డిప్యూటీ కలెక్టర్ తీరుకు నిరసనగా 28 మంది వైద్యాధికారుల రాజీనామా

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రాతినధ్యం వహిస్తున్న పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో 28 మంది వైద్యాధికారులు సామూహిక రాజీనామా చేశారు.

డిప్యూటీ కలెక్టర్ తీరుకు నిరసనగా 28 మంది వైద్యాధికారుల రాజీనామా
Follow us

|

Updated on: Aug 13, 2020 | 12:30 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రాతినధ్యం వహిస్తున్న పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో 28 మంది వైద్యాధికారులు సామూహిక రాజీనామా చేశారు. డిప్యూటీ జీఎంవో మృతిచెందిన తరువాత చెల‌రేగిన ఆందోళ‌నల మ‌ధ్య జిల్లాలోని పట్టణ, గ్రామీణ ఆరోగ్య కేంద్రానికి బాధ్యత వహిస్తున్న సీఎంవో తమ రాజీనామాలను చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ విబి సింగ్‌కు సమర్పించారు. ఎక్సురాలో డిప్యూటీ కలెక్టర్ వేధింపులకు పాల్పడుతున్నారని పట్టణ, గ్రామీణ ఆరోగ్య కేంద్రం ఇన్‌ఛార్జులు ఆరోపించారు. వైద్య అధికారుల మూకుమ్మ‌డి రాజీనామాతో ఆరోగ్యశాఖ కదిలివ‌చ్చింది. జిల్లా ఉన్నతాధికారులు… రాజీనామా చేసిన వైద్యాధికారులతో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నారు. డిప్యూటీ క‌లెక్ట‌ర్ వేధింపుల కార‌ణంగానే డిప్యూటీ జీఎంవో తీవ్ర‌మైన ఒత్తిడికి లోన‌య్యార‌ని వైద్యాధికారులు ఆరోపిస్తున్నారు.

ఇదిలావుంటే, అసిస్టెంట్ నోడల్ ఆఫీసర్, డిప్యూటీ కలెక్టర్ ఆగస్టు 9 న ఇన్‌ఛార్జ్ వైద్య అధికారికీ లేఖ రాశారు. కోవిడ్ 19 నియంత్రణలో తీసుకున్న చర్యలపట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరిపట్ల చర్యలకు ఉపక్రమించారు. డాక్టర్ జంగ్ బహదూర్ సింగ్ పూర్తి నిబద్ధతతో పని చేస్తున్నారని, అయితే డిప్యూటీ కలెక్టర్ ఒత్తిడి తెస్తున్నారని, దాని ఫలితంగా అతను మానసికంగా బాధపడుతూ చనిపోయారని వైద్యాధికారులు ఆరోపించారు. ఇందుకు నిరసనగా డిప్యూటీ కలెక్టర్ వేధింపులు భరించలేక వైద్య సిబ్బంది సామూహిక రాజీనామాలకు సిద్ధమయ్యారు.

అటు వైద్య అధికారుల సామూహిక రాజీనామాలు రాష్ట్ర వైద్య ఆరోగ్య విభాగాన్ని కదిలించింది. జిల్లాలోని ఉన్నతాధికారులు వైద్య అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. వారిని ఒప్పించడంలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం జిల్లాలో 24 నగర ఆరోగ్య కేంద్రాలు, ఎనిమిది గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు కొనసాగుతున్నాయి. మరోవైపు వైద్య అధికారుల రాజీనామాలపై పరిపాలనా అధికారులతో మాట్లాడుతున్నామని వారణాసి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ విబి సింగ్ పేర్కొన్నారు. వైద్యాధికారులు తిరిగి విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు.