త్రిమూర్తులను వైకాపాలో ఎందుకు చేర్చుకున్నారని నిలదీశారు. వారికి సమాధానం ఇచ్చిన పిల్లి సుభాష్… పార్టీలో చేరినా తోట త్రిమూర్తులు తనకెప్పుడూ శత్రువే అని తేల్చి చెప్పారు. ఎస్సీలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. శిరోముండనం కేసు కోర్టులో ఉందని… బాధితులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.

వైసీపీకి దళితులు అండగా ఉన్నారని, వారిని తాము వదులుకునే ప్రసక్తేలేదన్నారు. కేసులో ఏదైనా తేడా జరిగితే బాధితులను నేరుగా సీఎం దగ్గరికి తీసుకెళ్తానని, అవసరమైతే దళితులతో కలిసి ధర్నా చేసేందుకైనా తాను సిద్దమని పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ స్పష్టం చేశారు. కాగా, మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు టీడీపీకి గుడ్ బై చెప్పి ఇటీవల వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. సీఎం జగన్ సమక్షంలో తోట త్రిమూర్తులు వైసీపీ కండువా కప్పుకున్నారు. ఆ సందర్భంగా తామంతా కలిసే ఉంటామని తోట త్రిమూర్తులు ప్రకటించారు. కానీ, రెండు రోజుల్లోనే విబేధాలు బయటపడడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *